పుట్టిన పిల్లలు ఇంచుమించుగా ఒకే తరహా ఆరోగ్యంతో పుడతారు. కానీ రానురానూ వారి జన్యు నిర్మాణం వల్ల రకరకాల ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటారు. పుట్టుకతో వచ్చిన జన్యువుల ప్రభావాన్ని మన పెద్దగా నివారించలేకపోవచ్చు. కానీ అనారోగ్యకరమైన జీవనశైలితో వారు రోగాల దిశగా వెళ్తుంటే చూస్తూ ఎలా ఊరుకుంటాం! ఇవే విషయాన్ని ‘అమెరికన్ హార్ట్ అసోసియేషన్’ స్పష్టం చేస్తోంది. ఆ సంస్థ ప్రచురిస్తున్న ఒక జర్నల్‌లో నేటి పిల్లలు గుండెజబ్బులకు ఎలా సిద్ధమవుతున్నారో హెచ్చరిస్తోంది.
ఇదీ పరిశోధన
మినెసొటా విశ్వవిద్యాలయానికి చెందిన జూలియా స్టెయిన్‌బర్గర్ అనే పిల్లల వైద్యుని నేతృత్వంలో ఈ పరిశోధన జరిగింది. ఇందులో భాగంగా 2007-08 సంవత్సరంలో అమెరికాలోని పిల్లల ఆహారపు అలవాట్ల గురించి చేసిన సర్వేలోని గణాంకాలన్నింటినీ పరిశీలించారు. వీటిని పిల్లల బరువు, వారి వ్యాయామపు అలవాట్లు, ఆహారం, శరీరంలో కొవ్వు శాతం, రక్తంలో చక్కెర నిల్వలు... వంటి ఏడు కొలబద్దల ఆధారంగా విశ్లేషించారు.
ఇదీ ఫలితం
- పిల్లల్లో దాదాపు 91 శాతం మంది సరైన ఆహారాన్ని తీసుకోవడం లేదని తేలింది. వీరి ఆహారంలో ఎక్కువగా చక్కెర అధికంగా ఉన్న పదార్థాలూ, శీతలపానీయాలే ఉన్నట్లు తేలింది.
- ఈ చక్కెర పదార్థాలు ఒక ఎత్తైతే.... పోషక విలువలు అధికంగా ఉండే పండ్లు, కూరగాయలు, చేపలు, తృణధాన్యాలు వంటి ఆహారాన్ని దూరంగా ఉంచడం మరో ఎత్తు అంటున్నారు స్టెయిన్‌బర్గర్.
- ఆడుతూ పాడుతూ ఉండాల్సిన వయసులో కూడా చాలామంది పిల్లలలో తగిన శారీరిక వ్యాయామమే ఉండటం లేదన్నది మరో ఆశ్చర్యకరమైన ఫలితం. ఇక 16 ఏళ్లు దాటిన వారిలో అయితే శారీరిక శ్రమ, వ్యాయామం అన్న లక్షణాలే కనిపించడం లేదట!
- టీనేజి దశలోకి చేరుకున్న అమెరికన్ పిల్లల్లో దాదాపు మూడోవంతు మంది పొగతాగే వ్యసనానికి లోనవుతున్నారని తేలింది.
ఇలాంటి అలవాట్లు అన్నింటివల్లా నాలుగో వంతు పిల్లలు ఊబకాయులుగా మారిపోతున్నారు; మూడోవంతు మంది పిల్లల్లో కొలెస్ట్రాల్ నిల్వలు అధికంగా ఉన్నాయి; టీనేజిలో ఉన్న 37% మంది మగపిల్లల్లో చక్కెర నిల్వలు కూడా అధికంగా నమోదవుతున్నాయి. ఏతావాతా స్టెయిన్‌బర్గర్ బృందం పరిశీలించిన గణాంకాల ప్రకారంగా, కేవలం ఒకే ఒక్క శాతం మంది పిల్లలు ఆరోగ్యకరమైన జీవనాన్ని సాగిస్తున్నారు!
ఇదీ నివారణ
పిల్లల జీవన విధానం కనుక ఇలాగే కొనసాగితే మున్ముందు వారిలో గుండెజబ్బులు వచ్చే అవకాశం చాలా తీవ్రంగా ఉందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. అందుకోసం ఇప్పటికైనా మేలుకొమ్మని... మేలుకొని కొన్ని నివారణ చర్యలు మొదలుపెట్టమని సూచిస్తున్నారు. అవేమిటంటే...
- పిల్లల్లో సిగిరెట్ అలవాటు వారి ఆరోగ్యం మీద తీవ్రమైన ప్రభావం చూపుతుంది. కాబట్టి సిగిరెట్ అలవాటుని వారి దరి చేరకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
- వారి ఎత్తుకి తగిన బరువు ఉన్నారో లేదో ఎప్పటికప్పుడు గమనించుకుంటూ ఉండాలి.
- పిల్లల దినచర్యలో కనీసం ఒక గంట సేపైనా శారీరిక శ్రమ ఉండేలా చర్యలు తీసుకోవాలి.
అన్నింటికీ మించి, ఎప్పటికప్పుడు వారికి తగిన పోషక పదార్థాలు అందేలా జాగ్రత్త పడాలి. ఫాస్ట్‌ఫుడ్స్, చక్కెర అధికంగా ఉండే పదార్థాలు, శీతల పానీయాలు... వంటి పదార్థాల మోతాదు తగ్గిస్తూ వాటి స్థానంలో పోషక విలువలుండే సంప్రదాయ ఆహారాన్ని చేర్చాలి. లేకపోతే అమెరికన్లయినా, భారతీయులైనా అపసవ్యమైన జీవన విధానం ఎవరికైనా చేటు చేయక తప్పదు కదా!
- నిర్జర.