డార్క్ చాక్లెట్ నలుపు రంగులో కాసింత చేదుగా ఉండే చాక్లెట్. దీని వాసన  చాలా ఆహ్లాదంగా ఉంటుంది.  సాధారణ చాక్లెట్లతో పోలిస్తే డార్క్ చాక్లెట్ పూర్తీ విభిన్నం. డార్క్ చాక్లెట్ లో కోకో ఎక్కువగానూ, పాల పదార్థాల పరిమాణం, చక్కెర శాతం తక్కువగానూ ఉంటాయి. ఈ కారణంగా డార్క్ చాక్లెట్ తింటే సాధారణ చాక్లెట్లలా శరీరంలో చక్కెర స్థాయిలు పెరగుతాయనే భయం అంటారు. సాధారణ చాక్లెట్లతో పోలిస్తే ధర పరంగా ఎక్కువగా ఉన్నా దీన్ని తినడం వల్ల బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని వైద్యుల నుండి ఆహార నిపుణుల వరకు అందరూ చెబుతున్నారు. అసలు డార్క్ చాక్లెట్ ఎందుకు ఉత్తమమైనదిగా పరిగణింపబడుతుంది? దీనివల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి? పూర్తీగా తెలుసుకుంటే..

యాంటీ ఆక్సిడెంట్లు..

డార్క్ చాక్లెట్ ను దీని చేదు రుచి కారణంగా సాధారణంగా బేకింగ్ చాక్లెట్ గా ఉపయోగిస్తారు.  దీంట్లో పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ప్లేవనాయిడ్లు, పాలీఫెనాల్స్ ఇందులో ఉంటాయి.  ఇవి హానికరమైన ఫ్రీ రాడికల్స్ తో పోరాడి  ఆక్సీరణ ఒత్తిడి నుండి శరీరాన్ని కాపాడతాయి. రోజూ ఓ చిన్నముక్క డార్క్ చాక్లెట్ తింటుంటే చాలా లాభాలు ఉంటాయ్.

పోషకాలు ఎక్కువ..

డార్క్ చాక్లెట్ లో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఐరన్, మెగ్నీషియం, కాపర్ వంటి ముఖ్యమైన ఖనిజాలు ఉంటాయి. ఇవి శరీరంలో అనేక విధులకు సహాయపడతాయి. ముఖ్యంగా చిరాగ్గా ఉన్న మూడ్ ను నార్మల్ గా చేసుకోవాలన్నా, హ్యాపీ హార్మోన్స్ ను యాక్టీవ్ చేయాలన్నా డార్క్ చాక్లెట్ సహాయపడుతుంది.

గుండె జబ్బుల ప్రమాదం..

డార్క్ చాక్లెట్‌లో ఉండే ఫ్లేవనాయిడ్‌లు హృదయనాళ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి.  రక్త ప్రవాహాన్ని మెరుగుపరచడం,  రక్తపోటును తగ్గించడం ద్వారా డార్క్ చాక్లెట్   గుండె ఆరోగ్యానికి సహకరిస్తుంది.  రోజులో కాసింత డార్క్ చాక్లెట్ తింటే హృదయనాళ వ్యవస్థ బలపడుతుంది.

మెదడు పనితీరు..

డార్క్ చాక్లెట్ లో కెఫిన్, ఇతర సమ్మేళనాలు అభిజ్ఞా పనితీరును మెరుగుపరుస్తాయి. మెదడుచురుగ్గా పనిచేయడంలోనూ,  జ్ఞాపకశక్తని పెంచడంలోనూ, ఏకాగ్రత పెరగడంలోనూ డార్క్ చాక్లెట్ చాలా బాగా సహాయపడుతుంది.

మానసిక స్థితికి..

డార్క్ చాక్లెట్‌లో ఉండే  సెరోటోనిన్  మానసిక స్థితిని మెరుగుపరచడానికి  సహాయపడుతుంది.  రోజూ ఓ ముక్క  డార్క్ చాక్లెట్ ను తినడం   వల్ల  సంతోషానికి కారణమయ్యే ఎండార్ఫిన్‌ల విడుదల బాగుంటుంది. ఇది  మానసిక స్థితిని సహజంగానే బాగుండేలా చేస్తుంది. సింపుల్ గా చెప్పాలంటే డార్క్ చాక్లెట్ మంచి మూడ్ బూస్టర్.

                                                *నిశ్శబ్ద.