నేటికాలంలో ఆహారం పరంగా చాలా మార్పులు వచ్చాయి.  ప్రతి రోజూ ఉదయం బ్రేక్ ఫాస్ట్   తప్పనిసరి. అయితే చాలా కుటుంబాలలో భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగాలు చేస్తూ, పిల్లలను స్కూలుకు పంపిస్తూ చాలా బీజీగా ఉంటారు. ఇలాంటి సమయంలో టిపిన్, వంట అన్నీ తీరికగా చేసే సమయం ఉండదు. ఇలాంటి వారిలో కొందరు బ్రేక్ ఫాస్ట్ గా బ్రెడ్, శాండ్విచ్ వంటివి తీసుకుంటారు. దీని కోసం వైట్ బ్రెడ్,  బ్రౌన్ బ్రెడ్, మల్టిగ్రైన్ బ్రెడ్ అంటూ వివిధ రకాలు తీసుకుంటారు.  ఇక మరి కొందరు సింపుల్ బ్రేక్ పాస్ట్ పేరుతో బ్రెడ్ ను అల్పాహారంగా తీసుకుంటారు.  అయితే ప్రతి రోజూ బ్రెడ్ ను ఆహారంలో బాగంగా తీసుకోవడం మంచిదేనా అంటే.. అస్సలు మంచిది కాదని అంటున్నారు ఆహార నిపుణులు. ప్రతిరోజూ బ్రెడ్ ను బ్రేక్ ఫాస్ట్ గా తీసుకునేవారిలో కొన్ని తీవ్రమైన సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయట.  ఇంతకీ అవేంటంటే?..

డయాబెటిస్

వైట్ బ్రెడ్ లో  గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. దీన్ని తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పెరుగుతాయి. దీన్ని రోజూ తినడం వల్ల టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఉంటుంది . ఇది శరీర ఇన్సులిన్ సమతుల్యతను  దెబ్బతీస్తుంది.

బరువు

 బరువు తగ్గడానికి ప్రయత్నించే వారికి  బ్రెడ్  అతిపెద్ద శత్రువు. ఇందులో కేలరీలు,  కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి, కానీ ఫైబర్ ఉండదు. దీన్ని తినడం వల్ల  త్వరగా కడుపు నిండదు. ఇది అతిగా తినడం వల్ల శరీరంలో  అధిక కొవ్వు పేరుకుపోతుంది.

జీర్ణక్రియ 

బ్రెడ్ ను మైదా పిండితో తయారు చేస్తారు. ఇది ప్రేగులలో జిగట పదార్థంగా పనిచేస్తుంది. ఫైబర్ లేకపోవడం వల్ల ఇది  జీర్ణం కావడం చాలా కష్టం. రోజూ బ్రెడ్ తినడం వల్ల తరచుగా మలబద్ధకం,  ఉబ్బరం వంటి సమస్యలు వస్తాయి.

పోషకాలు

గోధుమలలో ఉండే సహజ పోషకాలన్నీ తొలగిపోయాక మిగిలే పిండితో బ్రెడ్ తయారు చేస్తారు. ఈ పిండిలో ఎలాంటి పోషకాలు ఉండవు. ఇందులో చాలా తక్కువ విటమిన్లు, ఖనిజాలు,  ప్రోటీన్లు ఉంటాయి.  బ్రెడ్ తినడం ద్వారా  శరీరానికి కావలసిన పోషకాలు ఏవీ లభించవు.   ఈ కారణంగా బ్రెడ్ తీసుకోవడం వల్ల శరీరంలో పోషకాహార లోపం ఏర్పడుతుంది.

గుండె ఆరోగ్యం

మార్కెట్లలో అమ్మే  బ్రెడ్‌లు ఎక్కువసేపు తాజాగా ఉంచడానికి చాలా ప్రిజర్వేటివ్‌లు,  ఉప్పు  వేసి తయారు చేస్తారు. వీటిలో  అధిక సోడియం ఉంటుంది. ఇది రక్తపోటు పెంచుతుంది.  ఎక్కువ కాలం బ్రెడ్ ను కంటిన్యూగా తీసుకుంటూ ఉంటే అది గుండె జబ్బులకు దారితీస్తుంది.

-రూపశ్రీ