ఉబ్బసం అనేది శ్వాస సంబంధ సమస్య. ఈ సమస్య వచ్చిన వాళ్లలో శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది ఉంటుంది. సాధారణ సమయంలో బాగానే ఉన్నా అతి చల్లని వాతావరణం ఉన్నప్పుడు, కొన్ని ప్రతికూల వాతావరణ పరిస్థితులలో సమస్య ఎక్కువగా ఉంటుంది. ఈ ఉబ్బసం సమస్య ఎందుకు వస్తుంది అంటే.. 

వాతావరణ కాలుష్యం వల్ల, పీల్చే గాలి కలుషితమైపోయి శ్వాస కోశాన్ని దెబ్బతీయడం వల్ల, ఆహారపు అలవాట్ల వల్ల, నేటి కాలంలో కృత్రిమమైన జీవన విధానం వల్లా ఉబ్బసం వ్యాధి వస్తుంది. ఈ ఉబ్బసం వ్యాధినే ఆస్తమా అని కూడా అంటారు. ముఖ్యంగా ఈ చలి కాలములో ఆస్తమా సమస్య ఉన్నవారు మరింత ఎక్కువ ఇబ్బంది పడతారు. వీరు తీసుకునే ఆహారం, జీవనశైలి మొదలైన విషయాలలో జాగ్రత్తలు తీసుకోవాలి.

జీవన శైలి..

రాత్రి ఎప్పుడో ఆలస్యంగా పడుకుని, ఉదయమేప్పుడో సూర్యుడు నడినెత్తి మీదకు వచ్చాక నిద్రలేవడం వంటి జీవన విధానాన్ని వదిలిపెట్టాలి. ప్రతిరోజూ సూర్యోదయంతో పాటే నిద్రలేవడం అలవాటు చేసుకోవాలి. ఉదయం నిద్ర లేవగానే కాలకృత్యాలు పూర్తి చేసుకుని ముఖం కడుక్కున తరువాత తేనె, తులసి రసం రెండింటిని సమానంగా కలిపి 10గ్రాముల వరకు తీసుకోవాలి. అంటే 5గ్రాముల తేనె, 5 గ్రాముల తులసిరసం తీసుకోవాలి. 

నువ్వుల నూనె తీసుకుని శరీరమంతా పట్టించి బాగా మర్దన చేసుకుని సూర్యుడి లేత ఎండలో గడపాలి.

ఎండలో కొద్దిసేపు ఉన్న తరువాత ఒక బకెట్టు వేడి నీరు, ఒక బకెట్టు చల్ల నీళ్లు తీసుకోవాలి. ఈ నీటిని మొదట రెండు చెంబులు తల మీద, వీపు మీద పోసుకోవాలి. ఆ తరువాత చల్ల నీళ్లు తలమీద నుండి పోసుకోవాలి.  ఇలా మార్చి మార్చి నీటిని పోసుకుంటూ స్నానం పూర్తి చేయాలి. వేసవికాలంలో కూడా ఇదే విధంగా స్నానం చేయాలి. 

ఆస్తమా సమస్య ఉన్నవారు తీసుకునే ఆహారం ఎలా ఉండాలంటే :- 

ఆస్తమా సమస్య ఉన్నవారు తినే ఆహారం కఫం లేకుండా ఉండాలి. ముఖ్యంగా పులుపు, ఉప్పు, కారం మొదలైనవి ఎంత మానుకుంటే అంత మంచిది. నూనెలో వేయించిన పదార్థాలు, దుంపలు మొదలైనవి మానుకోవాలి.  మత్తు మాదకద్రవ్యాలు, కాఫీ, టీలు, ఐస్ క్రీమ్లు చల్లని ఫ్రిజ్లో పెట్టినవి వాడరాదు. పంచదార, బెల్లము తగ్గించి వాడాలి. మలబద్దకం లేకుండా ఉండటానికి  అన్నం తక్కువ కూరలు ఎక్కువ తినాలి. దేహతత్త్యమును బట్టి ఆయా ఋతువులలో దొరికే పండ్లు వాడాలి. పాలు త్రాగాలంటే పిప్పలి, ధనియాలు శొంఠి పౌడరు చేసి డికాషన్ కలిపిన పాలు త్రాగాలి. మనం తినే ఆహారము ఎంత రుచిగా ఉన్నా చాలా తగ్గించి తినాలి. కడుపు నిండుగా అతిగా తినకూడదు. కడుపులో ఎప్పుడూ కాస్త కాళీ ఉండేట్టుగా తినాలి. ఎప్పుడూ ఆకలి కలిగిఉండాలి. చిరుతిండ్ల జోలికి వెళ్లకూడదు. 

వ్యాయామము:- ప్రతిరోజూ ఉదయం స్నానం చేయగానే సూర్యనమస్కారములు చేయాలి. ఇలా  చేసినవారికి ఉబ్బసమే కాదు సమస్త వ్యాధులు నయమైపోతాయి.

                                                ◆నిశ్శబ్ద.