మీ వంటింట్లో నల్ల మచ్చలు ఉన్న ఉల్లిపాయలు ఉన్నాయా?  ఇవి ఎంతవరకు సేఫ్ మీకు తెలుసా?

ఉల్లిపాయ ఆహారంలో ఎక్కువగా వినియోగించే కూరగాయ.  ఏ కూరలు చేసినా అందులో ఉల్లిపాయ వేస్తే వచ్చే రుచి, సువాసన వేరు.  చాలామంది పచ్చి ఉల్లిపాయలు తినడానికి ఇష్టపడతారు.  అయితే గత కొంత కాలంగా ఉల్లిపాయల మీద నల్లటి మచ్చలు,  దుమ్ము లాంటి బూజు కనిపించడం చాలా మంది గమనించే ఉంటారు.  మార్కెట్ నుండి ఉల్లిపాయలు తెచ్చాక వాటిని నీటిలో కడిగి వండేస్తుంటారు. అయితే ఇలాంటి ఉల్లిపాయలు తినడం ఆరోగ్యానికి మంచిదేనా?  దీని గురించి ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారు?  వివరంగా తెలుసుకుంటే..

ఉల్లిపాయపై నలుపు రంగు..

 ఉల్లిపాయ తొక్కలపై ఉండే నల్లటి మచ్చలు మట్టిలో కనిపించే ఒక సాధారణ శిలీంధ్రం వల్ల ఏర్పడతాయి. ఉల్లిపాయలపై కనిపించే ఈ శిలీంధ్రం సాధారణంగా అంటువ్యాధి కాదు, అయినప్పటికీ, ఉపయోగించే ముందు వాటిని బాగా కడగడం ముఖ్యం.

చాలా మంది బాగా ఆరోగ్యంగా ఉండేవారికి ఉల్లిపాయ మీద ఉండే ఈ  బూజు వల్ల ప్రమాదం ఉండదు. అయితే, బూజు ఉల్లిపాయ లోపలి పొరలకు వ్యాపించినా, ఉల్లిపాయ మెత్తబడినా, లేదా కుళ్ళు స్పష్టంగా కనిపించినా, దానిని తినడం మంచిది కాదు.
ఈ బూజు  కేవలం ఉల్లిపాయ పైననే కాకుండా   కొన్నిసార్లు దాని సన్నని వేర్లు కంటికి కనిపించని విధంగా లోపలికి కూడా వ్యాపిస్తాయి.

ఆరోగ్యానికి మంచిదేనా?

బాగా ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులకు ఈ బూజు పెద్దగా ఆరోగ్యానికి హాని చేయదు. దీని వల్ల ప్రమాదం ఏమీ ఉండదు.   అయితే  కొంతమందిలో బూజు స్పోర్‌లు తుమ్ములు, ఆయాసం లేదా కంటి మంట వంటి అలెర్జీ రియాక్షన్ లకు కారణం కావచ్చు.  రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి.

బయటి ఎండిన పొరపై కొద్దిగా నల్లటి పొడి మాత్రమే ఉండి, లోపల ఉల్లిపాయ పూర్తిగా గట్టిగా, శుభ్రంగా ఉంటే, బయటి పొరను తీసివేసి, బాగా కడిగిన తర్వాత దానిని ఉపయోగించవచ్చు.

ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారు?

ఉల్లిపాయలపై నల్ల మచ్చలను కలిగించే శిలీంధ్రం సాధారణంగా హానికరమైనది కాదని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. అయితే, కొన్ని సందర్భాల్లో, ఇది ఓక్రాటాక్సిన్ ఎ అనే మైకోటాక్సిన్‌ను ఉత్పత్తి చేయగలదట. దీనిని ఎక్కువ కాలం పాటు, అధిక పరిమాణంలో తీసుకుంటే, అది మూత్రపిండాలు , కాలేయానికి నష్టం కలిగించగలదట.

ఈ విషపదార్థం  వేడికి కూడా నశించదుని కాబట్టి వండటం వల్ల ఇది తప్పనిసరిగా తొలగిపోదని అంటున్నారు. అందుకే దీనిని ఆహారంలో ఉపయోగించే ముందు సరిగ్గా చూసుకోవడం  చాలా ముఖ్యం.


                                    *రూపశ్రీ.