వాతావరణంలో వచ్చే మార్పులతో ఇన్‌ఫెక్షన్ వ్యాప్తి చెందడం సర్వసాధారణం, అయితే కళ్లలో కండ్లకలక అంటే ఐ ఫ్లూ వచ్చినట్లయితే, దానిని తేలికగా తీసుకోకూడదు. ఐ ఫ్లూ అనేది వేగంగా వ్యాప్తి చెందే ఇన్ఫెక్షన్, ఇది ఈ సీజన్‌లో ఎక్కువగా వ్యాపిస్తోంది. ఐ ఫ్లూని కండ్లకలక అని కూడా అంటారు. ఇందులో కళ్లలో మంట, నొప్పి, ఎర్రబడడం వంటి సమస్యలు కనిపిస్తాయి. ఈ వ్యాధికి ప్రధాన కారణం అలెర్జీ రియాక్షన్. ఈ ఇన్ఫెక్షన్ ఏ వయస్సులోనైనా సంభవించవచ్చు, కానీ ఎక్కువగా ఇది పిల్లలను ప్రభావితం చేస్తుంది. అసలు కంటి ఇన్ఫెక్షన్స్ ఎలా వ్యాపిస్తాయి?? వీటి లక్షణాలు ఏంటి? దీన్ని ఎలా తగ్గించుకోవాలి?? పూర్తిగా తెలుసుకుంటే..
కంటి ఇన్ఫెక్షన్ సాధారణంగా ఒక కంటి నుండి మొదలై మరో కంటికి వ్యాపిస్తుంది. ఎందుకిలా జరుగుతుంటే..
వర్షం కారణంగా గాలి ద్వారా ఇన్ఫెక్షన్ వ్యాపించే క్రిములు, బ్యాక్టీరియా పెరుగుతాయి. ఐ ఫ్లూ అనేది ఒక అంటు వ్యాధి, ఇది సోకిన చోటును తాకడం ద్వారా ఇది వ్యాపిస్తుంది. అందువల్ల, అన్నీ తాకుతూ మధ్యలో కళ్ళను తాకాల్సి వస్తె ముందు మీ చేతులను పూర్తిగా శుభ్రం చేసుకోవాలి. కళ్ళను మళ్లీ మళ్లీ తాకకుండా జాగ్రత్త పడాలి.
కంటి ఫ్లూ ఇన్ఫెక్షన్, కంటిలో తీవ్రమైన నొప్పి, ఎరుపు, పసుపు రంగులో జిగటగా ఉండే పదార్థం, దురద, చూపు మసకబారడం, మంటగా అనిపించడం, చూపులో ఇబ్బంది, కళ్లు అతుక్కోవడం, కంటిలో ఏదో కదలడం వంటి లక్షణాలు ఉంటాయి.
కళ్ళ కలక వచ్చినప్పుడు శుభ్రంగా, చల్లటి నీటితో కళ్ళను కడగాలి. డాక్టర్ సూచించిన ఐ డ్రాప్స్ వేయాలి. క్రమం తప్పకుండా చేతులు కడుక్కోవాలి. చేతులు కడుక్కోకుండా కళ్లను తాకవద్దు, కళ్ళు రుద్దడం మానుకోవాలి. ఇది అంటు వ్యాధి కాబట్టి కంటి ఫ్లూ ఉన్నవారికి దూరంగా ఉండాలి.
ఈ కండ్ల కలక కొనసాగినన్ని రోజులు రోజూ ఉపయోగించే టవల్, బట్టలు, బెడ్ షీట్, గ్లాసెస్, కంటి అలంకరణ వస్తువులు, కంటి చుక్కలు విడివిడిగా ఉంచుకోవాలి. వాటిని ఎవరితోనూ షేర్ చేసుకోకూడదు. రెప్ప వేయడానికి ఇబ్బందిగా ఉన్నా తరచుగా రెప్పవేయడం అలవాటు చేసుకోవాలి. కళ్లను ఎప్పుడూ రుద్దకూడదు. దురద వస్తే శుభ్రమైన నీటినీ కళ్ళ మీద చిలకరిస్తూ శుభ్రం చేసుకోవాలి.
వర్షాకాలంలో తడవడం, స్విమ్మింగ్ పూల్‌లో స్నానం చేయడం మానుకోవాలి. కాంటాక్ట్ లెన్స్‌లను ఉపయోగిస్తుంటే, వాటి శుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. కాంటాక్ట్ లెన్స్‌లను వాడే ప్రతిసారీ వాటిని చాలా జాగ్రత్తగా శుభ్రం చేయాలి. చిన్నపిల్లలు తరచుగా చేతులు కడుక్కోనేలాను , వారు కళ్లను తరచుగా తాకకుండా ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి.
కంటి ఫ్లూ వస్తే ఏమి చేయాలంటే..
అన్ని జాగ్రత్తలు తీసుకున్న తర్వాత కూడా, కంటి ఫ్లూ వస్తే, బహిరంగ ప్రదేశాలకు వెళ్లవద్దు. ఇది ఆరోగ్యకరమైన వ్యక్తులకు వ్యాప్తి చెందేలా చేస్తుంది. కళ్లకు ముదురు అద్దాలు పెట్టుకుని మాత్రమే బయటకు వెళ్ళాలి. వ్యాధి సోకితే, కరచాలనం చేయవద్దు, బహిరంగ ప్రదేశాలలో ఏవి పడితే వాటిని తాకవద్దు. కుదిరితే శానిటైజర్ ఉపయోగించడం ఉత్తమం.
ఏ ఆహారం తీసుకోవాలంటే..
కళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే డైట్ కూడా చాలా ముఖ్యం. విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ సి పుష్కలంగా ఉండే ఆహారాలను రోజువారీ తీసుకోవాలి.
ఐ ఫ్లూ మూడు-నాలుగు రోజుల్లో దానంతటదే నయం అవుతుంది, అయితే నయం కాకుండా ఉంటే, ఇన్ఫెక్షన్ సమస్య పెరుగుతోందని అర్థం. ఇది చూడటంలో ఇబ్బంది కలిగిస్తుంది. మంచి నేత్ర వైద్యునిని కలవడం అవసరం. ఒక విషయం ఎప్పుడూ గుర్తుంచుకోవాలి, మీ స్వంతంగా ఎటువంటి మందులు తీసుకోకూడదు. డాక్టర్ సలహా లేకుండా కంటి చుక్కలు వాడకూడదు. వైద్యుల సలహా లేకుండా వాడే ఔషధం లేదా కంటి చుక్కలు కంటి ఇన్ఫెక్షన్‌ను మరింత తీవ్రతరం చేస్తాయి. ఈ సమయంలో రోజ్ వాటర్, ఇతర ఉత్పత్తులు ఏవీ కూడా కళ్లలో పెట్టకూడదు.
*నిశ్శబ్ద.