ఆరోగ్యకరమైన మంచి నిద్ర అందరికీ ఇష్టమే.. అయితే ఈమధ్య కాలంలో నిద్ర కూడా యాంత్రికం అయిపోయింది. మరబొమ్మలాగా అలా పడుకోవడం, అలారం మొగగానే లేచి పనులలోకి జారుకోవడం ప్రతి ఒక్కరికీ అలవాటు అయిపోయింది. అయితే మంచి నిద్ర ఇక ఎవరికీ సాధ్యం కాదేమో అనుకుంటే పొరపాటు. ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకులు సద్గురు జగ్గీ వాసుదేవ్ అంటారు- నాకు మూడు గంటల నిద్ర అయినా లక్షణంగా సరిపోతుంది అని. కానీ కొంతమంది మాత్రం 7 నుండి 8 గంటలు నిద్రపోయిన నిద్రసరిపోలేదు అని వాపోతుంటారు. దీనికి కారణం ఏమిటంటే… పడుకోవడం వేరు, నిద్రపోవడం వేరు. నిద్ర అనేది మనిషికి పూర్తి వ్యవస్థను ఒక ట్రాన్స్ లోకి పంపినట్టు ఉండాలి. అది ఎలాగుంటుంది అంటే శరీరం ఒక శవ స్థితికి వెళ్ళిపోతుంది. కానీ ప్రస్తుతం అందరూ నిద్రపోయే తీరు ఎలాగుంటుంది అంటే అందరిదీ కోడి నిద్ర. నిద్రపోతున్నాం అనేమాటే కానీ చీమ చిటుక్కుమన్నా, లైటు చటుక్కున వెలిగినా లేచి కూర్చుంటారు. మరి ఎలా??  గొప్పవారికి సాధ్యమైనట్టు  కొద్దిసేపటి నిద్ర మన దేశానికి సరిపడిన శక్తిని, విశ్రాంతిని ఎలా ఇస్తుంది అని అనుకుంటారు చాలామంది. అయితే సుఖమైన నిద్ర కొద్దిసేపు అయినా ఎంతో శక్తిని శరీరంలోకి విడుదల చేస్తుంది. 


అద్భుతమైన నిద్రకోసం కొన్ని అమేజింగ్ చిట్కాలున్నాయి…


ఈ మాత్రం మాకు తెలియదా అంటారు కొందరు. కానీ మంచి నిద్రకు మొదటి చిట్కా సమయపాలన. ప్రతి రోజూ ఒకే సమయానికి నిద్రపోవడం అలవాటు చేసుకోవాలి. దీనివల్ల శరీరం ఆ సమయానికి విశ్రాంతి స్థితిలోకి వెళ్లడం అలవాటు పడుతుంది. శరీరం ఇలా అలవాటు పడితే ఇతర అవాంతరాల ప్రభావానికి లోనవ్వదు. హాయిగా నిద్రపోవచ్చు. 


రాత్రిపూట పండుకునేముందు చాలామందికి చల్లగా ఏమైనా తాగాలని అనిపిస్తుంది. అయితే ఈ చల్లటి పానీయాలను త్రాగకూడదు.  చల్లని పానీయాలు జీర్ణం అవడానికి చాలా శక్తి ఖర్చు అవుతుంది. 


ఇంకా కొందరికి నిద్రపోయే ముందు టీవీ చూడటం, పాటలు వినడం వంటి అలవాటు ఉంటుంది. అయితే అది చాలా తప్పు. నిద్రపోవడానికి అరగంట ముందే అన్నిటినీ బంద్ చేయాలి. మొబైల్ ఫోన్ కూడా దూరంగా పెట్టి పడుకోవాలి. 


నిద్రపోయేవారికి కొందరికి తలకింద చాలా ఎత్తుగా ఉన్న దిండ్లు పెట్టుకోవడం అలవాటుగా ఉంటుంది. అయితే ఇలా ఎత్తైన దిండ్లు పెట్టుకోకూడదు.


నిద్రకు ఆహారానికి దగ్గర సంబంధం ఉంటుంది. చాలామంది ఫుల్ గా తింటే ఎక్కువ శక్తి వస్తుందని బాగా నిద్ర పడుతుందని అంటారు. కానీ రాత్రి పూట ఎక్కువ తినకూడదు. కడుపు కాస్త తేలికగా ఉండాలి. దీనివల్ల శరీరం కూడా తేలికగా ఉండి మంచి నిద్ర వస్తుంది. అంతేనా శరీరంలో జరిగే క్రియలు కూడా అస్తవ్యస్తం కావు. అదే ఎక్కువ తింటే శరీరంలో క్రియలు వేగంగా ఉంటాయి. దానివల్ల నిద్ర సరిగా పట్టదు. 


ఈ చిట్కాలు పాటిస్తే అందరికీ సుఖవంతమైన నిద్ర సొంతమవడం ఖాయం.


                                      ◆నిశ్శబ్ద.