.webp)
దాహంగా అనిపించినప్పుడు, గొంతు పొడిగా మారినప్పుడు నీరు తాగడం సహజం. అయితే ఇలా నీరు తాగగానే.. మళ్లీ కాసేపటికే వెంటనే దాహం వేస్తుంది కొందరికి. దీని గురించి చాలామంది పట్టించుకోరు. ఇదేమైనా ఆరోగ్య సమస్య ఏమో అని కొందరు సందేహ పడుతూ ఉంటారు. కానీ నిజానికి ఇదిశరీరంలో ఏదో అనారోగ్యానికి సంకేతం కాదని, కానీ.. శరీరంలో ఏదో ఒక సమస్యను మాత్రం ఖచ్చితంగా సూచిస్తుందని అంటున్నారు. చాలా వరకు ఎన్ని సార్లు నీరు తాగినా మళ్లీ దాహం వేయడానికి అసలు కారణం శరీరం డీహైడ్రేషన్ అవ్వడమే.. ఎక్కువ శారీరక కష్టం చేయడం.. అధికంగా చెమట పట్టడం, ఎండకు గురికావడం లేదా అధికంగా ఉప్పు తీసుకోవడం వంటివన్నీ శరీరాన్ని డీహైట్ర్ అయ్యేలా చేసి ఎక్కువ దాహం వేయడానికి కారణం అవుతాయి. కానీ ఎక్కువ దాహం కావడానికి ఇతర కారణాలు కూడా ఉన్నాయి. అవేంటో తెలుసుకుంటే..
మధుమేహం..
ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, తరచుగా చాలా దాహం వేయడం అనేది మధుమేహానికి ఒక తొలి లక్షణం కావచ్చని అంటున్నారు. రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగినప్పుడు, శరీరం అదనపు గ్లూకోజ్‌ను మూత్రం ద్వారా బయటకు పంపడానికి ప్రయత్నిస్తుంది, ఈ ప్రక్రియలో నీరు కూడా విసర్జించబడుతుంది, దీనివల్ల తరచుగా దాహం వేస్తుంది.
మూత్రపిండాల ఆరోగ్యం..
మూత్రపిండాలు శరీరంలో నీరు , ఎలక్ట్రోలైట్ల సమతుల్యతను కాపాడుతాయి. మూత్రపిండాలు సరిగ్గా పనిచేయకపోతే, ఈ సమతుల్యతకు భంగం వాటిల్లి, తరచుగా దాహం వేయడానికి దారితీస్తుంది. ఈ లక్షణం మూత్రపిండాలకు సంబంధించిన సమస్యను కూడా సూచించవచ్చు.
డయాబెటిస్ ఇన్సిపిడస్..
డయాబెటిస్ ఇన్సిపిడస్ అనేది శరీరంలో ఒక నిర్దిష్ట హార్మోన్ లోపించడం వల్ల కలిగే సమస్య. దీనివల్ల అధిక దాహం , తరచుగా మూత్రవిసర్జన కలుగుతాయి. ఇది డయాబెటిస్ మెల్లిటస్ కు భిన్నంగా ఉంటుంది, కానీ దీని లక్షణాలు చాలా వరకు ఒకేలా ఉంటాయి.
నోరు పొడిబారడం..
కొన్నిసార్లు, తగినంత లాలాజలం ఉత్పత్తి కాకపోవడం వల్ల ఎప్పుడూ దాహం కలుగుతుంది, ఈ పరిస్థితిని నోరు పొడిబారడం అంటారు. దీనివల్ల నోరు, గొంతు, నాలుక పొడిబారవచ్చు, కొన్నిసార్లు పెదవులు కూడా పగలవచ్చు. ఈ సమస్య కొన్ని మందుల దుష్ప్రభావంగా కూడా ఎదురవుతుంది.
వైద్యుడిని ఎప్పుడుసంప్రదించాలి?
పై లక్షణాలు కొనసాగితే, ముఖ్యంగా మధుమేహం, మూత్రపిండాల వ్యాధి లేదా హార్మోన్ల సమస్యలు వంటి ముందు నుంచే ఆరోగ్య సమస్యలు ఉన్నవారిలో, వాటిని తేలికగా తీసుకోకూడదు. ఈ లక్షణాలు పిల్లలు , వృద్ధులలో మరింత తీవ్రంగా ఉంటాయి. కాబట్టి సకాలంలో రోగ నిర్ధారణ , సరైన చికిత్స చాలా అవసరం.
*రూపశ్రీ.




