మత్తు వదలరా నిద్దుర మత్తు వదలరా... ఆ మత్తులోన పడితే గమ్మత్తుగా చిత్తై పోదువురా అని ఓ సినిమా కవి చెప్పిన మాట అక్షర సత్యం. నిద్ర మనకు విశ్రాంతిని ఇస్తుంది. అయితే అతి నిద్ర విశ్రాంతినిచ్చే సంగతి దేవుడెరుగు... అసలు ప్రాణాలే హరించే ప్రమాదం వుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. అతనిద్రాలోలుడు.. తెలివిలేని మూర్ఖుడు అని అంటారు.. కానీ ఇప్పుడు అతినిద్రాలోలుడు మృత్యువుకి ఆప్తుడు అని నిస్సందేహంగా అనవచ్చు. ఎందుకంటే, ఈ విషయాన్ని సిడ్నీ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు బల్ల గుద్ది మరి చెబుతున్నారు. సదరు శాస్త్రవేత్తలు బల్ల గుద్దిన శబ్దం విని అయినా అతి నిద్ర లోలులకు మెలకువ వస్తుందో... రాదో!

నిద్ర అనే అంశం మీద సిడ్నీ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు ఈమధ్య భారీ స్థాయిలో పరిశోధనలు చేశారు. వారి పరిశోధనలకు సంబంధించిన సారాంశాన్ని బయటి ప్రపంచానికి వెల్లడిస్తూ, ‘‘రోజుకు తొమ్మిది గంటలకు మించి నిద్ర పోయేవారు త్వరగా మృత్యువుకు చేరువవుతారు’’ అని తేల్చారు. దాదాపు రెండు లక్షల 30 వేల మందికి పైగా అనారోగ్యంతో బాధపడుతున్న వారి ఆరోగ్య పరిస్థితిని పరిశీలించిన అనంతరం ఈ శాస్త్రవేత్తలు ఈ నిద్రారణకు.. కాదు.. నిర్ధారణకు వచ్చారు. ఎక్కువగా నిద్రపోయేవారు మాత్రమే కాదు.. ఎక్కువగా కూర్చునే వుండేవారు కూడా త్వరగా బాల్చీ తన్నేసే ప్రమాదం వుందని వారు హెచ్చరిస్తున్నారు.

ఎంత నిద్ర పోవాలో అంత నిద్రపోయేవారు, ఎంతసేపు కూర్చోవాలో అంతసేపే కూర్చుని శరీరాన్ని ఎక్కువగా అలసిపోయేలా చేసేవారికంటే ఎక్కువగా నిద్రపోయేవారు, ఎక్కువసేపు కూర్చునే వుండేవారు త్వరగా మృత్యువు ఒడిలోకి జారిపోతారని సిడ్నీ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అతిగా మద్యపానం చేసేవారు, అతిగా ధూమపానం చేసేవారికంటే అతిగా నిద్రపోయేవారికే మృత్యుగండం ఎక్కువగా వుంటుందని వారు హెచ్చరిస్తున్నారు. రోజుకు ఆరు గంటలు మాత్రమే నిద్రపోవడం చాలా మంచిదని వారు సూచిస్తున్నారు. ఎంత తక్కువగా కూర్చుంటే అంత మంచిదని కూడా చెబుతున్నారు.