సాధారణంగా వయసు పెరిగే కొద్దీ కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు మొదలవుతాయి. అంతే కాకుండా శరీరంలో విటమిన్ డి, కాల్షియం, ఐరన్ లోపం వల్ల కూడా మోకాళ్ల నొప్పులు వస్తాయి. ఏదైనా గాయం కారణంగా, ఏదైనా దెబ్బతగలడం, కాళ్లను చాలా సేపు వంచి కూర్చోవడం వల్ల, కండరాలు కణజాలాలు సాగదీయబడతాయి. ఇది మోకాళ్లలో నొప్పిని కలిగిస్తుంది. మోకాళ్ల నొప్పులతో ఇబ్బంది పడేవారు కొన్ని ఇంటి చిట్కాలతో వాటి నుండి ఉపశమనం పొందవచ్చు. ఈ ఇంటి చిట్కాలను పాటించడం కూడా చాలా సులభం. వాటి ప్రభావం కూడా చాలా త్వరగా కనిపిస్తుంది.
అల్లం టీ..
యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉండే అల్లం తీసుకోవడం వల్ల మోకాళ్ల నొప్పుల నుంచి ఉపశమనం పొందవచ్చు. అల్లం చిన్న ముక్కలుగా కోసి నీళ్లలో వేసి మరిగించాలి. 10 నిమిషాల తర్వాత ఈ నీటిని ఫిల్టర్ చేయాలి. ఇందులో కొంచెం తేనె, నిమ్మరసం కూడా జోడించాలి. ఇలా తయారుచేసిన టీని రోజుకు 2 నుంచి 3 సార్లు తాగడం వల్ల మోకాళ్ల నొప్పుల నుంచి ఉపశమనం పొందవచ్చు.
నిమ్మకాయ, నువ్వుల నూనె..
మోకాళ్ల నొప్పులకు నిమ్మకాయ, నువ్వుల నూనె దివ్యౌషధం లా పనిచేస్తాయి. నిమ్మకాయను నువ్వుల నూనెలో ఉడికించి మోకాళ్లపై రాసుకోవచ్చు. లేదంటే ఒకటి రెండు నిమ్మకాయలను కోసి కాటన్ గుడ్డలో కట్టాలి. నువ్వుల నూనెలో ఈ గుడ్డను ముంచి నొప్పి ఉన్న ప్రదేశంలో 5 నుండి 10 నిమిషాల పాటు ఉంచండి. ఈ రెమెడీని రోజుకు రెండుసార్లు ప్రయత్నించడం వల్ల మోకాళ్ల నొప్పులు తగ్గుతాయి.
పసుపు..
ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్న పసుపును కడుపుకు తీసుకోవడమే కాదు.. మోకాళ్లపై రాసుకోవడం వల్ల నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. పసుపులో ఉండే కర్కుమిన్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు కలిగి ఉంటుంది. ఇది మోకాళ్ల నొప్పుల నుండి ఉపశమనాన్ని ఇస్తుంది. అర టీస్పూన్ తురిమిన అల్లంలో అర టీస్పూన్ పసుపు వేసి నీటిలో వేసి 10 నిమిషాలు ఉడికించాలి. ఈ టీలో కొంచెం తేనె కలుపుకుని రోజుకు రెండుసార్లు తాగాలి. నొప్పి తగ్గడం గమనించవచ్చు. పసుపు పాలు కూడా తాగవచ్చు. పసుపులో ఆవాల నూనెను కలిపి పేస్ట్ చేయాలి. ఈ పేస్ట్‌ను మోకాళ్లపై అప్లై చేయవచ్చు.
తులసి టీ..
తులసిని ఆయుర్వేద ఔషధంగా ఉపయోగిస్తారు. కొన్ని తులసి ఆకులను నీటిలో వేసి 10 నిమిషాలు ఉడికించాలి. ఈ టీని రోజూ 2 నుంచి 3 సార్లు తాగడం వల్ల మోకాళ్ల నొప్పుల నుంచి ఉపశమనం పొందవచ్చు.
ఆముదము..
కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం పొందేందుకు ఆముదం కూడా ఉపయోగపడుతుంది. 2 నుంచి 3 చెంచాల ఆముదం తీసుకుని కాస్త వేడి చేసి మోకాళ్లకు పట్టించాలి. ఈ నూనెతో లైట్ మసాజ్ చేయడం వల్ల మోకాళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది.
*రూపశ్రీ.