.webp)
మనం చేసే ప్రతి చిన్న పనీ మన భవిష్యత్తును నిర్ణయించినట్లే, మనం రోజూ ఆచరించే ప్రతీ అలవాటు మన ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. ఒక్కోసారి జబ్బుల కంటే మన చెడ్డ అలవాట్లే మనల్ని నెమ్మదిగా బలహీనపరుస్తాయి. ఆరోగ్యమే మహాభాగ్యమని పెద్దలు ఊరికే అనలేదు. ధనం పోతే మళ్లీ సంపాదించుకోవచ్చు కానీ ఆరోగ్యం కోల్పోతే అదే అసలైన దరిద్రం. శరీరాన్ని, మనసును ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మన పూర్వీకులు కొన్ని సులువైన జీవన సూత్రాలను చెప్పారు. వాటిని సరిగ్గా పాటిస్తే జీవితం ప్రశాంతంగా, ఆనందంగా మారుతుంది. ఆ ముఖ్యమైన ఐదు ఆరోగ్య సూత్రాలు ఏమిటో వివరంగా తెలుసుకుంటే..
సరైన ఆహార నియమం..
మన శరీరం జీర్ణవ్యవస్థపైనే మన ఆయుర్దాయం ఆధారపడి ఉంటుంది. కడుపులో ఉన్న ఆహారం పూర్తిగా జీర్ణం కాకముందే మళ్లీ మళ్లీ తినడం విషం తినడంతో సమానమని పెద్దలు చెబుతారు. ఆకలి లేకపోయినా కేవలం సమయం అయిపోయిందన్న ఒకే ఒక్క కారణంతో బలవంతంగా తినడం మనం చేసే అతి పెద్ద తప్పు. శరీరం చెప్పే ఆకలి సంకేతాలను వినడం నేర్చుకోవాలి కానీ గడియారపు ముళ్లను చూస్తూ తినకూడదు. ఆకలి ఉంటేనే, శరీరం కోరితేనే మితంగా, రుచిగా కాక ఆరోగ్యాన్నిచ్చే ఆహారాన్ని తీసుకోవాలి.
నిద్ర..
ఈ కాలంలో చాలామంది రాత్రంతా మేలుకోవడం, తెల్లవారితే అతిగా నిద్రపోవడం అలవాటు చేసుకున్నారు. అయితే అతిగా నిద్రపోవడం లేదా అసలు నిద్రపోకపోవడం రెండు పద్ధతులూ శరీర నాశనానికి దారితీస్తాయి. తెల్లవారుజామునే నిద్రలేవడం వల్ల మనసు ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటుంది, బద్ధకం దరిచేరదు. సూర్యుడితో పాటు నిద్రలేచి ప్రకృతితో మమేకమైతే రోజంతా ఉత్సాహంగా ఉండవచ్చు. క్రమబద్ధమైన నిద్ర శారీరక శక్తిని పునరుద్ధరిస్తుంది.

శారీరక శ్రమ..
నేటి ఆధునిక కాలంలో టెక్నాలజీ పెరిగిన తర్వాత శారీరక కదలికలు పూర్తిగా తగ్గిపోయాయి. శరీరాన్ని కదిలించకుండా కేవలం ఒకే చోట కూర్చుని పనిచేయడం అనారోగ్యాన్ని కొనితెచ్చుకోవడమే అవుతుంది. వ్యాయామం, యోగ, చిన్నపాటి నడక, ఇంటి పనులు వంటి సహజ కదలికలు శరీరాన్ని దృఢంగా ఉంచుతాయి. జిమ్‌లకు వెళ్లి విపరీతంగా కష్టపడాల్సిన అవసరం లేదు కానీ రోజూ శరీరానికి తగిన శ్రమ ఇచ్చేలా చూసుకోవడం చాలా అవసరం.
ఇది కూడా చదవండి వాకింగ్ ఎలా చేయాలి? చాలామందికి తెలియని సీక్రెట్ ఇదే..!
మానసిక ప్రశాంతత..
శారీరక ఆరోగ్యం ఎంత ముఖ్యమో మానసిక ఆరోగ్యం కూడా అంతే ముఖ్యం. అతిగా కోపగించుకోవడం వల్ల శరీరంలోని ప్రాణశక్తి లోపలి నుంచే క్షీణించిపోతుంది. కోపం మన ఆరోగ్యాన్ని నాశనం చేసే అతిపెద్ద శత్రువు. మనసుపై నిగ్రహం లేకపోతే ఏ పనీ సరిగ్గా చేయలేము. డబ్బు కంటే మనసు నిండుగా, సంతోషంగా ఉండటమే అసలైన ఐశ్వర్యం. యోగ, ధ్యానం ద్వారా మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నించాలి.
శుచి , పరిశుభ్రత..
కేవలం మన ఇల్లు మాత్రమే కాకుండా మన శరీరం, పరిసరాలు కూడా శుభ్రంగా ఉంచుకోవడం ఆరోగ్యానికి మూలస్తంభం. శరీరం, చుట్టూ ఉన్న పరిసరాలు శుభ్రంగా ఉండటం మనలో ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మగౌరవాన్ని పెంచుతుంది. అలాగే మన ఆలోచనలు, మాటలు కూడా స్వచ్ఛంగా ఉండాలి.
ఈ ఐదు సూత్రాలు ఏవీ కొత్తవి కావు, మన దైనందిన జీవితంలో ఎంతో సులభంగా పాటించదగినవే. వీటిని రోజువారీ జీవితంలో అలవాటు చేసుకుంటే ఏ అనారోగ్య సమస్యలూ దరిచేరవు. జీవనశైలిలో చిన్న మార్పుతోనే పెద్ద మార్పును సాధించవచ్చు. ఆరోగ్యకరమైన జీవితాన్ని సొంతం చేసుకొని ఆనందంగా జీవించవచ్చు.
*రూపశ్రీ.
మీకు నచ్చవచ్చు జీర్ణక్రియ నుంచి రోగనిరోధక శక్తి వరకు.. ఈ 5 పండ్లతో ఎన్నో లాభాలు!




