చలికాలం వాతావరంలో మార్పులతో పాటు ఎన్నోరకాల ఆరోగ్య సమస్యలను వెంటబెట్టుకువస్తుంది. ప్రతి ఏడాది ఇది మామూలే కదా అని సులువుగా తీసుకోలేం. ఎందుకంటే రాను రాను వేసవిలో ఎండలు, చలికాలంలో చలి తీవ్రత పెరుగుతూ వస్తోంది. వీటిని భరించడం చాలా మంది వల్ల కావట్లేదు. వృద్దులు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వ్యక్తులు, చిన్న పిల్లలు చలికారణంగా ప్రమాదకరమైన జబ్బుల బారిన పడతారు. తగ్గిపోతాయని సాధారణ మందులు వాడేలోపే ఇవి చాలా ప్రమాదకర స్థాయికి చేరుకునే అవకాశం ఉంటుంది. చలికాలంలో చాలా మామూలుగా వచ్చి ప్రాణాలకు ముప్పు కలిగించే నాలుగు జబ్బుల గురించి తెలుసుకుంటే..
ఇన్ఫ్లుఎంజా..
ఇన్ఫ్లుఎంజాను ఫ్లూ అని కూడా పిలుస్తారు. ఇది వైరస్ వల్ల కలిగే అంటు వ్యాధి. ఇది ముక్కు గొంతును ప్రభావితం చేస్తుంది. చలికాలంలో ఫ్లూ ప్రమాదం పెరుగుతుంది. జ్వరం, గొంతు నొప్పి, ముక్కు కారటం, తలనొప్పి, అలసట, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది మొదలైనవి దీని లక్షణాలు. పొడి దగ్గు కఫం కూడా ఫ్లూ లక్షణాలలో ఉంటాయి. చలికాలంలో ముక్కు కారడం, తరచుగా తుమ్ములు, దగ్గు చాలా సాధారణం. ఇది తేలికగానూ ఉండవచ్చు, తీవ్రమైన సమస్యగానూ ఉండచ్చు. ఇది ఒకటి నుండి రెండు వారాల్లో నయమవుతుంది. అయితే చాలా కాలం పాటు కొనసాగితే అది న్యుమోనియాకు దారితీస్తుంది.
శ్వాసకోశ సమస్యలు..
జలుబు చలికాలంలో వచ్చే సాధారణ సమస్య. ఇది శ్వాసకోశ సమస్యలకు మూలం. ముక్కు కారడం, తరచుగా తుమ్ములు, దగ్గు, కఫం వంటి సాధారణ లక్షణాలన్నీ శ్వాసకోశ సమస్యలలో ఉంటాయి. ఇవి మూడు నుండి నాలుగు రోజుల్లో నయమవుతాయి. కొందరిలో ఇది వచ్చినప్పుడు అన్ని లక్షణాలతోపాటు గొంతునొప్పి, తలనొప్పి కూడా కనిపిస్తాయి. కొందరికి జ్వరం కూడా రావచ్చు.
బ్రోన్కైటిస్..
చలికాలంలో చల్లని వాతావరణం బ్రోన్కైటిస్ ప్రమాదాన్ని మరింత పెంచుతుంది. ఇది సాధారణ ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్. దీని కారణంగా ఊపిరితిత్తులలో వాపు ఏర్పడుతుంది. బ్రోన్కైటిస్ కారణంగా దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఛాతీ నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ లక్షణాలే కాకుండా, కొంతమందికి ముక్కు దిబ్బడ, జ్వరం మొదలైనవి కూడా ఉండవచ్చు.
గొంతునొప్పి.. స్ట్రెప్ థ్రోట్..
స్ట్రెప్ థ్రోట్ అనేది పిల్లలలో సర్వసాధారణంగా కనిపించే ఒక రకమైన గొంతు సమస్య. ఇది స్ట్రెప్టోకోకల్ బ్యాక్టీరియా వల్ల వచ్చే బాక్టీరియల్ ఇన్ఫెక్షన్. ఈ ఇన్ఫెక్షన్ వల్ల గొంతులో మంట, వాపు వస్తుంది. కొంతమందికి జ్వరంతో పాటు గొంతులో నొప్పి కూడా ఉండవచ్చు. కానీ కొందరు స్ట్రెప్ థ్రోట్, గొంతు నొప్పి మధ్య గందరగోళానికి గురవుతారు. కానీ రెండింటి మధ్య వ్యత్యాసం ఉంటుంది. దానిని సరిగ్గా గుర్తించి చికిత్స చేయడం చాలా ముఖ్యం. స్ట్రెప్ థ్రోట్ అనేది బాక్టీరియల్ ఇన్ఫెక్షన్. గొంతు నొప్పి సాధారణం సంక్రమణ. స్ట్రెప్ థ్రోట్ యాంటీబయాటిక్స్‌తో చికిత్స చేస్తారు. అయితే గొంతు నొప్పి కాలక్రమేణా నయమవుతుంది.
*నిశ్శబ్ద.