సీజన్ల వారిగా లభించే పండ్లలో నేరేడు పండ్లు కూడా ప్రముఖమైనవి.  వేసవి కాలం ఇక ముగుస్తుందనగా మార్కెట్లలోకి చొచ్చుకువచ్చి సందడి చేసే నేరేడు పండ్లు రుచిగా ఉండటమే కాదు, బోలెడు ఆరోగ్యాన్ని కలిగిస్తాయి. వైలెట్ కలర్ లో ఉంటూ ఉప్పగా, వగరుగా ఉండే ఈ నేరేడు కాయలు  క్రమంగా నల్లగా మారి నిగనిగలాడుతూ చెప్పలేనంత తియ్యదనంగా మారుతాయి.  జామూన్ ఫ్రూట్ గా పిలిచే ఈ నేరేడు లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించే సామర్థ్యం దీనికున్న ప్రత్యేక లక్షణం. అయితే నేరేడు పండ్లు అందరూ తింటారు. కానీ గింజలు ఉపయోగించే వారు తక్కువ. నేరేడు పండ్లలానే వాటి గింజలు కూడా అంతే ప్రయోజనకరంగా ఉంటాయి. ఎందుకంటే అవి మధుమేహం నియంత్రించడంలో అద్భుతాలు చేయడమే కాకుండా ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచుతాయి. అనేక ఇతర ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటాయి.

నేరేడు గింజల పొడి ప్రయోజనాలను తెలుసుకుంటే నేరేడు పండ్లు తినగానే ఆ విత్తనాలను ఇకమీదట పడెయ్యరు. నేరేడు గింజలు పొడి తీసుకోవడం ద్వారా కలిగే అయిదు అద్భుత ప్రయోజనాలు ఏమిటంటే..

రక్తంలో గ్లూకోజ్ స్థాయిని తగ్గించడానికి, గ్లైకోసూరియాను తగ్గించడానికి నేరేడు విత్తనాలు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. పండు గింజలు జంబోలిన్ మరియు జాంబోసిన్ అనే క్రియాశీల పదార్ధాలను కలిగి ఉంటాయి, ఇవి రక్తంలోకి విడుదలయ్యే చక్కెర రేటును నెమ్మదిస్తాయి. శరీరంలో ఇన్సులిన్ స్థాయిలను పెంచుతాయి. శాస్త్రీయంగా, ఇది తక్కువ గ్లైసెమిక్ సూచికను కలిగి ఉంది, ఇది మధుమేహ వ్యాధిగ్రస్తులకు మంచి ఎంపిక.

ఇది శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది. ఫలితంగా  మూత్రవిసర్జన, చెమటలను సహజంగా నిర్వహించడంలో సహాయపడుతుంది.

 నేరేడు విత్తనాలలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ గుణం కారణంగా, కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇందులో యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టానికి వ్యతిరేకంగా పోరాడుతాయి, కాలేయ కణాలను రక్షిస్తాయి. ఇంకా ఈ గింజలు పొడిలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు కూడా ఉన్నాయి, ఇది కాలేయంలో మంటను తగ్గించడంలో సహాయపడుతుంది.

 నేరేడు గింజల పొడిలో ఎల్లాజిక్ యాసిడ్ అని పిలువబడే యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి, ఇవి రక్తపోటు వేగవంతమైన హెచ్చుతగ్గులను నియంత్రించడంలో  సహాయపడతాయి.

నేరేడు గింజలు ఫ్లేవనాయిడ్లు, ఫినాలిక్ సమ్మేళనాల వంటి శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉంటాయి, ఇవి హానికరమైన ఫ్రీ రాడికల్స్‌ను దూరంగా ఉంచడంలో సహాయపడతాయి.

ఈ అయిదు ప్రయోజనాలు పొందడానికి నేరేడు గింజల పొడిని తీసుకోవడం మంచిది.

◆నిశ్శబ్ద