ఆధునిక కాలంలో ఎలాంటి స్పష్టమైన కారణం లేకుండానే మనస్సులో ఆందోళన, భయం, ఒక రకమైన అశాంతి కలగడం చాలా మంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య.  బయటకు  పరిస్థితులన్నీ బాగున్నప్పటికీ, లోపల ఏదో తెలియని బెంగ మనశ్శాంతిని దూరం చేస్తుంది. దీనికి ఏదో పెద్ద సమస్యే కారణం కావాల్సిన అవసరం లేదు. మనకు తెలియకుండానే మనం పాటించే కొన్ని చిన్న చిన్న జీవనశైలి అలవాట్లే మన మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తూ, ఆందోళనను పెంచుతాయని నిపుణులు చెప్తున్నారు. అవేంటో వివరంగా తెలుసుకుంటే..

శారీరక శ్రమ లేకపోవడం..

శారీరక శ్రమ లేకపోవడం  మనసుపై తీవ్రమైన ప్రభావం చూపుతుంది. రోజంతా ఒకే చోట కూర్చుని ఉండటం వల్ల శరీరంలో రక్తప్రసరణ మందగించడమే కాకుండా, మనస్సుకు ఉపశమనం కలిగించే హార్మోన్ల విడుదల తగ్గుతుంది. క్రమం తప్పకుండా చిన్నపాటి వ్యాయామం లేదా నడక చేయడం వల్ల మెదడులో ఎండోర్ఫిన్లు విడుదలవుతాయి. ఇవి ఒత్తిడిని తగ్గించి మూడ్‌ను మెరుగుపరుస్తాయి. శారీరక చురుకుదనం తగ్గినప్పుడు మనస్సులో నెగిటివ్ ఆలోచనలు పెరిగి ఆందోళనకు దారితీస్తాయి.

సోషల్ మీడియా..

నేటి డిజిటల్ యుగంలో సోషల్ మీడియా వినియోగం శృతిమించడం మానసిక అశాంతికి మరో ముఖ్యమైన కారణం. ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు నిరంతరం ఫోన్ స్క్రీన్‌ను చూడటం, ఇతరుల జీవితాలతో మన జీవితాన్ని పోల్చుకోవడం వంటివి తెలియకుండానే ఒత్తిడిని పెంచుతాయి. డిజిటల్ స్క్రీన్ల నుంచి వచ్చే కాంతి నిద్ర లేమికి కారణమవుతుంది. సరిపడా నిద్ర లేకపోవడం వల్ల మెదడు అలసిపోయి, చిరాకు , భయాలు పెరిగే అవకాశం ఉంది.

చెడు అలవాట్లు..

మద్యపానం లేదా ఇతర వ్యసనాలు తాత్కాలికంగా ఉపశమనాన్ని ఇచ్చినట్లు అనిపించినప్పటికీ, ఎక్కువ  కాలంలో అవి మానసిక ఆరోగ్యాన్ని దారుణంగా దెబ్బతీస్తాయి. ఇవి నాడీ వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపి, ఆందోళన తీవ్రతను మరింత పెంచుతాయి. శరీరం ఈ పదార్థాలపై ఆధారపడటం మొదలైనప్పుడు  అశాంతి మరింత తీవ్రమవుతుంది.

గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు..

మానసిక ప్రశాంతతను కాపాడుకోవడానికి రోజూ కొంత సమయం వ్యాయామానికి కేటాయించడం, సోషల్ మీడియా వినియోగాన్ని తగ్గించి నచ్చిన పనులపై దృష్టి పెట్టడం, క్రమశిక్షణతో కూడిన ఆహారపు అలవాట్లు , మంచి నిద్రను అలవర్చుకోవడం ఎంతో అవసరం. జీవనశైలిలో చేసుకునే ఈ చిన్న మార్పులు మానసిక ఒత్తిడిని తగ్గించి జీవితంలో ప్రశాంతతను నింపుతాయి.

                                                                                                                                                 *రూపశ్రీ.