ఉసిరికాయలు భారతీయ ఆయుర్వేదంలో చాలా గొప్ప ఔషదం. త్రిఫలాలు అని పిలువబడే ఆయుర్వేద పండ్లలో ఉసిరి కాయ కూడా ఒకటి. చిన్నతనంలో వీటిని ఉప్పు, కారం అద్దుకుంటూ తింటూంటే ఎంతో మజాగా ఉండేది. ఇప్పుడు కూడా వీటిని చూస్తే పెద్దలు కూడా పిల్లలైపోయి నోట్లో లాలాజలం ఊరించుకుంటూ తింటుంటారు. ఒకప్పుడు సరదాగా తిన్న ఈ ఉసిరికాయలు గొప్ప ఔషదం అని తెలిశాక వీటిని దూరం పెట్టాలని ఎవరూ అనుకోరు. ముఖ్యంగా  ఉసిరికాయలను చలికాలంలో తింటే ఎన్ని లాభాలో తెలిస్తే  ఆశ్చర్యపోతారు. కార్తీక మాసంలో ఈ ఉసిరికాయలు లభ్యం కావడం మొదలవుతుంది.  సుమారు ఫిబ్రవరి నెల వరకు ఇవి అందుబాటులో ఉంటాయి. ఈ కాలంలో వీటిని తినడం వల్ల కలిగే ఆరోగ్య లాభాలేంటో తెలుసుకుంటే వీటిని మిస్ కాకుండా తినచ్చు.

చలికాలంలో జీర్ణవ్యవస్థ చాలా నెమ్మదిస్తుంది. ఈ కారణంగా జీర్ణవ్యవస్థ బలహీనంగా ఉంటుంది.  ఉసిరి కాయలో ఉండే ఫైబర్ ప్రేగులను చురుగ్గా పనిచేసేలా  చేస్తుంది. ఇది మలబద్దకాన్ని దూరం చేస్తుంది. జీర్ణవ్యవస్థలో పేరుకున్న మలినాలను బయటకు పంపేస్తుంది.

రోగనిరోధక శక్తి ఎంత బలంగా ఉంటే ఈ చలికాలంలో ఆరోగ్యం అంత బాగుంటుంది. లేదంటే చాలా సులువుగా ఇన్ఫెక్షన్లు సోకుతాయి. ఉసిరికాయలో ఉండే విటమిన్-సి, యాసిడ్ ఫాలిఫెనాల్స్, ఫ్లేవనాయిడ్స్ సహా చాలా యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో ఫ్రీరాడికల్స్ తో పోరాడతాయి. రోగనిరోధక శక్తిని బలపరుస్తాయి.

వాతావరణం చల్లగా మారడం వల్ల శరీరంలో కూడా మార్పులు వస్తాయి. బద్దకంగా అనిపించడం, పనులు చేయడంలో అనాసక్తి, క్రమంగా వీటి ప్రభావం ఒత్తిడిగా మారుతుంది. ఈ సమస్యలన్నీ తగ్గించడంలో ఉసిరి పనిచేస్తుంది. ఉసిరిలో ఉండే గుణాలు మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.


శరీరంలో రోగనిరోధక శక్తి బాగుండాలంటే విటమిన్-సి చాలా అవసరం. ఉసిరికాయ విటమిన్-సి కి  పెట్టింది పేరు.  ఉసిరి రసం తీసుకుంటే ఇమ్యునిటీ పెరిగి అంటువ్యాధుల సమస్యలు తగ్గుతాయి.  తెల్లరక్తకణాల పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.  సాధారణంగా సీజనల్ వారిగా వచ్చే జలుబు, దగ్గు, జ్వరం వంటి సమస్యలను మంత్రించినట్టు మాయం చేస్తుంది.


చలికాలంలో చర్మం, జుట్టు చాలా దారుణంగా దెబ్బతింటుంటాయి. వీటికి ఉసిరితో చెక్ పెట్టవచ్చు.  ఉసిరిలో ఉండే యంటీ ఆక్సిడెంట్ లక్షణాలు,  విటమిన్-సి  కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తాయి. చర్మాన్ని, జుట్టును ఆరోగ్యంగా మారుస్తాయి. తలలో చుండ్రు, కురుపులు, చర్మ సంబంధ సమస్యలు అన్నీ దూరం అవుతాయి.

                                                      *నిశ్శబ్ద.