"టాంగ్ జ్యూస్ పిల్లలే చేసుకుని త్రాగొచ్చు ఇప్పుడు.  ఇందులో ఫ్రెష్ పళ్ళ విటమిన్ సి, డి లు వుంటాయి, పిల్లలకు శక్తిని ఇస్తుంది." "రస్నా," "మాజా," జ్యూస్ లు, కూల్ డ్రింక్స్ వీటి యాడ్స్ కోసం ఎంతైనా ఖర్చు పెడతారు ముఖ్యంగా ఎండాకాలం.  ఆ యాడ్స్ చూస్తుంటే అవి త్రాగకపోతే అసలు మన దాహం తీరదేమో అన్నంత అనుమానం వస్తుంది.పిడియాట్రిషియన్స్ పిల్లలకు ఫ్రెష్ పళ్ళని ఇవ్వమంటున్నారు కానీ జ్యూస్ లు ఇవ్వొచ్చా అన్నదానికి, ’జ్యూస్ ల్లో ముఖ్యంగా వుండేది కేవలం చక్కెర, పళ్ళ రుచి అంతే అవి ప్రతి రోజు స్కూల్ కి తీసుకెళ్ళి తాగడం, ఇంటికొచ్చి ల్ డ్రింక్స్ తాగడం వల్ల వారికి ఆ తీయదనం వల్ల బరువు పెరగడం, వూబకాయం వచ్చే అవకాశం వుంది, అందుకని పిల్లలకు తాజా పళ్ళు, తాజా కూరలు తినడం, ఇంట్లో తయారు చేసుకున్న ఆహారాన్ని తినడం, ప్రతిరోజు ఏదో ఒక వ్యాయామం చేయడం అలవాటు చేస్తే వారి ఆరోగ్యానికి మంచిది,’ అని చెబుతున్నారు.ఒకప్పుడు బ్రేక్ ఫాస్ట్ అంటే ఇడ్లీ, సాంబారు, చట్నీ, ఉప్మా, రవ్వ ఇడ్లీ, రకరకాల దోసెలు తాజాగా అంటే ఇంట్లోనే పప్పు రుబ్బుకుని, పచ్చడి చేసుకుని, సాంబారు చేసుకుని, పొద్దునే లేచి తయారు చేసి కుటుంబం అంతా కలిసి తిని, ఇంటినుండే మధ్యాహ్నం బోంచేయడానికి కూడా తీసుకెళ్ళేవారు.  ఇప్పటికీ మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి వారు ఇంకా ఇలాగే చేస్తున్నారు.  కానీ ఇండియాలో ’సిరియల్స్,’ కార్న్ ప్లెక్స్, మర మరాలు లాంటి వాటితో, ల్యాబరేటరీలలో, ఫ్యాక్టరీలలో తయారయ్యే ఈ సిరియల్స్ ని,  వీటిని తయారు చేసి ప్యాకేజి చేసి, అట్ట ఫ్యాకెట్లలో, క్యాన్స్ లో, ప్లాస్టిక్ కవర్లలో అమ్మేవాటిని ప్రాసెస్డ్ ఫుడ్ అనే అంటారు.  ఇవి తయారు అయ్యేటపుడు వాటిలో సహజంగా వుండే పోషకపదార్ధాలు, విటమిన్స్, పీచుపదార్ధం చాలావరకు పోతాయి. 

 

అదీ కాక అవి దుకాణలల్లో చాలారోజులు షెల్ఫ్ లల్లో నిల్వ వుండడానికి వాటిల్లో ప్రిజర్వేటివ్స్ , రంగులు, అడిటివ్స్(ఆహార సంకలితం) ఈ సిరియల్స్ లో రుచి కోసం ఒకోసారి సహజమైనవి, లేదా రసాయనాలు ఉప్పు, మొనొసోడియం గ్లుటానెట్ లాంటివి వాడతారు.  విదేశాల్లో పొద్దునే బ్రేక్ ఫాస్ట్ వండుకునే సమయం వుండదు ఎందుకంటే భార్యా, భర్తలిద్దరూ ఉద్యోగాలు, చేసినా చేయకున్నాసులభంగా అయ్యే తిండికి ప్రాముఖ్యతనిస్తారు.   పిల్లలు స్కూళ్ళకి వెళ్ళాలి కాబట్టి సులభంగా తిని, గ్లాసు పాలు లేదా గ్లాసు జ్యూసో తాగేసి వెళ్ళిపోతారు.  ప్రపంచీకరణతో ఈ సిరియల్స్ తయారు చేసే కంపెనీలు అభివృద్ది చెందుతున్న దేశాలకు కూడా విపరీతంగా ప్రాకిపోయాయి. ఇంతకు ముందు ఈ సిరియల్స్ పట్టణాలలో వుండే కుటుంబాలలో కనిపిస్తూ వుండేవి కానీ ఇప్పుడు టీ.వి.లో వచ్చే యాడ్స్ చూసి కానీ, ఏమీ వండకుండానే పిల్లలు తమంతట తామే చాలా సులభంగా ఒక బౌల్ లో సిరియల్ వేసుకుని, కొన్ని పాలు పోసుకుని తినేసి వెళ్ళిపోవచ్చు, అదీ కాక వాటిని పిల్లలకు నచ్చే విధంగా ఎక్కువ చక్కెర, చాక్లెట్ రుచులతో తయారు చేయడం వల్ల పిల్లలు వీటికి త్వరగా అలవాటు పడిపోతారు. 

ఇక పెద్దవాళ్ళ విషయానికి వస్తే విదేశాల్లో ఒంటరిగా వుండే వారు, లేకపోతే ఎక్కువ మటుకు బయట తిండే తినడం అలవాటయినవారు బ్రేక్ ఫాస్ట్, కాఫీ, లేదా జ్యూస్ తో మొదలు పెడితే ఫాస్ట్ ఫుడ్సే డంకిన్ డోనట్స్ లో(Dunkin Donuts) బాగా నూనెలో గోలించి చక్కెర పాకంలో వేసిన ఈ డోనట్స్ రకరకాల రుచుల్లో దొరుకుతాయి, ఇవి తిని పెద్ద మగ్ కాఫీతో కడుపు నింపుకునే వారు, లేదా మెక్ డొనాల్డ్స్ లో దొరికే చికెన్ బర్గర్స్, ప్రోటీన్ కోసం బేకన్, పంది మాంసంతో తయారు చేస్తారు, వీటిని బ్రేక్ ఫాస్ట్ లో బ్రెడ్ పైన ఒక అమ్లెట్ పూర్తిగా కాలకుండానే తీస్తారు, మరో బ్రెడ్ ముక్కపై ఈ బేకన్ ముక్కలు కాల్చుకుని తింటారు,(ఇవి బాగా వండినవి తినాలి.)  కానీ అమెరికన్స్ చాలా మంది బయట తింటే సరిగ్గా ఉడికీ ఉడకనీ మాంసాన్నే (ఏ రకమైన మాంసమైనా) ఇష్టపడి తింటారు, దీనివల్ల కడుపుకి సంబంధించిన జబ్బులు చాలా వస్తాయి.  ఒకోసారి క్యాన్సర్స్ కూడా వచ్చే అవకాశం వుంటుంది.  ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల మధ్య గట్టి పోటి వుంటుంది నెంబర్ వన్ బ్రేక్ ఫాస్ట్ - ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అనిపించుకోవడానికి.  కస్టమర్లని ఆకట్టుకోవడానికోసం మెక్ డొనాల్డ్స్ వారు రెండువారాలు ఎటువంటి బ్రేక్ ఫాస్ట్ తోనయినా రోజు ఫ్రీగా మంచి రుచికరమైన కాఫీ రెండువారాలు ఇచ్చారు ఈ మధ్యనే బ్రేక్ ఫాస్ట్ పోటీలో ఇతర ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ కన్నా నెంబర్ వన్ అనిపించుకోవడానికి.  టాకో బెల్ అనే ఫాస్ట్ ఫుడ్ సెంటర్ క్రొత్త బ్రేక్ ఫాస్ట్ వాఫుల్ టాకోస్ (Waffle Tacos) ప్రవేశ పెడ్తుందని మెక్ డొనాల్డ్స్ వాళ్ళు ఈ పని చేసారు.  ఇద్దరూ కొత్త అడ్వర్టయిజ్ మెంట్స్ తో కస్టమర్లని ఆకట్టుకోవడానికి హోరా హోరిగా పోటి పడ్డారు. 


 
ఈ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రెష్ తిండి కాదు ల్యాబోరేటరీలలో తయారయి వాటిలో నిలవ వుండడానికి వాడే రసాయనాల వల్ల్ల గ్యాస్ట్రో ఇంటస్టినల్ ప్రాబ్లెమ్స్, పిల్లలు పుట్టే అవకాశం తగ్గిపోతుంది, మన లోపలి శరీర భాగాలు కూడా బాగా దెబ్బ తింటాయి.ఈ మధ్యన చేసిన అమెరికాలో 20,000 వేల అమెరికన్లు అంటే తెల్లవారిని, నల్లవారి కలిపి వారు ఎలాంటి తిండి తింటున్నారు వారికి ఎందువల్ల స్ట్రోక్, పక్షవాతం ఎక్కువగా వస్తుంది అనే విషయం పై రిసెర్చ్ చేసారు. అమెరికాలో దక్షిణ ప్రాంతపు రాష్ట్రాలల్లో ఆఫ్రికన్ అమెరికన్స్, నల్లవారు బాగా నూనెలో గోలించిన తిండి, ఫ్రైడ్ చికెన్, ఫ్రెంచ్ ఫ్రైస్, ప్రాసెస్ చేసిన బేకన్, హామ్(ham- ఇంకో రకమైన పంది మాంసం), తియ్యటి టీ, కాఫీలు, సోడాలు త్రాగే వారికి ఈ పక్షవాతం వచ్చే అవకాశం వుంది, ప్రాణాలు కోల్పోయే అవకాశం కూడా వుంది.  నూనెలో బాగా వేయించిన తిండి తిన్నవారికి కొలస్ట్రాల్ ఎక్కువవ్వడం, బ్లడ్ ప్రెషర్ విపరీతంగా పెరగడం, డయాబెటిస్ జబ్బున్నవారికి మరింత క్లిష్టమవ్వడం, స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఎక్కువవ్వడం జరుగుతుంది.  వీరికి వ్యతిరేకంగా తాజా పళ్ళు, కూరలు, పప్పు దినుసులు, ధాన్యం, చేపలు తినేవారికి 29% స్ట్రోక్ వచ్చే అవకాశం తక్కువుంది. 

 

అమెరికాలోని దక్షిణ రాష్ట్రాల్లో వుండే వారికి నూనెలో గోలించిన తిండి తినడం వల్లే స్ట్రోక్ వస్తుందని పరిశోధనలో వెల్లడయ్యింది.  ఈ పరిశోధనని మనం సీరియస్ గా తీసుకుని ఆలోచిస్తే ప్రపంచం ఏ నలుమూలలో వున్న వారయినా ఇలాంటి తిండి తింటే స్ట్రోక్ రావడమే కాదు ఇంకా ఇతర జబ్బులు కూడా వచ్చే అవకాశాలున్నాయని గమనించాలి.
 
ఇండియాలో కూడా ప్రపంచీకరణ తర్వాత మన ఫాస్ట్ ఫుడ్ తో పాటు అంటే పకోడీలు, మిరపకాయ బజ్జీలు, గారెలు, సమోసాలు లాంటివి సాయంత్రం కాగానే బండీల చుట్టూ చేరి అన్నీ వయసుల వారు తింటూనే వుండేవారు.  ఇప్పుడు వాటికి తోడు మెక్ డొనాల్డ్స్ లాంటివి, పిజ్జాలు విపరీతంగా ఎక్కువయిపోయాయి.  ఈ అనారోగ్యపు తిండి తిని వూబకాయాలు పెంచుకోవడం, జబ్బులు పెంచుకోవడం మామూలైపోయింది.  కూల్ డ్రింక్స్ లో కూడా సోడా నుండి ఆర్టిఫిషియల్ రుచి విడిపోకుండా బివిఓ (BVO - Brominated vegetable oil) కలుపుతున్నారు.  ఈ బివిఓ, ప్లాస్టిక్ వస్తువులు మంటలు అంటుకుని కాలకుండా వుండడానికి వాడేవారు.  అలాంటిది కూల్ డ్రింక్స్ లో, కొన్ని రకాల జ్యుసుల్లో కలుపుతున్నారని తెలిసి ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ వారు అభ్యంతరం తెలపడంతో కొన్ని కూల్ డ్రింక్స్ వారు ఈ బివిఓ ని తీసేయడానికి ఒప్పుకున్నారు.  ఈ బివిఓ కలసి వున్న కూల్ డ్రింక్స్ తాగితే చర్మ వ్యాధులు, మతి మరుపు, నరాల జబ్బులు వచ్చే అవకాశాలున్నాయి. విదేశాల్లో ముఖ్యంగా అమెరికాలో నీళ్ళకు బదులు ఈ కోక్ లు, లేదా జ్యూస్లు త్రాగడం అలవాటు.  పిల్లలకు ఒకసారి ఇవి అలవాటయితే వారు నీళ్ళు అస్సలు ముట్టుకోనే ముట్టుకోరు.  నీళ్ళు త్రాగమని యాడ్స్ వస్తుంటాయి.  వీటితో పాటు బయటి తిండి తినడం కూడా అలవాటు పడితే కేవలం వూబకాయం రావడమే కాదు భయంకరమైన క్యాన్సర్ జబ్బులు చిన్న వయసులోనే వచ్చి ఎన్ని ట్రీట్ మెంట్లు ఇచ్చినా పని చేయకుండా అవుతాయి. 

మీకు ఇంకో విషయం తెలిస్తే షాక్ కి గురవ్వుతారు.  అదేమిటంటే హెల్త్ ఇన్స్యూరెన్స్ వారు వారి పెట్టుబడులు ఎక్కువ ఎక్కడ పెడుతున్నారో తెలుసా?  ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ ల్లో.  ఎందుకంటే ఈ తిండికి అలవాటు పడే జనాబకి జబ్బులు వస్తాయి అవి కూడా ఎలాంటివి అంటే క్రానిక్ జబ్బులు అంటే వాటికి ట్రీట్ మెంట్ జీవితాంతం అవసరం అవుతుంది.   అప్పుడు వారికి హెల్త్ ఇన్స్యూరెన్స్ అవసరం అవుతుంది.  ఇలాంటి విషయాలు చూస్తే ఈ పెద్ద పెద్ద వ్యాపారస్తులకు, ఇన్స్యూరెన్స్ కంపెనీలకు, హాస్పిటల్స్ కి వారికి వచ్చే లాభాలే ముఖ్యం, వారి స్వార్ధం వారిదే కానీ ప్రజల ఆరోగ్యం, వారి బాగోగులు లాంటివి అస్సలు అవసరం లేదు అనే విషయం ఆలోచిస్తేనే మనం ఏ దిశగా పయనిస్తున్నాము? ఇది అభివృద్ది అనాలా, స్వార్ధపరత్వం ఎక్కువై పోయి దిగజారుతున్న వ్యవస్థ అని అనుకోవాలో తెలియని అయోమయ అవస్థ. అందుకనీ ఆరోగ్యవేత్తలు, సైంటిస్టులు జబ్బులు చేయకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, ప్రజల్లో ఆరోగ్య జాగ్రత్తల గురించి అవగాహన పెంచాలని కోరుకుంటారు, దీన్నే ప్రివెంటివ్ కేర్(Preventive care) అంటారు.
 
ఈ మధ్యన కొనుక్కునే తిండిలో ఏం వుంటుంది, కొన్ని రకాల తిండిలో ఎరువులు కలుపుతున్నారని కూడా తెలుస్తుంది  దాని వల్ల వచ్చే నష్టాలు ఏమిటి అనే విషయాల పై కొంచెం అవగాహన పెరుగుతుంది దాని వల్ల వాటి అమ్మకాలు తగ్గడంతో కొంతమంది ఆ తిండిలో కలిపే రసాయనాలు తీసేస్తున్నామని ప్రజలకి నమ్మకం కలిగించి మళ్ళీ వాళ్ళని ఆకట్టుకోవడానికి కొత్త యాడ్స్ చేస్తున్నారు ఇపుడు.  రసాయనాలు పూర్తిగా తీసేస్తున్నారో, కొద్దిగా వుంచితే అది న్యుట్రిషన్ సమాచారంలో చూపించేంత శాతం లేకుండా చూసుకుంటున్నారా అన్నది చూడాలి అంటున్నారు సైంటిస్టులు.  అందుకనే మనం తినే తిండిలో ఏం వుందో చూసుకుని మరీ తినడం మంచిది.  ఒకప్పటిలా ఆరోగ్యకరమైన ఆహారం దొరకడం కష్టం అవుతుంది.  మంచి నేలలో పండే పంటల్లో ఆ రోజుల్లో ఎరువులు కూడా అవసరం అయ్యేవి కావు, పురుగు పుట్రా పట్టకుండా వుండడానికి, పంటలు బాగా పండాలంటే ఎరువులు ఎక్కువగా వాడడం వల్ల మనం తినే పప్పులు, కూరల్లో కాలుష్యం, పీల్చే గాలిలో కాలుష్యం, ఇవి సరి పోవనట్టు తిండిని ప్రాసెస్ చేసినవి, నూనె, మసాలలు నిండి వున్నవి, బాగా కొవ్వు పదార్ధాలుండే పిజ్జాలు, బర్గర్స్, ఫ్రెంచ్ ఫ్రైస్, బజ్జీలు, పకోడీలు లాంటి చిరుతిళ్ళు తిని చిన్న వయసులో ఎప్పుడూ కని విని ఎరుగని అనారోగ్యాలకి గురి అవుతున్నారు.  చిన్నప్పటి నుండి ప్రాసెస్ చేసిన తిళ్ళు రోజు తింటుంటే వాటిలో వుండే రసాయనాలు మన శరీరం పై ప్రభావం చూపడం చిన్న వయసులోనే క్యాన్సర్, గుండె జబ్బులకి గురి కావడం జరుగుతుంది.  అదీ కాక జీవన విధానం కూడా మారడంతో, నడక తగ్గడం, సైకిల్స్ పై వెళ్ళడం తగ్గిపోవడంతో, శరీరానికి కావాల్సిన వ్యాయమం దొరకక కూడా వూబ కాయం, డయాబెటిస్, బ్లడ్ ప్రెషర్, గుండెకి, గ్యాస్ట్రో ఇంటస్టినల్ కి  సంబంధించిన వ్యాధుల భారిన పడుతున్నారు.  ఆందుకని మన ఆరోగ్యం గురించి, ఆరోగ్యకరమైన ఆహారం గురించి తెలుసుకోవడం అలాగే ఎలాంటి తిండి తింటే మనకి జబ్బులు వచ్చే అవకాశాలున్నాయో వాటి గురించి అవగాహన పెంచుకుని  జాగ్రత్తలు తీసుకుంటే చిన్న వయసులోనే జబ్బుల భారిన పడకుండా వుండే అవకాశం వుంది.
 
 టీ.వీలో వచ్చే యాడ్స్ చూసి అవి నమ్మేసి అన్నీ కొనేసి సులభంగా అవుతుందని ఈ ప్రాసెస్డ్ తిండికి అలవాటు పడకుండా చిన్నప్పట్నుండే పిల్లలకు కనిపించేవన్ని మంచివి కావని వాటిలో ఏముంటాయో ముందుగా తల్లి తండ్రులు తెలుసుకుని పిల్లలకి తెలియజేసి వారికి తాజా కూరలు, తాజా పళ్ళు, పప్పు దినుసులు, ధాన్యం, మాంసాహారం తినే వారు చేపలు తినడం అలవాటు చేసుకోవడంతో పాటు శరీరానికి కావాల్సిన వ్యాయామాన్ని చేయాలి అనే నియమం పెట్టుకుని చేస్తే ఆరోగ్యమే మహాభాగ్యం అనే మాటని నిజం చేసుకోవచ్చు.  తల్లి తండ్రులు ఆరోగ్యకరమైన ఆహారం తినడం, వ్యాయామం చేస్తూ వుంటే పిల్లలకు కూడా అదే అలవాటవుతుంది.  పిల్లలకు అర్ధం కాదు అని వదిలేస్తే వారు బయటి తిళ్ళకే అలవాటు పడిపోతుంటారు వారికి చెప్పే విధంగా చెబితే తప్పకుండా వింటారు.