అంటువ్యాధులు ఎప్పుడూ ప్రాణ నష్టాన్ని అధికంగా కలిగిస్తాయి. ప్రస్తుతం భారతదేశంలో కేరళ రాష్ట్రంలో నిఫా వైరస్ విజృంభిస్తోంది.  విషాదకర విషయం ఏమిటంటే కరోనాతో పోలిస్తే నిఫా వైరస్ తీవ్రమైన ఇన్ఫెక్షన్ కు దారితీస్తుంది.  ప్రమాదాలను కూడా అదే స్థాయిలో పెంచుతుంది. ఇది కేవలం కేరళ రాష్ట్రంలోనే విజృంబిస్తున్నా పలు నగరాలలో ఈ వైరస్ వ్యాప్తి గురించి హెచ్చరికలు జారీ చేశారు. ఇది అంటువ్యాధి కావడంతో    దేశం మొత్తం మీద ఈ వైరస్ కారణంగా ప్రజలు ప్రభావితం అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి.  ఈ వైరస్ లక్షణాలు, నివారణ చర్యల గురించి తెలుసుకుని జాగ్రత్త పడటం చాలా ముఖ్యం.

నిఫా వైరస్ లక్షణాలు..

నిఫా వైరస్ విషయంలో దేశం మొత్తం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతో ఉంది. ఈ వైరస్ సోకిన వారిలో  ఫ్లూ లక్షణాలు ఉంటాయి. ఇది ముఖ్యంగా ఊపిరితిత్తులు, మెదడుపై దాడి చేస్తుంది. దగ్గు, గొంతునొప్పి, శ్వాస చాలా వేగంగా తీసుకోవడం, జ్వరం ఉంటాయి.  వికారం, వాంతులు వంటి జీర్ణాశయ సమస్యలు కూడా  ఉంటాయి. ఈ వ్యాధి తీవ్రరూపం దాలిస్తే అది మెదడువాపు వ్యాధికి దారి తీయవచ్చు. ఈ సందర్భంలో కోమా లేదా మరణం సంభవించే అవకాశం ఉంటుంది.

నిఫా వైరస్ ద్వారా ప్రమాదం పిల్లల నుండి వృద్దుల వరకు ఎవరికైనా పొంచి ఉంది. వ్యాధి సోకినవారి నుండి లేదా జంతువుల నుండి ఈ వైరస్ సోకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు.  రోగనిరోధక శక్తి బలహీనంగా ఉన్నవారిలో నిఫా వైరస్ చాలా ప్రభావం చూపిస్తుంది. సాధారణ  వ్యక్తుల కంటే రోగనిరోధక శక్తి తక్కువ ఉన్నవారికి ప్రాణాపాయం పొంచి ఉంది.  వీరు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.

సంరక్షణా చర్యలు..

నిఫా వైరస్ విషయంలో అందరినీ ఆందోళన పరుస్తున్న విషయం ఏమిటంటే ఈ ఇన్ఫెక్షన్ ను నివారించడానికి  ఎలాంటి టీకా అందుబాటులో లేదు. వైరస్ సోకిన తరువాత వ్యక్తులకు చికిత్స చేయడానికి నిర్థిష్ట ఔషదం కూడా లేదు. అందుకే నిపుణులు ప్రజలను సురక్షితంగా ఉండాల్సిందిగా సూచిస్తున్నారు. నివారణ చర్యలను పాటించడం, చేతుల పరిశుభ్రత, వీధులలో విహరించే జంతువులకు దూరంగా ఉండటం,  బయటి ఆహారాలను అవాయిడ్ చేయడం. ఆరోగ్యకరమైన, రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాలు తీసుకోవడం వంటివి పాటించాలి.  ఇక ఈ వైరస్ ఉన్న ప్రాంతాలలో నివసించే వారు మరింత జాగ్రత్త తీసుకోవాలి.

                                                 *నిశ్శబ్ద.