సూపర్‌మార్కెట్‌లో, షాప్స్ లో, చిన్న అంగళ్లలో కొనుగోలు చేసే బిస్కెట్లు, ప్యాకెట్ ఫుడ్స్, పాల
ఉత్పత్తులు, జ్యూస్‌లు, సాస్‌లు, రెడీ-టు-ఈట్ ఆహార పదార్థాలపై “Best Before”“Use By”“Expiry
Date” వంటి పదాలు కనిపిస్తుంటాయి. చాలామందికి వీటి మధ్య తేడా స్పష్టంగా తెలియదు.

“తేదీ అయిపోయింది కదా… ఇక ఆహారం మొత్తం పారేయాలా?” అనే సందేహం చాలా మందికి ఉంటుంది. అంతే కాదు.. తేదీ దాటి ఇంకా ఒక్కరోజే, ఒక్క వారమే.. కాబట్టి ఏమి కాదు అనుకుని  వాడేవాళ్ళు  కూడా ఉంటారు. అయితే Best Before తేదీ , Use By/Expiry తేదీ ఒకే అర్థాన్ని ఇవ్వవు. ఆహారం ఎంతకాలం నాణ్యతగా ఉంటుంది?

ఎప్పుడు దాన్ని తినడం సురక్షితం కాదు? అనే విషయాల్లో ఈ తేదీలకు చాలా తేడా ఉంది. దీని గురించి ముందుగా తెలుసుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి.

తేదీ ఎందుకు వేస్తారు?

ఆహార పదార్థాలను తయారు చేసిన తర్వాత వాటి రుచి, వాసన, రంగు, ఆకృతి, పోషకాల నాణ్యత, భద్రత కాలం గడిచేకొద్దీ మారవచ్చు. అందుకే తయారీదారులు ప్యాకెట్‌పై ఒక నిర్దిష్ట తేదీని సూచిస్తారు. అయితే ఆ తేదీ ప్రతి సందర్భంలో “ఆ రోజు తర్వాత ఆహారం విషంగా మారుతుంది” అని అర్థం కాదు.  ఇక్కడే Best BeforeUse By మధ్య తేడా వస్తుంది.

“Best Before” అంటే ఏమిటి?

Best Before అంటే ఆ ప్యాక్ లో ఉన్న ఆహార పదార్థం  మంచి నాణ్యతను కలిగి ఉండే కాలం. అంటే, ప్యాకెట్‌పై..  ఒక నిర్దిష్ట తేదీ వరకు ఆహారం తన రుచి, వాసన, క్రిస్పీనెస్, రంగు వంటి నాణ్యతలను బాగా కలిగి ఉంటుందనీ అర్ధం.

తేదీ దాటిన వెంటనే ఆహారం పాడైపోతుందా?

సరిగ్గా నిల్వ చేసిన కొన్ని ఆహార పదార్థాలు Best Before తేదీ దాటిన తర్వాత కూడా కొంతకాలం తినడానికి అనుకూలంగా ఉండవచ్చు. అయితే వాటి నాణ్యత తగ్గి ఉండవచ్చని చెబుతున్నారు.

ఉదాహరణకు..

బిస్కెట్లు మెత్తబడవచ్చు, సీరియల్స్
క్రిస్పీనెస్ కోల్పోవచ్చు, కొన్ని ప్యాకెట్ ఫుడ్స్ రుచి తగ్గవచ్చు, టీ, కాఫీ వంటి పదార్థాల సువాసన తగ్గవచ్చు. అందుకే  Best Before అనేది
ప్రధానంగా నాణ్యతకు సంబంధించిన అంశం అని చెబుతారు.

“Use By” అంటే ఏమిటి?

Use By అనేది ఆహారం  భద్రతకు సంబంధించిన
గడువు. ఈ తేదీ ముఖ్యంగా త్వరగా పాడయ్యే ఆహార పదార్థాలకు వర్తిస్తుంది.

ఉదాహరణకు:

కొన్ని తాజా పాల ఉత్పత్తులు,  తాజా మాంసం, చేపలు, కొన్ని రెడీ-టు-ఈట్ ఆహారాలు, త్వరగా పాడయ్యే ఇతర ఆహారాలు ప్యాకెట్‌పై నిర్ణీత తేదీ ఉంటే.. ఆ తేదీ దాటిన తర్వాత అది బయటికి చూడటానికి లేదా వాసనకు బాగానే ఉన్నప్పటికి తినడం సురక్షితం అని అని అనుకోకూడదు.  అందుకే Use By తేదీ దాటిన ఆహారాన్ని తినకుండా ఉండటం మంచిది.

Best Before తేదీ దాటితే ఏం చేయాలి?

ఆహారం ఏ రకమైనది, ఎలా నిల్వ చేశారు, ప్యాకెట్ తెరిచారా లేదా అనే విషయాలపై ఇది ఆధారపడి ఉంటుంది. కొన్ని ఆహారాలు ఈ తేదీ దాటిన తర్వాత కూడా తినడానికి అనువుగానే ఉంటాయి. కానీ వాటిలో నాణ్యత మాత్రం తగ్గిపోయి ఉంటుంది. అలాంటి ఆహారం తినడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు.

వాసన చూసి ఆహారం సురక్షితమా కాదా తెలుసుకోగలమా?

కొన్ని హానికరమైన బ్యాక్టీరియా లేదా ఇతర సూక్ష్మజీవులు ఆహారంలో పెరిగినా, ఆహారంలో  దుర్వాసన, రంగు మార్పు కనిపించకపోవచ్చు కూడా. అందువల్ల ఆహారం వాసన రాలేదనే కారణంతో తినడం సరైనది కాదు. ముఖ్యంగా Use By తేదీ దాటిన
ఆహారాన్ని కేవలం వాసన లేదా రుచి చూసి ఏమి కాదని  నిర్ధారించుకోవడం సరైన పద్ధతి కాదు.

ప్యాకెట్ తెరిచిన తర్వాత గడువు మారుతుందా?

కొన్ని ఆహార పదార్థాలకు ఇది చాలా ముఖ్యమైన విషయం. కొన్ని ఆహారాల మీద best before అని ఉన్నా.. ప్యాకెట్ లు లేదా బాటిల్ మూతలు తెరిచిన తర్వాత వాటిని ఎక్కువ రోజులు వాడటం మంచిది కాదు. వాటిని తొందరగా వాడేయాలి.


                                                                                                                                                  *రూపశ్రీ.