మానసిక ఆరోగ్యం మెరుగ్గా ఉండాలంటే ఈ టిప్స్ ఫాలో అవ్వాల్సిందే..!

నేటి వేగవంతమైన ప్రపంచంలో శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం ఎంతగానో ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రతి ఏటా అక్టోబరు 10న ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం జరుపుకుంటారు. మానసిక ఒత్తిడి, ఆందోళన, నిరాశ వంటి సమస్యలపై ప్రజల్లో అవగాహన పెంచడం , ఈ విషయాలపై బహిరంగంగా మాట్లాడటాన్ని ప్రోత్సహించడమే ఈ రోజు ముఖ్య ఉద్దేశం. ప్రస్తుత కాలంలో ఉద్యోగ ఒత్తిడి, సరిపడా నిద్ర లేకపోవడం, సోషల్ మీడియా అధికంగా వాడటం , వ్యక్తిగత సమస్యలు మన మానసిక ప్రశాంతతను దెబ్బతీస్తున్నాయి. మనసు ప్రశాంతంగా, ఆరోగ్యంగా ఉండటానికి రోజువారీ జీవితంలో అలవర్చుకోవాల్సిన కొన్ని సులభమైన అలవాట్లు ఫాలో అవ్వాలి.  అవేంటో తెలుసుకుంటే..

నిద్ర..

తగినంత నిద్రపోవడం ప్రశాంతమైన మనస్సుకు పునాది లాంటిది. రోజూ ఒకే సమయానికి నిద్రపోవడం, ఒకే సమయానికి మేల్కొనడం అలవాటు చేసుకోవాలి. రాత్రి వేళల్లో ఎక్కువ సమయం మొబైల్ వాడటం తగ్గించడం వల్ల నాణ్యమైన నిద్ర పడుతుంది. ఇది రోజంతా మంచి మూడ్, ఏకాగ్రత , ఉత్సాహాన్ని ఇస్తుంది.

వ్యాయామం..

క్రమం తప్పకుండా చిన్నపాటి వ్యాయామం చేయడం వల్ల మానసిక అలసట దూరమవుతుంది. రోజూ అర గంట పాటు నడవడం, యోగా చేయడం లేదా తేలికపాటి వ్యాయామాలు చేయడం వల్ల శరీరంతో పాటు మనస్సు కూడా ఉత్తేజితమవుతుంది.

డిజిటల్ బ్రేక్..

సామాజిక మాధ్యమాలకు కాసేపు దూరంగా ఉండటం మనస్సుకు మంచిది. ఎప్పుడూ ఫోన్ చూడటం, ఇతరుల జీవితాలతో మనల్ని పోల్చుకోవడం వల్ల తెలియకుండానే ఒత్తిడి పెరుగుతుంది. అందుకే రోజులో కొంత సమయం డిజిటల్ ప్రపంచానికి దూరంగా ఉంటూ డిజిటల్ బ్రేక్ తీసుకోవడం అవసరం.

ఒత్తిడి..

మనసులోని బాధను లేదా ఒత్తిడిని లోపలే దాచుకోకుండా నమ్మకమైన వ్యక్తులతో పంచుకోవాలి. కుటుంబ సభ్యులు, స్నేహితులు లేదా ఆత్మీయులతో సమస్యల గురించి మాట్లాడటం వల్ల మనసు తేలికపడుతుంది.

ధ్యానం..

రోజూ కొన్ని నిమిషాలు ధ్యానం , ప్రశాంతంగా శ్వాస తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. ప్రశాంతమైన ప్రదేశంలో కూర్చుని నెమ్మదిగా శ్వాస తీసుకోవడం వల్ల ఒత్తిడి తగ్గి మనసు అదుపులోకి వస్తుంది.

ఆహారం..

మనం తినే ఆహారం కూడా మన మానసిక స్థితిపై ప్రభావం చూపుతుంది. పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, ప్రొటీన్లు ఉన్న సమతుల ఆహారం తీసుకోవాలి. ఎక్కువగా జంక్ ఫుడ్ తినడం తగ్గించి, తగినన్ని నీళ్లు తాగుతుండాలి.

విరామం..

పని లేదా చదువు మధ్యలో చిన్న చిన్న విరామాలు తీసుకోవడం చాలా ముఖ్యము. గంటల తరబడి ఒకేచోట కూర్చుని పనిచేయడం వల్ల మానసిక అలసట పెరుగుతుంది. మధ్యమధ్యలో కాసేపు నడవడం లేదా కళ్లకు విశ్రాంతి ఇవ్వడం వల్ల తిరిగి ఉత్సాహంగా పనిచేయవచ్చు.

పర్సనల్ టైమ్..

వ్యక్తిగత సమయాన్ని కేటాయించుకోవడం మర్చిపోకూడదు. మనసుకు నచ్చిన సంగీతం వినడం, పుస్తకాలు చదవడం, మొక్కల పెంపకం లేదా ఇతర వ్యాపకాలపై దృష్టి పెట్టడం వల్ల రోజువారీ ఒత్తిళ్ల నుంచి ఉపశమనం లభిస్తుంది.

ఈ చిన్న మార్పులను జీవితంలో భాగం చేసుకోవడం ద్వారా మానసిక ఆరోగ్యాన్ని సులభంగా కాపాడుకోవచ్చు.

                                                                                                                                                  *రూపశ్రీ.