శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి ఆరోగ్యకరమైన, పోషకమైన ఆహారాన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం చాలా ముఖ్యం. పౌష్టికాహారం తీసుకుంటేనే మనకు అవసరమైన అన్ని పోషకాలు లభిస్తాయి. అనారోగ్యకరమైన ఆహారం, శారీరక శ్రమలేకపోవడం అనే రెండు చెడు అలవాట్లే ప్రస్తుతం చాలా వ్యాధులకు ప్రధాన కారణమని డైటీషియన్లు చెబుతున్నారు.ఆహారంలో పోషక విలువలపై మాత్రమే శ్రద్ధ వహిస్తే, మధుమేహం, గుండె వంటి ప్రాణాలను బలికొనే వ్యాధుల ప్రమాదాన్ని 40 శాతం తగ్గించవచ్చు. అయితే చాలామందికి పోషకాహారం తినడమే కాదు, దాన్ని సమకూర్చుకోవడం, పోషకాహరంలో ఏ ఆహారం ఉండాలి? ఎలాంటి ఆహారం ఉండాలి అనే అవగాహన ఉండదు. ఆరోగ్యకరమైన పోషకాహారానికి, మంచి ఆరోగ్యానికి మధ్య ఉన్న సంబంధాల గురించి ప్రజలకు అవగాహన కల్పించే లక్ష్యంతో ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 1 నుండి 7 వరకు జాతీయ పోషకాహార వారోత్సవాలను జరుపుకుంటారు. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, మొత్తం శరీరం ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండాలంటే రెయిన్‌బో డైట్‌ను అనుసరించడం చాలా ముఖ్యం. అసలు రెయిన్ బో డైట్ అంటే ఏంటి? ఇందులో ఏయే ఆహారాలు, కూరగాయలు, పండ్లు ఉండాలి? ఈ విషయాల గురించి పూర్తీగా తెలుసుకుంటే..
రెయిన్‌బో డైట్
సమర్థవంతమైన ఆరోగ్యానికి రెయిన్ బో డైట్ చాలా ముఖ్యమైనది. ఇది పూర్తీ శరీర సామర్థ్యానికి సహాయపడుతుంది. రెయిన్‌బో డైట్ అంటే వివిధ రంగుల పండ్లు కూరగాయలను ఆహారంలో చేర్చడం. రంగురంగుల పండ్లు, కూరగాయలలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు సమృద్దిగా ఉంటాయి, ఇవి శరీరానికి అనేక విధాలుగా ప్రయోజనాన్ని చేకూరుస్తాయి. రెయిన్‌బో డైట్‌లో ముఖ్యమైనవి ఏవంటే..
ఎరుపు రంగు పండ్లు, కూరగాయలు..
ఎరుపు రంగు పండ్లు, టమోటాలు, స్ట్రాబెర్రీలు లాంటి ఇతర కూరగాయలు విటమిన్లు, పోషకాలను సమృద్ధిగా కలిగి ఉంటాయి. చాలా పండ్లలో విటమిన్ ఎ, పొటాషియం, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి, ఇవి శరీరానికి అనేక విధాలుగా మేలు చేస్తాయి. రోజువారీ ఆహారంలో ఎరుపు రంగు పండ్లు, కూరగాయలను చేర్చుకోవాలి.
ఆరెంజ్ పండ్లు, కూరగాయలు..
ఎరుపు రంగు పండ్లతో పాటు నారింజ రంగు పండ్లు కూరగాయలను కూడా ఆహారంలో చేర్చుకోవాలి. ఎరుపు, నారింజ కూరగాయలలో అధిక మొత్తంలో విటమిన్ ఎ ఉంటుంది, ఇది నోటిలోని లాలాజల గ్రంథులు, శ్లేష్మ కణజాలాల ఆరోగ్యానికి అవసరం. ఈ విటమిన్ లోపం వల్ల దంతాలు బలహీనపడతాయి. విటమిన్ ఎ కళ్ళ ఆరోగ్యానికి చాలా అవసరం. నారింజ రంగు పండ్లు, కూరగాయల ద్వారా విటమిన్ ఎ శరీరానికి సమర్థవంతంగా అందుతుంది.
తెలుపు రంగులో ఉండే పండ్లు, కూరగాయలు..
తెల్లటి పండ్లు, కూరగాయలు శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంతో పాటు అధిక రక్తపోటు సమస్య నుండి ఉపశమనాన్ని అందిస్తాయి. వాటిని తీసుకోవడం వల్ల గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది శరీర రోగనిరోధక శక్తిని పెంచే ప్రభావాన్ని కూడా కలిగి ఉంటుంది. తెల్లటి పండ్లు, కూరగాయలలో లభించే పోషకాలు పెద్దప్రేగు, ప్రోస్టేట్ మరియు రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తాయి. క్యాలీ ఫ్లవర్, అరటిపండు, సీతాఫలం, పచ్చి టమోటా, ముల్లంగి వంటివి ఇందులో భాగంగా తీసుకోవచ్చు.
ఆకు కూరలు, ఆకుపచ్చ కూరగాయలు, పండ్లు..
ఆకుకూరల్లో ఫోలేట్‌లో సమృద్ధిగా ఉంటుంది. ఇది న్యూరోట్రాన్స్‌మిటర్ ఉత్పత్తికి, మానసిక స్థితి స్థిరత్వానికి బాగా పనిచేస్తుంది. అలాగే ఆకుపచ్చ రంగులో ఉండే బ్రోకలి, క్యాప్సికమ్, కాకర వంటి కూరగాయలు, ఆకుపచ్చ రంగులో ఉండే పండ్లలో ఫోలెట్ పొందవచ్చు.
పర్పుల్ కలర్ ఆహారాలు..
ద్రాక్ష, బ్లాక్‌బెర్రీలు, రేగు వంటి ఊదారంగు పండ్లను ఆహారంలో చేర్చుకోవాలి. వీటిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, న్యూరోప్రొటెక్టివ్ ప్రభావాలను కలిగి ఉన్న ఆంథోసైనిన్‌లు ఉంటాయి.
తృణధాన్యాలు..
క్వినోవా, బ్రౌన్ రైస్, హోల్ వీట్ వంటి రంగురంగుల తృణధాన్యాలను ఎంచుకోవాలి. ఈ ధాన్యాలు స్థిరమైన శక్తిని అందిస్తాయి, మెరుగైన మానసిక స్థితిని, అభిజ్ఞా పనితీరును మెరుగు పరుస్తాయి.
గింజలు, విత్తనాలు..
బాదం, వాల్‌నట్‌లు, చియా గింజలు, అవిసె గింజలు వంటి వివిధ రకాల గింజలను అల్పాహారంలో భాగం చేయాలి. వీటిలోని ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్ మెదడు ఆరోగ్యానికి తోడ్పడే అవసరమైన పోషకాలను అందిస్తాయి.
కొవ్వులు..
చేపలు, చికెన్, చిక్కుళ్ళు, టోఫు వంటి ప్రోటీన్ మూలాలను ఆహారంలో భాగం చేసుకోవాలి. ఈ ఆహారాలు న్యూరోట్రాన్స్మిటర్ ఉత్పత్తికి అవసరమైన అమైనో ఆమ్లాలను అందిస్తాయి.
మూలికలు, సుగంధ ద్రవ్యాలు..
పసుపు, అల్లం, రోజ్మేరీ వంటి మూలికలు, సుగంధాలను తీసుకోవాలి. అవి యాంటీ ఇన్ఫ్లమేటరీ, కాగ్నిటివ్-పెంచే లక్షణాలను కలిగి ఉండే సమ్మేళనాలను కలిగి ఉంటాయి.
*నిశ్శబ్ద.