రోజుకొక యాపిల్ తింటే డాక్టర్ అవసరమే ఉండదన్నది చాలా పాపులర్ అయిన మాట. యాపిల్ లో ఉండే పోషకాలే దీనికి కారణం. అయితే ఈ మధ్య యాపిల్ సైడర్ వెనిగర్ కూడా బాగా పాపులర్ అయింది. దీన్ని తీసుకునే వారి సంఖ్య పెరుగుతోంది. ఎవరైనా కొత్తగా యాపిల్ సైడర్ వెనిగర్ వాడే ఆలోచనలో ఉన్నా, దీని గురించి పూర్తీగా తెలియకున్నా ... దీని గురించి తప్పక తెలుసుకుని వాడాలి. యాపిల్ సైడర్ వెనిగర్ వాడటానికి ముందు అందరూ తెలుసుకోవలసిన విషయాలేంటో.. దీన్ని వాడటం వల్ల ఏం జరుగుతుందో తెలుసుకుంటే..
మధుమేహ రోగులకు..
యాపిల్ సైడర్ వెనిగర్ రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. దీనివల్ల మధుమేహం నుంచి ఉపశమనం లభిస్తుంది. మధుమేహం ఉన్నవారు యాపిల్ సైడర్ వెనిగర్ ను వైద్యుల సలహా తీసుకుంటే రెగ్యులర్ గా వాడుతూ ఉంటే రక్తంలో చక్కెర స్థాయిలను సమర్థవంతంగా తగ్గించుకోవచ్చు.
బరువు..
యాపిల్ సైడర్ వెనిగర్ బరువు తగ్గాలని అనుకునేవారికి ఔషధం కంటే తక్కువ కాదు. దీన్ని రోజువారీ వాడుతుంటే ఆకలి నియంత్రణలో ఉంటుంది. ఇది అతిగా తినడాన్ని నిరోధిస్తుంది. ఎక్కువసేపు కడుపు నిండిన ఫీల్ ఇస్తుంది.
గుండె ఆరోగ్యం..
చెడు కొలెస్ట్రాల్ సమస్య అయినా, రక్తపోటును నియంత్రించడం అయినా.. ఆపిల్ సైడర్ వెనిగర్ సమర్థవంతంగా పనిచేస్తుంది. గుండెకు సంబంధించిన చాలా సమస్యలలో ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. ఇందులో ఉండే మూలకాలు గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
చర్మ ఆరోగ్యం..
యాపిల్ సైడర్ వెనిగర్ చర్మం pH స్థాయిని నిర్వహించడానికి ఉపయోగపడుతుంది. ఇది మాత్రమే కాకుండా చర్మం దురద, ఎరుపు, చర్మ అంటువ్యాధులు మొదలైన సమస్యలలో బ్యాక్టీరియాను చంపడంలో కూడా ఇది ఉపయోగకరంగా ఉంటుంది.
ఎలా తీసుకోవాలి..
యాపిల్ సైడర్ వెనిగర్ వినియోగించడానికి ఒక కరెక్ట్ కొలత వాడాలి. ప్రతిరోజూ ఇంతే మోతాదులో తీసుకోవాలి. 5-10 ml మోతాదుతో మాత్రమే ప్రారంభించాలి. ఒక గ్లాసు తీసుకుని అందులో 2 టీస్పూన్ల యాపిల్ సైడర్ వెనిగర్ వేయాలి. గ్లాసు నిండుగా నీరు తీసుకోవాలి. దీన్ని ఉదయాన్నే ఖాళీ కడుపుతో తాగాలి. దీన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల దంతాలు, చిగుళ్లకు సంబంధించిన సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి దీన్ని మొదలుపెట్టే ముందు వైద్యుడిని సంప్రదించడం మంచిది.
*రూపశ్రీ.