ఈ రోజుల్లో బరువు తగ్గడానికో లేదా ఆరోగ్యం కోసమో చాలామంది ఉపవాసాలు చేస్తుంటారు. అయితే, సరైన అవగాహన లేకుండా ఉపవాసం చేస్తే వయసు త్వరగా మళ్లినట్లు కనిపిస్తారని, వృద్ధాప్య ఛాయలు త్వరగా వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇందులో ఎంతవరకు నిజం ఉందో, అసలు ఉపవాసం చేసేటప్పుడు ఎలాంటి తప్పులు చేయకూడదో చాలా మందికి తెలియదు. ఉపవాసం సరైన విధానంలో చేస్తేనే అది శరీరానికి మేలు చేస్తుంది. ఉపవాసం ఎలా చేయాలి? ఉపవాసం తప్పుగా చేస్తే జరిగేది ఏంటి? వివరంగా తెలుసుకుంటే..
ఉపవాసం చేస్తే వృద్ధాప్యం రావడానికి కారణాలు..
పోషకాహార లోపం..
ఉపవాసం ఉండే సమయంలో లేదా ఉపవాసం పూర్తయిన తర్వాత శరీరానికి కావలసినంత విటమిన్లు, మినరల్స్ , ప్రోటీన్లు తీసుకోకపోతే చర్మం తన మెరుపును కోల్పోతుంది. దీనివల్ల ముఖంపై ముడతలు వచ్చి చిన్న వయసులోనే పెద్దవారిలా కనిపిస్తారు.
కండరాల క్షీణత..
సరైన ప్రోటీన్ ఆహారం తీసుకోకుండా ఎక్కువ సమయం ఆకలితో అలమటిస్తే, శరీరం కొవ్వుతో పాటు కండరాల కణజాలాన్ని కరిగించడం ప్రారంభిస్తుంది. కండరాలు తగ్గడం వల్ల శరీరం , ముఖం వేలాడబడినట్లు అయి, వృద్ధాప్య ఛాయలు స్పష్టంగా కనిపిస్తాయి.
డీహైడ్రేషన్..
ఉపవాసం సమయంలో చాలామంది నీళ్లు తాగడం తగ్గించేస్తారు. శరీరంలో నీటి శాతం తగ్గితే చర్మం పొడిబారిపోయి, మెరుపు తగ్గిపోతుంది. ఇది కూడా త్వరగా ముసలితనం రావడానికి ఒక ప్రధాన కారణం.
తీవ్రమైన ఒత్తిడి..
పద్ధతి లేకుండా కఠినమైన ఉపవాసాలు చేయడం వల్ల శరీరంలో కోర్టిసాల్ అనే ఒత్తిడి హార్మోన్ పెరుగుతుంది. ఈ హార్మోన్ అధికమైతే చర్మాన్ని బిగుతుగా ఉంచే కొల్లాజెన్ అనే ప్రోటీన్ దెబ్బతింటుంది.
ఉపవాసం సరిగ్గా చేయాలంటే ఏం చేయాలి?
ఉపవాసం అనేది శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపి చర్మాన్ని, ఆరోగ్యాన్ని మెరుగుపరచాలి కానీ దెబ్బతీయకూడదు. అందుకోసం కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి..
ఉపవాసం ఉన్న సమయంలో , మిగతా సమయంలో తగినంత నీరు, నిమ్మరసం లేదా కొబ్బరిబోండాలు తాగుతూ శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవాలి.
ఉపవాసం విరమించేటప్పుడు నూనె పదార్థాలు, జంక్ ఫుడ్ కాకుండా పండ్లు, ఆకుకూరలు, ప్రోటీన్ ఉన్న మంచి పౌష్టికాహారాన్ని మాత్రమే తీసుకోవాలి.
ఒకేసారి కఠినమైన ఉపవాసాలు ప్రారంభించకుండా, చిన్నగా సమయాన్ని పెంచుకుంటూ పోవాలి.
ఆరోగ్య సమస్యలు ఉన్నవారు నిపుణుల లేదా వైద్యుల సలహా తీసుకున్న తర్వాతే ఉపవాసాలు చేయడం శ్రేయస్కరం.
సరైన పద్ధతిలో చేసే ఉపవాసం యవ్వనాన్ని అందిస్తుంది. కానీ అవగాహన లేని ఉపవాసం వృద్ధాప్యానికి దారితీస్తుంది. కాబట్టి ఆరోగ్యకరమైన పద్ధతులను పాటిస్తూ ఉపవాసం ఉండటమే శ్రేయస్కరం.





