
వేసవికాలం అంటేనే వేడి గాలులు, వడదెబ్బ, మండే ఎండలు గుర్తొస్తాయి. ఎండల వేడి గురించి పక్కన పెడితే.. మనుషుల నుండి జంతువుల వరకు.. ప్రతి ఒక్క ప్రాణి వేసవిలో వడదెబ్బకు గురయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. వడదెబ్బ కారణంగా ప్రాణాలు పోయే అవకాశం కూడా ఉంటుంది. వేసవి కాలంలో వడదెబ్బ తగలకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ జాగ్రత్తలే ప్రతి ఒక్కరికి శ్రీరామ రక్షలా కాపాడతాయి. ఆ చిట్కాలు ఏంటో తెలుసుకుంటే..
ప్రయాణాలు..
వేసవి కాలంలో చేసే ప్రయాణాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అధిక వేడిమితో డీహైడ్రేషన్ గురికాకుండా తరచూ మంచినీరు,ఓఆరెస్,పల్చటి మజ్జిగ వంటివి తీసుకుంటూ ఉండాలి. వీలైనంత వరకు ఉదయం చాలా తొందరగా, లేదా సాయంత్రం ఎండ వేడిమి చాలా వరకు తగ్గిన తర్వాత ప్రయాణాలు చేయడం ఉత్తమం. మరీ ముఖ్యంగా చిన్న పిల్లలతో ప్రయాణాలు చేసేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి.
బయటకు వెళ్లడం..
వేసవి కాలంలో సాధారణంగా మిగతా రోజుల్లా పనుల కోసం బయటకు వెళ్ళే విధానాన్ని తగ్గించుకోవాలి. వేసవి కాలంలో పనుల షెడ్యుల్.. బయటకు వెళ్ళి చక్కబెట్టుకోవాల్సిన పనుల ప్రణాళికలు మార్చుకోవాలి. తప్పనిసరిగా వెళ్లవలసి వస్తే.. వెంట వాటర్ బాటిల్, గొడుగు ఉండేలా చూసుకోవాలి. కాలి నడకన లేదా బైక్ లో వెళ్లడం కంటే ఆటో వంటి వాహనాలలో బయటకు వెళ్లి రావడం చాలా మంచిది.
ఆహార, పానీయాలు..
వేసవిలో తీసుకునే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. శరీరానికి నీటి శాతాన్ని ఇచ్చే ఆహారాలు తీసుకోవాలి. ఆహారంలో కారం, ఉప్పు, నూనె వంటివి బాగా తగ్గించాలి. నీటి శాతం అధికంగా ఉండే కూరగాయలు, పండ్లు విరివిగా తీసుకోవాలి. ముఖ్యంగా ఎండలో బయటకు వెళ్లి వచ్చిన తర్వాత తొందర పాటులో చాలా చల్లగా ఉన్న ఫ్రిజ్ లోని నీరు తాగడం మానుకోవాలి. బయటకు వెళ్ళి వచ్చిన తర్వాత కుండలోని నీరు లేదా పల్చగా మజ్జిగ, సుగంద షర్బత్ వంటివి తాగవచ్చు. ఇవి శరీరానికి ఊరట ఇస్తాయి. వేసవి తాపం తీరుస్తాయి.
హెల్త్ కేర్..
వేసవి ఎండల కారణంగా ఆరోగ్య ఇబ్బందులు తలెత్తితే దగ్గరలోని ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల్లో తగిన చికిత్స పొందాలి. అక్కడ ఓఆర్ లేదా ఎలక్ట్రోలైట్స్ ను అందించి ఆరోగ్యాన్ని పరిరక్షిస్తారు. ఉదయం 11గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు నీడ పట్టున విశ్రాంతి తీసుకోవడం లేదా నీడ పట్టున పనులు చేసుకోవడం మంచిది.
సేవ..
వేసవికాలంలో ప్రతి ఒక్కరు తమ ఆరోగ్యం గురించి మాత్రమే కాకుండా.. నలుగురి ఆరోగ్యం గురించి కూడా ఆలోచించడం కనీస మానవత్వం. వేసవిలో ప్రయాణాలు చేసేవారు.. దారి వెంట వెళ్లే బాటసారులు ఉంటారు. అలాంటి వారి కోసం.. మంచి నీరు ఏర్పాటు చేయడం, అక్కడక్కడా కూర్చోవడానికి కాసింత చోటు ఇవ్వడం వంటివి కూడా చేయాలి. ఇవి కనీస మానవ ధర్మం కూడా. అయితే.. ఏ పని చేసినా ప్రమాదాలు మీదకు తెచ్చుకోకుండా చేయడమే మంచిది.
*రూపశ్రీ.




