వేసవి వచ్చిందంటే చాలామంది పుచ్చకాయలు, చెరకు రసం, మామిడి పండ్లు, తాటిముంజలు మొదలైనవి తినడానికి చాలా ఆసక్తి చూపిస్తారు. మరీ ముఖ్యంగా ఎక్కువశాతం నీటితో నిండి ఉండే పుచ్చకాయ అంటే పిల్లల నుండి వృద్దుల వరకు ప్రతి ఒక్కరికీ చాలా ఇష్టం. తియ్యగా, జ్యూసీగా ఉండే పుచ్చకాయను ఎర్రటి ఎండలో తింటూంటే వేసవి తాపం మొత్తం మాయమైపోతుంది. అందుకే శీతల పానీయాలు, సోడాలు తీసుకోవడానికి బదులు పుచ్చకాయ తినడం మంచిదని ఆహార నిపుణులు కూడా చెప్తారు. అయితే పుచ్చకాయ బాగుంటుంది కదా అని మరీ ఎక్కువగా తినేస్తే మాత్రం ఆరోగ్య లాభాలకు బదులు నష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.

పుచ్చకాయ తియ్యగా ఉంటుంది. కేలరీలు కూడా తక్కువగానే ఉంటాయి. వేసవి దాహాన్ని తీరుస్తోంది కదా అని పుచ్చకాయను అధికంగా తింటే మాత్రం తక్కువగా ఉన్న కేలరీలు కాస్తా శరీరానికి అధికంగా మారతాయి. వీటిలో ఉండే చక్కెరల  కారణంగా బరువు పెరగడానికి అవకాశం ఉంటుంది.  అందుకే పుచ్చకాయ మంచిదే  అయినా ఎక్కువ తింటే అధికబరువుకు దారితీస్తుంది.


పుచ్చకాయలో ఫైబర్, నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. ఇవి ఆరోగ్యానికి మంచిదే అయినా అతిగా తింటే జీర్ణం కావడంలో ఇబ్బందులు తలెత్తుతాయి. ఇది కాస్తా  గ్యాస్, ఎసిడిటీ, కడుపు నొప్పి వంటి సమస్యలకు కారణం అవుతుంది.


అన్ని వయసుల వారు పుచ్చకాయను తినచ్చు. అదేవిధంగా  మధుమేహం ఉన్నవారు కూడా దీన్ని మితంగా తీసుకోవచ్చు. అయితే పుచ్చకాయను  అధికంగా తీసుకుంటే మాత్రం మధుమేహ రోగులకు ప్రమాదం. ఎందుకంటే కేలరీలు తక్కువగా ఉన్నా పుచ్చకాయలో తియ్యదనం ఎక్కువగా ఉంటుంది. అతిగా తింటే ప్రమాదం.
 

ఆరోగ్యవంతమైన శరీరానికి ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు, ఆరోగ్యకరమైన కొవ్వులు అన్నీ  కూడా ముఖ్యమే. అయితే పుచ్చకాయ అధికంగా తినడం వల్ల శరీరంలో ఖనిజాలు విచ్చిన్నమవుతాయి. శరీరంలో ఖనిజాల కొరత ఏర్పడుతుంది.  ఇది ఆరోగ్యానికి చాలా ప్రమాదం.


పుచ్చకాయలో నీటి శాతం, ఫైబర్  అధికంగా ఉంటాయి. కడుపుకు సంబంధించిన సమస్యలతో  ఇబ్బంది పడేవారు   పుచ్చకాయను ఎక్కువగా తినడం వల్ల సమస్యలు మరింత పెరుగుతాయి.


                                                         *రూపశ్రీ