ప్రతి మనిషి జీవితంలోనూ పెళ్లి, పిల్లలు, సంసారం అంటూ బోలెడు దశలు మారతాయి. పుట్టిన వాడు పెరగక మానడు, పెరిగిన వాడు పెళ్లి చేసుకుని పిల్లల్ని కనక మానడు. కానీ ఇప్పటి కాలంలో చాలామంది మగవారు పిల్లలను కనడంలో ఫెయిల్ అవుతున్నారు. నిజానికి ఈ సమాజంలో ఒక స్త్రీకి పిల్లలు పుట్టకపోతే ఎన్నెన్నో మాటలు అంటారు. అదే లోపం మగవాడిలో ఉంటే అతన్ని కూడా పనికిరాడు అనే మాటను నిర్దాక్షిణ్యంగా అనేస్తుంటారు. మగవారిలో పిల్లలు కలగడానికి తగిన సామర్థ్యం లేదంటే అది వీర్యకణాల లోపంగా పరిణిస్తారు. చాలామంది సరదా కోసం, ఫ్యాషన్ కోసం, ఒత్తిడి తగ్గించుకోవడానికి చేసే ధూమపానం పిల్లలు కలగకపోవడానికి ఒక ప్రధానకారణం అవుతుందనే విషయం ఇప్పుడు ఆందోళనకు గురిచేస్తోంది. అసలు ధూమపానం మగవారిలో సంతానం కలగకుండా ఉండటానికి ఎలా కారణం అవుతుంది? దీని ప్రభావం ఎంత? మొదలైన విషయాలు వివరంగా తెలుసుకుంటే..
పరిశోధనలు ఏం చెప్పాయంటే..
మగవారిలో ఆరోగ్యకరమైన వీర్యం, వీర్యంలో శుక్రకణాల సంఖ్య, ఆ శుక్రకణాల కదలిక, వీర్యం చిక్కదనం మొదలైన విషయాలపై మగవారిలో పిల్లలను కనే సామర్థ్యం ఆధారపడి ఉంటుంది. సంతానోత్పత్తిపై ధూమపానం కలిగించే ప్రభావం గురించి 2016లో జరిగిన ఒక పరిశోధనలో పొగాకు స్పెర్మ్ కౌంట్ ను దారుణంగా దెబ్బతీస్తుందని తెలిసింది. ధూమపానం చేసేవారి వీర్యంలోని శుక్రకణాలు అండాలను చేరుకుని ఫలదీకరణం చెందే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి.
ధూమపానం ఎక్కువగా చేసేవారు తమ భాగస్వామితో సంభోగం చేసే సమయంలో అంగస్థంభన విషయంలో చాలా పేలవంగా ఉంటారని సర్వేలు వెల్లడిస్తున్నాయి. ధూమపానం వల్ల శరీరంలో కలిగే ఆక్సీకణ ఒత్తిడి, తద్వారా ధమనుల పనితీరు మందగించడం వంటి ఇతర కారణాలు కూడా సంభోగ సమయంలో అంగస్థంభన వైఫల్యానికి దారితీస్తాయి. అందుకే ధూమపానం అలవాటున్నవారు సంభోగం విషయంలో అసంతృప్తిని ఎదుర్కొంటుంటారు.
ఇద్దరికీ నష్టమే..
ధూమపానం చేసేవారు కేవలం వారు మాత్రమే నష్టపోరు. వారి జీవిత భాగస్వాములు కూడా నష్టాన్ని భరించాల్సి వస్తుంది. ఎందుకంటే ధూమపానం చేయడమే కాదు, ఇతరులు ధూమపానం చేసినప్పుడు ఆ పొగను పీల్చడం కూడా దాదాపు అలాంటి నష్టాన్నే కలిగిస్తుంది. అంటే మగవారు ధూమపానం చేస్తే దానికారణంగా ఆడవారు కూడా పిల్లలను కనడంలో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. కేవలం ఇలా పిల్లలను కనలేకపోవడమే కాదు, పిల్లలు కలగడానికి తీసుకునే వివిధ రకాల చికిత్సలు కూడా ధూమపానం చేసేవారికి సమర్థవంతమైన ఫలితాలు ఇవ్వవు. అందుకే ధూమపానం చేసే అలవాటు ఉంటే అది పిల్లలు కలగడంలో దాని ప్రభావాన్ని చూపించకముందే దాన్నిమానేయడం మంచిదని వైద్యులు చెబుతున్నారు. పిల్లల కోసం ప్రయత్నించేవారు తప్పనిసరిగా ధూమపానం మానేయాలని, ఆరోగ్యకరమైన జీవనశైలిని పెంపొందించుకోవాలని హెచ్చరిస్తున్నారు.
ఈ సమస్య కూడా పొంచి ఉంది..
ధూమపానం చేసేవారిలో COPD అనే సమస్య వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. COPD అంటే క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్. ఇది ఊపిరితిత్తుల నుండి వాయు ప్రసరణకు ఆటంకం కలిగించే దీర్ఘకాలిక ఊపిరితిత్తుల వ్యాధి. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, దగ్గు, శ్లేష్మం ఉత్పత్తి, ఊపిరితీసుకునేటప్పుడు గురక వంటి లక్షణాలు ఇందులో ఉంటాయి. COPD ఉన్న వ్యక్తులలో గుండె జబ్బులు, ఊపిరితిత్తుల క్యాన్సర్ తో పాటు అనేక ఇతర సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది.
*నిశ్శబ్ద.