ఈకాలంలో అధికశాతం మందిని వేధిస్తున్న సమస్య అధిక బరువు. మనలో చాలామంది కేజీల కొద్ది బరువు పెరగడం చాలా సులభం. కానీ అదే బరువును తగ్గించుకోవాలంటే చాలా శ్రమపడతారు. పైనున్న తాతలు దిగిరావాలి ఈ బరువు తగ్గాలంటే.. అన్నంత కష్టతరంగా ఫీలవుతారు. అయితే  బరువుకు ఆహారానికి పెద్ద సంబంధమే ఉంది.

మనం రోజుకు ఎంత తింటున్నాం?? రోజుకి మనకెన్ని కేలరీలు అవసరమవుతాయి??  ఈ ప్రశ్నకు జవాబు కోసం చాలామంది ఎంతో వెతుకుతూ ఉంటారు. అయితే దీనికి సమాధానం మనం రోజూ చేసే పని ఎటువంటిది??  మన  వయస్సు ఎంత, మన శరీర వ్యవస్థ ఎలాంటిది వంటి  అనేక విషయాల మీద ఆధారపడి ఉంటుంది. అంటే తీసుకునే ఆహారం ఎప్పుడూ చేసే పని, శరీర వ్యవస్థను బట్టి ఉండాలి.

 కాయకష్టం చేసే వడ్రంగికి రోజుకి 5,000 కేలరీల అవసరం కావచ్చు. పని సవ్యంగా నడవటానికి అతడు పుష్టిగా తినాలి. మరోవంక చూస్తే, రోజంతా ఓ టేబుల్ ముందు కూర్చుని పని చేసే ఉద్యోగికి రోజుకు 2,200 కేలరీలే కావలసి వుంటుంది. అలాగే రోజంతా ఇంటి చాకిరితో సతమతమయ్యే అతని భార్యకు 2,500 కేలరీల అవసరమై వుంటుంది. అదే ఒక ఆఫీస్ పక్కకు కదలకుండా పనిచేసే ఉద్యోగికి  రోజూ 1,800 కేలరీలు అయినా సరిపోతాయి.  

ఈ కేలరీల కథ అంతా, మనం ఎంత చురుకుగా వున్నామనే దాన్ని బట్టి వుంటుంది. పాతికేళ్ళ వయసులో సామాన్యంగా ఎటువంటి ఇబ్బందీ లేకుండానే మనం కేలరీలను సులభంగా కరిగించెయ్యగలుగుతాము. కానీ ముప్పై ఐదేళ్ళప్పుడు పరిస్థితిలో మార్పు ప్రారంభమవుతుంది. అప్పుడు మనలో చురుకుపదనం తక్కువ. ఎక్కువ సేపు కూర్చుంటాం. వీలయినంత వరకూ ఒళ్లు అలసటకు గురికాకుండా వుండేందుకు అనువుగా శ్రమలేని జీవితాన్ని గడపడానికి, రోజులో పనులు సులభతరం చేసే  పరికరాలను వుపయోగిస్తూ వుంటాము. అందుకు తగినట్టుగా మన పనికి అవసరమైన తిండి ఎంత సరిపోతుంది అని మనమే చూసుకోవాలి. అంతేకానీ, ఇతరులు అలా ఉంటున్నారు, అది ఫాలో అవుతున్నారు అని వాటిని పట్టుకుని వేలాడకూడదు..

ఒక వ్యక్తి బరువులో మార్పు కలిగించే పరిస్థితులు ఇంకా ఏమైనా వున్నాయా అని ఆలోచిస్తే..  నిశ్చయంగా వున్నాయని మనకు స్పష్టమవుతోంది. చర్మం క్రింద వున్న ధాతువులలో నీరు చేరడం వల్ల బరువు ఎక్కువ కావచ్చు. ఉదాహరణకు - గుండె పనితీరు తప్పినప్పుడు దానికి గురుతుగా కాళ్లూ, ఇతర అవయవాలూ వాపు కనిపించవచ్చు. ఇలానే కొన్ని రకాల మూత్ర పిండపు వ్యాధులు కూడా. ఈ లోపాలున్న వ్యక్తులు ఉప్పు అధికంగా వాడకూడదు. అయితే, సామాన్యంగా చాలామంది బరువెక్కడానికి కారణం ఇదికాదు. అసలు విషయం, ఎక్కువగా తినడమే. తామేమీ ఎక్కువ తినడం లేదని అంటుంటారు. కానీ చేస్తున్న పనికి మించి ఎక్కువ తింటేనే బరువు పెరుగుతారు.  

ఏది ఏమైనా సరే.. మీ బరువు ఎక్కువగా  వున్నట్టయితే మీకొక హెచ్చరిక చెయ్యాలిప్పుడు.  ఇరవై సంవత్సరాలకు పైగా అధిక క్రొవ్వును ఇలా మోసుకు తిరుగుతూ వుంటే, తరువాత జీవిత దశలో, ఈ శ్రమాధ్యికం వల్ల గుండె, మూత్రపిండాలు పని చెయ్యకపోవచ్చు. వాటికి సంబంధించిన జబ్బులు సులువుగా రావచ్చు.  కాబట్టి అధిక బరువు అత్యంత ప్రమాదకరం అన్నమాట ఎన్నటికీ మరువకూడదు. ఇప్పటికైనా బరువు చెప్పే నీతులు కాస్త వినండి.

                                   ◆నిశ్శబ్ద.