ఆరోగ్యంగా ఉంటే ఎలాంటి జబ్బులు దరిచేరవు అంటూ పరిశోధకులు, ఆరోగ్యనిపుణులు సూచిస్తున్నారు. పోషకాలతో కూడిన ఆహారం తీసుకోవడం ద్వారా శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుందని చెప్తున్నారు. కరోనా మహమ్మారి వ్యాప్తి కారణంగా ప్రజల్లో ఆరోగ్యం పై మరింత శ్రద్ధ పెరిగింది. మరి ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని ఆహారాలు రోజూ తప్పనిసరిగా తీసుకోవాలి. వాటిలో ముఖ్యమైనది గోధుమగడ్డి.

 

ఇంటిల్లిపాదికి సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చేది గోధుమ గడ్డి. గోధుమగడ్డి జ్యూస్ రోజూ తాగితే ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇది రక్తహీనతను చాలా వేగంగా తగ్గిస్తుంది. అంతే కాదు శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచే అద్భుతమైన గుణాలు ఇందులో పుష్కలంగా ఉన్నాయి. అందుకే దీన్ని గ్రీన్ బ్లడ్ అని కూడా పిలుస్తారు. గింజల్లో కన్నా మొలకెత్తిన గింజల్లో పోషకాలు ఎలా ఎక్కువ శాతంలో ఉంటాయో అదే విధంగా  గోధుమ గడ్డిలో మిగతావాటి కంటే చాలా రెట్లు ఎక్కువగా పోషకాలు ఉంటాయి. వెజిటబుల్ సూప్ లో కన్నా గ్రీన్ గోధుమ గడ్డి రసంలో రక్తవృద్ధికి తోడ్పడే పోషకాలు 8-9 రెట్లు ఎక్కువగా ఉంటాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.

 

గోధుమ గడ్డిని ఇంట్లో పండించుకోవడం చాలా సులభం. అందుకు కావాల్సింది కొబ్బరి పొట్టు, వర్మికంపోస్ట్ లేదా కొద్దిగా మట్టి కంపోస్టు, కలిపిన మిశ్రమం. మూడు నాలుగు అంగుళాల లోతు ఉన్న చిన్న ప్లాస్టిక్ గిన్నెలు, డబ్బాలు, ట్రేల్లోనూ పెంచుకోవచ్చు. వారం పది రోజుల్లో గోధుమగడ్డి కావలసిన ఎత్తు పెరిగి జ్యూస్ చేసుకోవడానికి సిద్ధంగా ఉంటుంది. రోజూ వరుసగా ఒక్కొక్క ట్రేలో గోధుమ గింజలు చల్లుతూ ఉంటే పది రోజుల తర్వాత రోజూ గోధుమ గడ్డి కోతకు వస్తుంది. గింజలు రాత్రంతా నానబెట్టి తేమ ఆరిపోకుండా ఉండేలా అవసరం మేరకు నీళ్లు చిలకరిస్తే చాలు. ఇంకో విషయం ఏంటంటే గోధుమ గడ్డికి  ఎండ అసలు తగలకూడదు. నీడలోనే పెంచుకోవచ్చు. ఐదు లేదా ఆరు అంగుళాల ఎత్తు పెరిగిన గోధుమగడ్డి ని కత్తిరించి మిక్సీలో వేసి రసం తీసి తాగాలి. అన్ని వయసుల వారు దీన్ని తాగొచ్చు.