జీడిపప్పు చాలామంది ఎక్కువగా తినే డ్రై నట్. జీడిపప్పును స్వీట్స్ లోనూ, వంటల్లోనూ, తీపి, కారం అనే తేడా లేకుండా అన్ని రకాల వంటల్లోనూ ఉపయోగిస్తుంటారు. వీటిని బేక్ చేసి లేదా వేయించి స్నాక్స్ గా తినేవారు కూడా ఉంటారు. అయితే జీడిపప్పును అందరూ తినడం ఆరోగ్యమేనా అంటే లేదు అంటున్నారు ఆహార నిపుణులు. కొన్ని రకాల వ్యక్తులు జీడిపప్పు తినకూడదట. ఇంతకీ వీటిని ఎవరు తినకూడదో తెలుసుకుంటే..
జీడిపప్పులో కొవ్వు శాతం ఎక్కువగా ఉంటుంది. వీటిలో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉన్నా సరే.. ఇప్పటికే శరీరంలో అధిక కొలెస్ట్రాల్ సమస్యతో ఇబ్బంది పడుతున్నవారు జీడిపప్పును తినకూడదు. ఇది కొలెస్ట్రాల్ సమస్యను మరింత పెంచుతుంది.
ఈ కాలంలో మైగ్రేన్ సమస్యతో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. మైగ్రేన్ సమస్యతో ఇబ్బంది పడేవారు జీడిపప్పును అస్సలు తినకూడదు. జీడిపప్పు తింటే మైగ్రేన్ సమస్య మరింత పెరుగుతుంది.
గాల్ బ్లాడర్ అంటే పిత్తాశయం.. కొందరికి గాల్ బ్లాడర్ లో రాళ్లు ఏర్పడుతుంటాయి. ఇలాంటి వారు జీడిపప్పు తినకుండా ఉండటం మంచిది. లేదంటే గాల్ బ్లాడర్ లో రాళ్ల సమస్య మరింత పెరుగుతుంది.
జీడిపప్పులో సోడియం అధికంగా ఉంటుంది. ఈ కారణంగా అధిక రక్తపోటు లేదా హై బీపీ ఉన్నవారు జీడిపప్పును తినకూడదు. ఇవి తింటే హై బీపీ సమస్య మరింత పెరుగుతుంది.
కిడ్నీ సమస్యతో ఇబ్బంది పడేవారు కూడా జీడిపప్పును తినకుండా ఉండటమే మంచిది. జీడిపప్పులో ఉండే సమ్మేళనాలు కిడ్నీ సమస్యలను మరింత పెంచుతాయి.
పొట్ట సంబంధిత సమస్యలు ఏమైనా ఉంటే అలాంటి వారు జీడిపప్పు తినకపోవడం మంచిది. పొట్ట సంబంధ సమస్యలున్న వారికి జీడిపప్పు సమస్యలను మరింత తీవ్రతరం చేస్తుంది.
*రూపశ్రీ.