ఆకుపచ్చ కూరగాయలు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి చాలా ఉపయోగపడతాయి.. వీటిలో ఎన్నోరకాల విటమిన్లు, ఖనిజాలు మరియు పోషకాలు ఉంటాయి, ఇవి తీవ్రమైన జబ్బుల నుండి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. ముఖ్యంగా డయాబెటిస్ బాధితులు రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించే కొన్ని కూరగాయలు తప్పనిసరిగా తీసుకోవాలి. మధుమేహం యొక్క సమస్యలను తగ్గించడంలో కూరగాయలు కూడా ప్రయోజనకరంగా ఉంటాయి. అలాంటి కూరగాయలలో ఎంతో శక్తివంతమైనది బెండకాయ.
డయాబెటిక్ రోగులు క్రమం తప్పకుండా బెండకాయ తీసుకుంటే, రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా నిరోధించడంలో సహాయపడుతుందని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. ముఖ్యంగా, ఈ కూరగాయలలో కేలరీలు, కొవ్వు రెండూ తక్కువగా ఉంటాయి, ఇది మధుమేహానికి ప్రయోజనకరంగా ఉంటుంది.
డయాబెటిస్ ఉన్నవారు బెండకాయ తీసుకుంటే..
రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గిచడం బెండకాయ వల్ల ఎంతో సులువు. కాల్చిన బెండకాయ విత్తనాలు మధుమేహం చికిత్సకు టర్కీలో చాలా కాలంగా ఉపయోగించబడుతున్నాయి. రక్తంలో చక్కెరను తగ్గించడంలో కూడా ఇది సానుకూల ప్రభావాలను చూపుతుంది. బెండకాయ మధుమేహ వ్యాధి గ్రస్తులకు ఎందుకు మంచిదంటే..
బెండకాయలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఫైబర్ ఉన్న ఆహారాలు జీర్ణక్రియకు సహాయపడటమే కాకుండా ఆకలి బాధలను తగ్గించి, ఎక్కువసేపు కడుపు నిండుగా ఉంచుతాయి. ఫైబర్ కంటెంట్ అధికంగా ఉన్న ఆహారం మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఎంతో మంచిది. గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండటం వల్ల, బెండకాయలు ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరచడంలో ప్రయోజనకరంగా ఉంటాయి.
బెండకాయలు రక్తంలో గ్లూకోజ్-తగ్గించే శక్తివంతమైన కూరగాయ. బెండకాయను మాత్రమే కాకుండా బెండకాయ విత్తనాలను పొడిగా చేసి తీసుకోవడం వల్ల కూడా మధుమేహం తగ్గించుకోవచ్చు.
డయాబెటిస్‌లో మాత్రమే కాకుండా బెండకాయ చాలా ప్రయోజనాలను కలిగి ఉంటుంది. బెండకాయలో విటమిన్-ఎ, సి, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి, ఇవి క్యాన్సర్, డయాబెటిస్, స్ట్రోక్, గుండె జబ్బుల వంటి తీవ్రమైన ఆరోగ్య పరిస్థితుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. ఇందులో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. ఇది కండరాలు, నరాల పనితీరును మెరుగుపరిచి అవి ఆరోగ్యంగా ఉండటంతో సహాయపడుతుంది.
కాబట్టి బెండకాయను వీలైనంతగా ఆహారంలో భాగం చేసుకుంటే అద్భుతమైన ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు.
◆నిశ్శబ్ద.