భారతీయ వంటిల్లు గొప్ప ఔషదాల వేదిక. వంటింట్లో ఉండే ప్రతి మసాలా దినుసు, వంటకు ఉపయోగించే ప్రతి వస్తువు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసేవే అయ్యుంటాయి. వెల్లుల్లి, జీలకర్ర, అల్లం, మిరియాలు, దాల్చిన చెక్క, లవంగం.. ఇలా చెప్పుకుంటూ వెళితే ప్రతి దానికి చాలా ప్రయోజనాలు ఉంటాయి. ఇక  రెస్టారెంట్లో భోజనానికి వెళితే చివరగా వాళ్లు ఇచ్చే సొంపు  లేదా సోపు కూడా చాలా ఇళ్లలో ఉంటుంది. భోజనం తరువాత పొట్ట సమస్యలు ఏవీ ఉండకూడదని, ఆహారం బాగా జీర్ణం కావాలని సోపు ఇస్తుంటారు. అయితే అది స్వీట్ సోపు.. సాధారణంగా ఇళ్లలో ఉండే ప్లెయిన్ సోపు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసుకుంటే దీన్ని ఎప్పుడూ లైట్ తీసుకోరు..

సోపు వంటింటి  దినుసుల మధ్య ఉండే జీలకర్రను పోలి ఉంటుంది.  కానీ దీని సువాసన నుండి రుచి వరకు, ఆరోగ్య ప్రయోజనాల నుండి ధర వరకు అన్నీ వేర్వేరుగానే ఉంటాయి. ఎండలు దంచేస్తున్న ప్రస్తుత పరిస్థితులలో సోపును తీసుకోవడం వల్ల శరీరం చల్లబడుతుందని ఆయుర్వేద ఆహార నిపుణులు అంటున్నారు.


సోపును వేసవి కాలంలో తీసకుంటే శరీర ఉష్ణోగ్రత నియంత్రణలో ఉంటుంది. సాధారణంగా వేసవికాలంలో బయటి వాతావరణం వల్ల శరీరం కూడా వేడెక్కుతుంది. కానీ ఈ వేడిని సోపు నియంత్రిస్తుంది.

సోపులో శీతలీకరణ గుణాలు ఉన్నాయని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. ఇది శరీరాన్ని శాంతపరచడంతో పాటూ హీట్ స్ట్రోక్ నుండి శరీరాన్ని రక్షించడంలో కూడా మెరుగ్గా ఉంటుంది.


కేవలం శరీరాన్ని చల్లబరచడం, హీట్ స్ట్రోక్ నుండి రక్షించడమే కాదు.. జీర్ణ లక్షణాలు కూడా సోపులో మెండుగా ఉంటాయి. ఈ కారణంగానే వేసవిలో ఎదురయ్యే జీర్ణ సంబంధ సమస్యలకు సోపు చెక్ పెడుతుంది.


సోపును నేరుగా కానీ, సోపును నీటిలో ఉడికించి టీలా కానీ తీసుకుంటే చాలా ప్రయోజనాలు ఉంటాయి. సోపులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో ఉండే టాక్సిన్లను తగ్గించడంలోనూ, బయటకు పంపడంలోనూ సహాయపడతాయి. శరీరాన్ని శుద్ది చేసుకోవాలని అనుకునేవారు సోపు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.


ఇప్పట్లో చాలామందిని వేధిస్తున్న సమస్య అధిక బరువు. సోపు టీని ఖాళీ కడుపుతో తీసుకుంటూ ఉంటే అధిక బరువు సమస్యకు చెక్ పెట్టవచ్చు.  ఇది శరీరంలోనూ, పొట్ట భాగంలోనూ పేరుకున్న అదనపు కొవ్వులను కరిగించడంలో సహాయపడుతుంది.

                                                 *రూపశ్రీ.