సర్వేంద్రియానాం నయనం ప్రధానం అని అంటారు. కంటి ఆరోగ్యం మెరుగ్గా ఉంటే జీవితం చాలా వరకు దిగులు లేకుండా ఉంటుంది.   కంటికి ఏదైనా సమస్య వస్తే.. దాని ప్రభావం జీవితం మీద చాలా ప్రస్పుటంగా కనిపిస్తుంది. కంటి సమస్యలు అంటే చాలామంది కంటి శుక్లాలు రావడం,  కంటికి ఏదైనా దెబ్బ తగలడం... వీటి గురించి చెబుతుంటారు. కానీ వర్షాకాలంలో పిలవని అతిథి గా వచ్చేది కంటి ఇన్ఫెక్షన్ల సమస్య. కంటి ఇన్ఫెక్షన్లు వస్తే కన్ను ఎర్రబడటం,  కంటి నుండి నీరు కారడం, కళ్లు మసకగా మారడం, కళ్ల మంటలు వంటి సమస్యలు వస్తాయి. వర్షాకాలంలో వచ్చే ఈ కంటి ఇన్ఫెక్షన్ల సమస్య.. ఒకరి నుండి మరొకరికి వ్యాపిస్తుంది కూడా. అసలు కంటి ఇన్పెక్షన్ సమస్యలు ఎందుకు వస్తాయి? కారణాలు ఏంటి?  ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?  కంటి ఇన్ఫెక్షన్లు వచ్చినప్పుడు చికిత్స ఏంటి?  తెలుసుకుంటే..

వర్షాకాలంలో కంటి ఇన్ఫెక్షన్లు ఎందుకు వస్తాయి?

వర్షపు నీరు నేరుగా కంటి ఇన్ఫెక్షన్లకు కారణం కాదు.. అయినప్పటికీ ఈ కాలంలో బ్యాక్టీరియా , వైరస్‌లు వేగంగా వ్యాప్తి చెందుతాయి. రద్దీగా ఉండే ప్రదేశాలకు వెళ్లడం, మురికి చేతులతో కళ్లను తాకడం, ఇన్ఫెక్షన్ సోకిన వ్యక్తి వాడిన టవల్ లేదా చేతి రుమాలును ఇతరులు వాడటం, కాంటాక్ట్ లెన్స్‌లను సరిగ్గా శుభ్రం చేసుకోకపోవడం వంటివి ఇన్ఫెక్షన్ ప్రమాదాన్ని పెంచుతాయి. ఇన్ఫెక్షన్ సోకిన కంటిని తాకిన తర్వాత  డోర్‌నాబ్, మొబైల్ ఫోన్, టేబుల్ లేదా ఇతర వస్తువులను తాకితే, అక్కడ ఉన్న వైరస్‌లు లేదా బ్యాక్టీరియా ఇతరులకు వ్యాప్తి చెందవచ్చు.

కంటి ఇన్పెక్షన్ లక్షణాలు..

కళ్లు ఎర్రబడటం, ఆగకుండా నీరు కారడం,  దురద లేదా మంట.  కళ్ల నుండి జిగటగా లేదా పసుపు-తెలుపు రంగులో స్రావం రావడం. కనురెప్పలు వాపు. కళ్లలో ఇసుక గుచ్చుతున్నట్లు అనిపించడం. ఉదయం నిద్రలేచినప్పుడు కనురెప్పలు జిగటగా ఉండటం.. వంటివి కంటి ఇన్పెక్షన్ లక్షణాలు.

కన్ను ఎర్రబడితే ఇన్పెక్షన్ వచ్చినట్టా?

వర్షాకాలంలో అలర్జీలు, దుమ్ము, కాలుష్యం లేదా ఎక్కువసేపు స్క్రీన్ చూడటం వల్ల తరచుగా కళ్ళు ఎర్రబడవచ్చు. అందువల్ల,  కన్ను ఎర్రబడగానే అది  కంటి ఇన్పెక్షన్ అనుకోవడం పొరపాటు.   కొందరు ఇలా సందేహం రాగానే  సొంతంగా యాంటీబయాటిక్ కంటి డ్రాప్స్ వంటివి   వాడతారు,  ఇలా చేయడం మంచిది కాదు.  నొప్పి తీవ్రంగా ఉంటే, దృష్టి మసకబారితే, లేదా లైటింగ్ కు కళ్లు చాలా ఇబ్బంది పడుతూ ఉంటే  వెంటనే కంటి వైద్య నిపుణుడిని సంప్రదించాలి.

వీళ్లకు ఎక్కువ జాగ్రత్త అవసరం..

కాంటాక్ట్ లెన్స్ వాడేవారు,  చిన్న పిల్లలు,  వృద్ధులు కంటి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వీరు మాత్రమే కాకుండా.. మధుమేహ వ్యాధిగ్రస్తులు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు, ఈ మధ్యనే  కంటి శస్త్రచికిత్స చేయించుకున్న వారు కంటి ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.

వర్షాకాలంలో కళ్లను ఎలా కాపాడుకోవాలి?

చేతులను సబ్బు ,  నీటితో బాగా కడుక్కోవాలి. మురికి చేతులతో  కళ్ళను తాకకూడదు. బయటి నుండి వచ్చిన తర్వాత  ముఖాన్ని, చేతులను బాగా శుభ్రం చేసుకోవాలి.

 కళ్ళలోకి దుమ్ము లేదా మురికి నీరు వెళితే, వాటిని శుభ్రమైన నీటితో కడగాలి. తువ్వాళ్లు, చేతి రుమాళ్లు లేదా దిండులను సెల్ఫ్ గా ఉంచుకోవడం, సెల్ఫ్ గా వాడుకోవడం మంచిది. ఇతరులకు ఇవ్వడం లేదా ఇతరులవి వాడటం మంచిది కాదు.

కంటి అలంకరణ వస్తువులైన కాటుక,  ఐ లాషెస్,  ఐ లైనర్ వంటివి ఇతరులకు ఇవ్వడం, ఇతరులవి తీసుకోవడం మంచిది కాదు.  ఇన్ఫెక్షన్ సోకినట్లయితే కళ్లను అలంకరించుకోవడం మానెయ్యాలి.

కాంటాక్ట్ లెన్స్ ధరించేవారు..

వర్షాకాలంలో కాంటాక్ట్ లెన్స్ ధరించేవారు అదనపు జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిని పెట్టుకునే ముందు  చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. లెన్స్‌లను గానీ, వాటి కేస్‌ను గానీ కుళాయి నీటితో ఎప్పుడూ శుభ్రం చేయకూడదు. కళ్ళు ఎర్రబడటం, నొప్పి లేదా చీము కారడం వంటివి కనిపిస్తే, వెంటనే  లెన్స్‌లను తీసివేసి, వైద్యుడిని సంప్రదించాలి. ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు లెన్స్‌లు ధరించడం వల్ల ఆ సమస్య మరింత తీవ్రమవుతుంది.

కంటి ఇన్ఫెక్షన్ వస్తే ఏం చేయాలి?

 కళ్ళు ఎర్రబడినా లేదా నీరు కారుతున్నా, మొదటగా  వాటిని పదేపదే రుద్దడం ఆపాలి. శుభ్రమైన దూదితో లేదా మెత్తని గుడ్డతో వాటిని శుభ్రం చేసుకోవాలి. తక్కువ మంట లేదా వాపు ఉంటే చల్లటి కాపడం ఉపశమనాన్ని ఇస్తుంది.  డాక్టర్ రికమెండ్  చేస్తే కృత్రిమ ఐ డ్రాప్స్ ఉపయోగించవచ్చు. అన్నింటికన్నా ముఖ్యంగా డాక్టర్‌ను సంప్రదించకుండా యాంటీబయాటిక్ లేదా స్టెరాయిడ్ కంటి చుక్కలను ఉపయోగించకూడదు. అన్ని రకాల ఇన్ఫెక్షన్లకు చికిత్స ఒకేలా ఉండదు. కానీ సొంత ప్రయోగాలు చేయకుండా వైద్యుడిని సంప్రదించడం ముఖ్యం.

 

                             *రూపశ్రీ.