ఆరోగ్యకరమైన శరీరానికి జింక్ చాలా అవసరం. జింక్ కణజాలాలను బాగుచేస్తుందని చెబుతారు. జింక్ ఒక యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తూ, కణాలను దెబ్బతినకుండా కాపాడటానికి సహాయపడుతుంది. చర్మం,  జీర్ణవ్యవస్థ ఆరోగ్యానికి జింక్ చాలా కీలకం. శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే అన్ని రకాల పోషకాలు, ఖనిజాలు, విటమిన్లు అవసరం అవుతాయి. అలాంటి వాటిలో జింక్ కూడా ఒకటి. అయితే చాలామందికి జింక్ లోపం గురించి పెద్దగా అవగాహన ఉండదు.  జింక్ లోపం వల్ల ఇన్ఫెక్షన్లు సోకుతాయని వైద్యులు చెబుతున్నారు. ఇది నిజమేనా? జింక్ లోపం గురించి.  జింక్ లోపం వల్ల వచ్చే సమస్యల గురించి వైద్యులు ఏం చెబుతున్నారు తెలుసుకుంటే..

శరీరానికి జింక్ ఎందుకు అవసరం..

 జీర్ణవ్యవస్థ ఆరోగ్యానికి , చర్మానికి జింక్ చాలా అవసరం. జింక్ చర్మాన్ని మృదువుగా ఉంచడానికి , కణజాలాలను బాగు చేయడానికి సహాయపడుతుంది. జింక్ లోపం తరచుగా ఇన్ఫెక్షన్లకు దారితీయవచ్చని, చర్మ, కడుపు సమస్యలను కూడా కలిగించవచ్చని వైద్యులు చెబుతున్నారు.

జింక్ లోపం వల్ల వచ్చే సమస్యలు..

జింక్ లోపం శరీరంలో అనేక రకాల సమస్యలను కలిగిస్తుంది. జింక్ లోపం పిల్లలలో పెరుగుదలను నిరోధించగలదు , మానసిక ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది.

ఇన్ఫెక్షన్లు..

జింక్ లోపం తరచుగా ఇన్ఫెక్షన్లకు దారితీస్తుంది. జింక్ లోపం ఇన్ఫెక్షన్లతో పోరాడే శరీర సామర్థ్యాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. దీనివల్ల ఫంగస్ , చర్మం ఎర్రబడటం వంటి సమస్యలు తలెత్తవచ్చు.

విరేచనాలు..

వైద్యుల ప్రకారం, జీర్ణవ్యవస్థ ఆరోగ్యానికి జింక్ చాలా అవసరం. జింక్ లోపం జీర్ణవ్యవస్థపై హానికరమైన ప్రభావాన్ని చూపుతుంది. శరీరంలో జింక్ లోపించినప్పుడు, విరేచనాలు అయ్యే అవకాశం ఉంటుంది.

గాయాలు..

జింక్ లోపం చర్మం, కడుపునే కాకుండా గాయాలను కూడా ప్రభావితం చేస్తుంది. జింక్ లోపం ఉన్నవారిలో గాయాలు నెమ్మదిగా నయమవుతాయి.

జింక్ లోపిస్తే కనిపించే లక్షణాలు..

జింక్ లోపం వేగంగా బరువు తగ్గడం, నీరసం , జుట్టు రాలడం వంటి లక్షణాలు కలిగి ఉంటుంది.

జింక్ పుష్కలంగా లభించే ఆహారాలు..

ఆహారంలో జింక్‌ను చేర్చుకోవడానికి,  గుమ్మడి గింజలు, నువ్వులు, ఆవాలు, పొద్దుతిరుగుడు గింజలు , రాగులను చేర్చుకోవచ్చు. ఈ ఆహారాలలో జింక్ ఉంటుంది. అదనంగా,  ఆవాల ఆకుకూర, మాంసం, పప్పుధాన్యాలు, గుమ్మడికాయ, పుట్టగొడుగులు, పెరుగు, వేరుశెనగలు , గుడ్లను కూడా తినవచ్చు. ఈ ఆహారాలలో కూడా జింక్ సమృద్దిగా ఉంటుంది.

                                *రూపశ్రీ.