కోవిడ్ అనే పేరు వింటేనే ఎంత భయపడతామో అందరికీ తెలిసిందే. కరోనా మొదలైన దగ్గరనుండి అది వివిధ రకాల వేవ్ లు అంటూ ప్రజల మధ్యకు చొచ్చుకు వస్తూనే ఉంది. ఇది రెండు సార్లు చాలా పెద్ద విలయతాండవమే సృష్టించింది. చాలామంది కోవిడ్ కారణంగా చావు అంచులదాకా వెళ్లివచ్చారు. కోవిడ్ మరణపు రుచి చూపించిన తరువాత చాలామంది ఆరోగ్య దృష్ట్యా తీసుకుంటున్న జాగ్రత్తలే ప్రాణాల మీదకు తెస్తున్నాయని వైద్యులు అంటున్నారు. సాక్షాత్తూ కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రే కోవిడ్ వచ్చి తగ్గినవారు ఎవరూ రెండేళ్ల వరకు కొన్ని పనులు చేయకూడదంటూ ప్రకటన విడుదల చేశారు. కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ ఎల్ మాండవ్య తెలిపిన ఆ విషయాలేంటో తెలుసుకుని వాటిని ఫాలో అవ్వడం ప్రతి ఒక్కరి కర్తవ్యం కూడా..
కోవిడ్ సంభవించిన చాలామంది మీద పరిశోధనలు, దేశంలో సంభవిస్తున్న మరణాలను సర్వే చేసిన వైద్యులు కొన్ని విస్తుపోయే నిజాలు వెలిబుచ్చారు. దేశంలో సంభవిస్తున్న గుండెపోటు మరణాలలో కోవిడ్ గుప్పెట్లో చిక్కుకుని నరకం అనుభవించి మరీ బయటపడినవారే అధికశాతం మంది ఉన్నారు. అందుకే కోవిడ్ వచ్చి దాని నుండి బయటపడినవారు ఎవరూ అధికబరువులు ఎత్తడం, రన్నింగ్ చేయడం, వేగవంతమైన డాన్స్, ఏరోబిక్ వ్యాయామాలు, అధిక శ్రమతో కూడుకున్న ఇంటి పనులు మొదలైనవాటికి దూరంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.
తీవ్రమైన వ్యాయామానికి, గుండెపోటుకు మధ్యగల సంబంధం గురించి వైద్యులు చేసిన పరిశోధనలలో చాలా షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. చాలా తీవ్రమైన వ్యాయామాలు చేసినప్పుడు రక్తపోటు, శరీరం డీహైడ్రేషన్ కు గురికావడం చాలా వేగంగానూ, ఆకస్మాత్తుగానూ జరుగుతున్నాయని వైద్యుల పరిశోధనలలో తేలింది. ఇది గుండెమీద ఒత్తిడి కలిగించి గుండెపోటుకు దారితీస్తుంది. ఇప్పటికే అధిక రక్తపోటు, గుండె సంబంధ సమస్యలతో ఇబ్బంది పడుతున్నవారికి ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుంది.
పైన చెప్పుకున్న విషయాల ప్రకారం కోవిడ్ బాధితులలో గుండె సంబంధ సమస్యల ప్రమాదం ఎక్కువ కాబట్టి వ్యాయామం ఆపేయాలనే ఆలోచన రావచ్చు. కానీ గుండె ఆరోగ్యంగా ఉండటానికి వ్యాయామం చాలా అవసరం. అయితే తీవ్రమైన వ్యాయామం గుండెను దెబ్బతీస్తుంది. కాబట్టి కోవిడ్ నుండి బయటపడినవారు గుండె ఆరోగ్యానికి, శారీరక ఫిట్నెస్ కోసం తేలికపాటి వ్యాయామాలను మాత్రమే ఎంచుకోవాలి. వాకింగ్, మెట్లు ఎక్కడం, యోగా, సైక్లింగ్ వంటి వ్యాయామాలు ప్రతిరోజూ చేయవచ్చు. అయితే నిశ్చలమైన జీవనశైలి నుండి మాత్రం తప్పక బయటపడాలి. ఒకే రకమైన జీవనశైలి ఉంటే శరీరానికి తగినంత మార్పు లభించదు. కాబట్టి తేలికపాటి వ్యాయామాలు చేస్తూ గుండెను, ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుకోవాలి.
*నిశ్శబ్ద.