పుట్టుకతో వచ్చిన బుద్ధి పుడకలతో కానీ పోదంటారు పెద్దలు. ఆ సంగతేమో కానీ పుట్టిన తరువాత నేర్చుకున్న కొన్ని అలవాట్లు పోయిన తరువాత కూడా మనల్ని వీడిపోవంటున్నారు శాస్త్రవేత్తలు. మనం ఏదన్నా వ్యసనానాకి లోనైతే, దాని తాలూకు కొన్ని లక్షణాలని మరణం తరువాత కూడా గమనించవచ్చునంటున్నారు.

 

FosB

 

ఈ FosB అనేది మన మెదడులో కీలక పాత్రని పోషించే ఒక ప్రొటీన్. మెదడులోని వేర్వేరు కణాల మధ్య సమాచారాన్ని ప్రసారం చేయడంలో ఇది ముఖ్య పాత్ర వహిస్తుంది. అంతేకాదు! మెదడులో ఏ జన్యువులు ఎలాంటి పని చేయాలో కూడా ఈ ప్రొటీన్ నిర్దేశిస్తుంది. అయితే మనిషి హెరాయిన్ వంటి మత్తు పదార్థాలకు బానిసగా మారిపోయినప్పుడు ఈ FosB కాస్తా మారిపోతుంది.

 

Delta FosB

 

మత్తుపదార్థాలకి బానిసలైనవారిలో మారిపోయిన FosBని Delta FosB అంటారు. దీని వల్ల మెదడులో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకుంటాయి. ఇది మెదడులోని వికాసాన్ని అడ్డుకోవడమే కాకుండా, న్యూరాన్ల నిర్మాణాన్ని కూడా దెబ్బతీస్తుంది. ఒక్కమాటలో చెప్పాలంటే ఇంతకుముందు ఏ ఏ వ్యవస్థల మీద ఇది సానుకూల ప్రభావాన్ని చూపిందో ఇప్పుడు అదే వ్యవస్థలని నిర్వీర్యం చేస్తుంది. ఆగిపోయినా కూడా ఒక మనిషి ఏదో వ్యసనానికి బానసై తిరిగి మామూలుగా ఉండాలని ప్రయత్నిస్తే, అప్పుడు ఈ Delta FosB తిరిగి మామూలు స్థితికి చేరుకుంటుందా అన్న అనుమానం వచ్చింది పరిశోధకులకి. ఇందుకోసం వారు మత్తుకి బానిసలై మరణించిన ఓ 15 మంది మీద పోస్టుమార్టం నిర్వహించారు. ఆశ్చర్యంగా.. చనిపోయిన తరువాత కూడా వారి మెదడులో ఈ Delta FosB కనిపించింది. దాదాపు పది రోజుల వరకూ కూడా Delta FosB వారి మెదడులో నిర్వీర్యం కాకుండా ఉండటాన్ని గమనించారు.

 

చికిత్సకి మార్గం

 

చనిపోయినా కూడా వ్యసనం తాలూకు ఆనవాళ్లు కనిపించాయంటే ఇక బతికున్నప్పుడు దీని ప్రభావం సంగతి చెప్పేదేముంది. ఒక వ్యక్తి తాను వ్యసనం నుంచి బయటపడినా కూడా, అతని మెదడులో Delta FosB కొన్ని నెలలపాటు దుష్ప్రభావాలు చూపుతూనే ఉంటుందని తేలింది. మత్తుపదార్థాలకి బానిసలైనవారికి చికిత్సని అందించేటప్పుడు ఈ విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలని కోరుతున్నారు పరిశోధకులు. హమ్మయ్య రోగి వ్యసనం నుంచి తప్పుకున్నాడు కదా! అని ఊపిరి పీల్చుకోకుండా కొన్ని నెలల పాటు అతడిని నిశితంగా గమనిస్తూ ఉండమని సూచిస్తున్నారు. అంతేకాదు! చనిపోయిన వ్యక్తుల మీద ప్రయోగాలు చేయడం వల్ల ఇలాంటి విలువైన విషయాలు ఎన్నో బయటపడే అవకాశం ఉందనీ... కాబట్టి మానవాళికి సంబంధించిన కీలకమైన వైద్య విషయాలను పరిశోధించేందుకు శవాల మీద కూడా ప్రయోగాలు చేయవచ్చుననీ సూచిస్తున్నారు.

- నిర్జర.