ప్రకృతి ప్రసాదించిన బోలెడు ఆరగ్యకరమైన పండ్లలో జామ పండ్లు కూడా ఒకటి. జామపండ్లను పేదవాడి యాపిల్ అని అంటారు. యాపిల్ పండ్లలో ఉండే పోషకాలలో చాలావరకు జామలోనూ ఉంటాయి. అందుకే దీనికి ఈ పేరు వచ్చింది.  జామ పండ్లు పచ్చిగా ఉన్నప్పుడు వగరుగా, పండే కొద్దీ తియ్యగా ఉంటాయి.  ఈ జామ పండ్లు మధుమేహాం ఉన్నేవారికి అమృత ఫలం అనే పేరు పొందింది. చలికాలంలో జామపండ్లు తినడం వల్ల కలిగే లాభాలేంటో తెలుసుకుంటే..

రోగనిరోధక వ్యవస్థ బలపడుతుంది..

జామపండులో విటమిన్-సి పుష్కలంగా ఉంటుంది. ఇది  రోగనిరోధక వ్యవస్థను బలంగా ఉంచుతుంది. చలికాలంలో జామపండ్లను క్రమం తప్పకుండా తీసుకుంటూ ఉంటే జలుబు, జ్వరం, తలనొప్పి వంటి సీజనల్ సమస్యలు పరిష్కారం అవుతాయి.

జీర్ణశక్తి మెరుగుపరుస్తుంది..

జామపండులో డైటరీ ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది. మలబద్దకాన్ని నివారిస్తుంది.  జీర్ణాశయంలో పేగుల కదలికను మెరుగ్గా ఉంచి ఆహారం బాగా జీర్ణమయ్యేలా చేస్తుంది.

బరువు తగ్గడానికి మంచిది..

జామకాయలో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఫైబర్ అధికంగా ఉంటుంది. అధిక బరువుతో ఇబ్బంది పడుతున్నవారు, బరువు తగ్గే ప్రయత్నాలు చేస్తున్నవారు జామకాయలు తీసుకుంటే చాలా మంచి ఫలితాలు ఉంటాయి.  

ఎముకలకు మంచిది..

కాల్షియం బలమైన ఎముకలు, దంతాలకు చాలా అవసరం. జామకాయలలో కాల్షియం సమృద్దిగా ఉంటుంది. ఇది ఎముకలను బలంగా మార్చడమే కాకుండా బోలు ఎముకల వ్యాధిని, ఇతర ఎముకలకు సంబంధించిన  సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది.

చర్మ ఆరోగ్యానికి..

జామ పండ్లలో విటమిన్-సి సమృద్దిగా ఉంటుందనే విషయం తెలిసిందే. ఇది మాత్రమే కాకుండా యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలోనూ, వృద్దాప్యాన్ని నెమ్మది చేయడంలోనూ సహాయపడతాయి. జామపండ్లు తరచుగా తినేవారు యవ్వనంగా ఉంటారు.

మెదడు పనితీరుకు..

జామ పండ్లలో విటమిన్ బి12, బి6 ఉంటాయి. ఇవి మెదడు పనితీరును, జ్ఞాపక శక్తిని మెరుగుపరుస్తాయి. ఆహారంలో జామకాయలను చేర్చుకోవడం వల్ల పై ప్రయోజనాలు పొందవచ్చు.

నొప్పులు, మంటలు తగ్గిస్తుంది..

జామకాయలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కూడా ఉంటాయి. ఇవి శరీరంలో మంటను, వాపులను తగ్గించడంలో సహాయపడతాయి. క్రమం తప్పకుండా జామపండ్లు తింటూంటే ఈ సమస్యలు క్రమంగా తగ్గుతాయి.

కంటి చూపుకు..

జామపండ్లలో విటమిన్-ఎ పుష్కలంగా ఉంటుంది. ఇది కంటి చూపుకు ఎంతో ముఖ్యమైనది. జామపండు తినడం వల్ల కళ్లలో మచ్చలు, కంటి చూపు బలహీన పడటం, కళ్లు అలసిపోవడం వంటి సమస్యలే కాకుండా ఇతర కంటి సమస్యలు కూడా తగ్గుతాయి.

                                       *నిశ్శబ్ద.