కొలెస్ట్రాల్ అనేది శరీరంలో ఉండే ఒక రకమైన కొవ్వు పదార్థం. ఇది శరీరంలోని కణాల నిర్మాణానికి మరియు కొన్ని రకాల హార్మోన్ల తయారీకి ఎంతో అవసరం. అయితే, రక్తంలో కొలెస్ట్రాల్ పరిమాణం ఉండాల్సిన దానికంటే ఎక్కువగా పెరిగితే అది గుండె ఆరోగ్యానికి తీవ్రమైన ముప్పుగా మారుతుంది. రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోవడం వల్ల రక్త ప్రసరణకు అడ్డంకులు ఏర్పడి, గుండెపోటు , పక్షవాతం వంటి సమస్యలు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ప్రస్తుతం కాలంలో ఉన్న జీవనశైలి, శారీరక శ్రమ లేకపోవడం, పోషకాహార లోపం , తప్పుడు ఆహారపు అలవాట్ల వల్ల చాలామందిలో కొలెస్ట్రాల్ సమస్యలు తలెత్తుతున్నాయి. అయితే సరైన ఆహారాన్ని ఎంచుకోవడం ద్వారా రక్తంలో చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించుకోవడమే కాకుండా, మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నవారు తీసుకోవాల్సిన ముఖ్యమైన ఆహారాలు ఏమిటో, అవి ఎలా సహాయపడతాయో తెలుసుకుంటే..
ఫైబర్..
కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో పీచు పదార్థం లేదా ఫైబర్ పాత్ర చాలా కీలకమైనది. ముఖ్యంగా కరిగే పీచు పదార్థం పుష్కలంగా ఉండే ఆహారాలు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తాయి. ఓట్స్ , బార్లీ వంటి ధాన్యాలలో కరిగే ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇవి జీర్ణవ్యవస్థలో కొలెస్ట్రాల్ శోషణను తగ్గించి, శరీరం నుండి దాన్ని బయటకు పంపడానికి సహాయపడతాయి. రోజూ ఉదయం అల్పాహారంలో ఓట్స్ లేదా బార్లీ చేర్చుకోవడం వల్ల రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలు క్రమంగా తగ్గుతాయి.
పప్పుధాన్యాలు, గింజలు..
వివిధ రకాల పప్పుధాన్యాలు , గింజలు కొలెస్ట్రాల్ తగ్గించడంలో ఎంతో మేలు చేస్తాయి. శనగలు, పెసలు, రాజ్మా, మినుములు , కందిపప్పు వంటి వాటిలో ప్రోటీన్లు, విటమిన్లు , పీచు పదార్థాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి కడుపు నిండిన భావనను కలిగించి, అనవసరమైన కేలరీలు తీసుకోకుండా నిరోధిస్తాయి. అలాగే నట్స్ అని పిలిచే బాదం, వాల్‌నట్స్ , పిస్తా పప్పులు గుండె ఆరోగ్యానికి చాలా మంచివి. వీటిలో ఉండే అసంతృప్త కొవ్వులు శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచడంలో సహాయపడతాయి. కాకపోతే వీటిని పరిమిత పరిమాణంలోనే తీసుకోవడం మంచిది.
తాజా కూరగాయలు , ఆకుకూరలు..
రోజువారీ ఆహారంలో తప్పనిసరిగా తాజా కూరగాయలు, ఆకుకూరలు తీసుకోవాలి. పాలకూర, తోటకూర, మెంతి కూర వంటి ఆకుకూరలలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు , ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. బెండకాయ, వంకాయ, క్యారట్ , బీట్‌రూట్ వంటి కూరగాయలలో కరిగే పీచు పదార్థం ఎక్కువగా ఉండటం వల్ల ఇవి కొలెస్ట్రాల్ శోషణను అడ్డుకుంటాయి.
వెల్లుల్లి..
వెల్లుల్లి రక్తనాళాలను శుభ్రపరచడంలో , కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో ఎంతో ప్రసిద్ధి చెందింది. రోజూ ఒకటో రెండో వెల్లుల్లి రెబ్బలను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల రక్తం గడ్డకట్టే ప్రమాదం కూడా తగ్గుతుంది.
పండ్లు..
పండ్లు కూడా కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో ప్రముఖ పాత్ర వహిస్తాయి. బొప్పాయి, ఆపిల్, నారింజ, జామ, దానిమ్మ వంటి పండ్లలో పెక్టిన్ అనే ప్రత్యేకమైన కరిగే పీచు పదార్థం ఉంటుంది. ఇది శరీరంలో కొలెస్ట్రాల్ శోషణను తగ్గించడంలో ఎంతగానో దోహదపడుతుంది. అలాగే పండ్లలో ఉండే యాంటీఆక్సిడెంట్లు రక్తనాళాలలో కొవ్వు పేరుకుపోకుండా కాపాడతాయి.
నిమ్మజాతి పండ్లు..
నిమ్మ జాతి పండ్లలో ఉండే విటమిన్ సి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
హెల్తీ ఫ్యాట్స్..
చేపలు , ఆరోగ్యకరమైన నూనెలు కూడా కొలెస్ట్రాల్ నిర్వహణకు సహాయపడతాయి. ముఖ్యంగా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఎక్కువగా ఉండే చేపలను తినడం వల్ల రక్తంలో ట్రైగ్లిజరైడ్స్ స్థాయిలు తగ్గుతాయి. వంటల కోసం ప్రాసెస్ చేసిన నూనెలకు బదులుగా ఆలివ్ ఆయిల్, నువ్వుల నూనె లేదా ఆవనూనె వంటి వాటిని పరిమితంగా ఉపయోగించడం మంచిది. ఇవి చెడు కొలెస్ట్రాల్‌ను పెంచకుండా కాపాడతాయి.
ఈ ఆహారాలు తినకూడదు..
కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నవారు కొన్ని ఆహారాలకు పూర్తిగా దూరంగా ఉండటం కూడా చాలా ముఖ్యం. వేయించిన ఆహారాలు, ప్రాసెస్ చేసిన మాంసం, మైదాతో చేసిన పదార్థాలు, తీపి పదార్థాలు, బేకరీ ఆహారాలు , పూర్తి కొవ్వు ఉన్న పాల పదార్థాలను తగ్గించాలి. వీటిలో ఉండే ట్రాన్స్ ఫ్యాట్స్ , సంతృప్త కొవ్వులు రక్తంలో చెడు కొలెస్ట్రాల్‌ను వేగంగా పెంచుతాయి.
ఆహారాలు మాత్రమే కాదు.. ఇవి కూడా ముఖ్యమే..
కేవలం మంచి ఆహారం తీసుకోవడమే కాకుండా, రోజువారీ జీవనశైలిలో చిన్నచిన్న మార్పులు చేసుకోవడం అవసరం. ప్రతిరోజూ కనీసం ముప్పై నిమిషాల పాటు నడక లేదా ఇతర వ్యాయామాలు చేయడం, తగినంత నీరు తాగడం, ఒత్తిడిని తగ్గించుకోవడం , మంచి నిద్ర వల్ల గుండె ఆరోగ్యం మెరుగవుతుంది. సరైన ఆహార నియమాలు , ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటిస్తే కొలెస్ట్రాల్‌ను సులభంగా అదుపులో ఉంచుకోవచ్చు.





