అడవి గాలి అన్న మాట మనకి కొత్తేమీ కాదు. కానీ ఆ గాలికి దూరం కావడమే ఓ చిత్రం. మనిషి నాగరికతకి నిదానంగా అలవాటుపడుతున్న కొద్దీ, ప్రకృతికి వీలైనంత దూరంగా జరుగుతున్నాడనడంలో అతిశయోక్తి ఏదీ లేదు. కానీ అలా నాగరిక ప్రపంచంలో మునిగిపోయిన ఉన్న మనిషి ప్రశాంతంగా ఉన్నాడా అంటే అదీ లేదు. ఒత్తిడి- ఒత్తిడి నుంచి రక్తపోటు- రక్తపోటు నుంచి గుండెజబ్బులు... ఇలా నానారకాల వ్యాధులూ అతన్ని నిర్వీర్యం చేస్తున్నాయి. ఆ మధ్య ఎప్పుడో అమెరికాలో నిర్వహించిన ఒక పరిశోధన ప్రకారం ఆ దేశంలోని జనం 87 శాతం సమయాన్ని నాలుగ్గోడల మధ్యే గడిపేస్తున్నారట. ఇలా నాలుగ్గోడల మధ్య నలిగిపోతున్న మనుషుల కోసం ఇప్పుడు ఓ కొత్త చికిత్సా విధానం ప్రచారంలోకి వస్తోంది. అదే Shinrin-yoku... అంటే జపాను భాషలో అడవీ స్నానం (ఫారెస్ట్ బాతింగ్) అన్నమాట!
Shinrin- Yoku ఎక్కడో ప్రాచీన కాలం నాటి పదం కాదు. అసలు అప్పట్లో ఇలాంటి అవసరమే లేదు కదా! 1980ల్లో జపాను అటవీ శాఖ మొదలుపెట్టిన కార్యక్రమం ఇది. ఇదే క్రమంగా ఇప్పుడు ప్రపంచమంతటా విస్తరిస్తోంది. ఇలా అడవీ స్నానం చేయాలనుకునే వ్యక్తులను, అందులో నిష్ణాతులైనవారు అడవుల్లోకి తీసుకువెళతారు. కేవలం అడవుల్లోకి అలా నడుస్తూ వెళ్లడమే కాదు... తమ చుట్టుపక్కల ఉన్న ప్రకృతిని ఆస్వాదిస్తూ, చెట్టూచేమల్ని గమనిస్తూ సాగాలి. నిదానంగా ఊపిరిని పీల్చుకుంటూ, అడవిలో లీనమవుతూ నడవాలి. ఇలా ప్రయాణం సాగిస్తున్నప్పుడు తాము కూడా ఈ అనంతమైన ప్రకృతిలో భాగమే కదా అనిపిస్తుంది మనిషికి. ప్రకృతిలో ఉన్న జీవమే తనలోనూ తొణికిసలాడుతున్నట్లు తోస్తుంది. ఒత్తిడి స్థానంలో ప్రశాంతత చోటు చేసుకుంటుంది.
Shinrin- Yoku వల్ల ఒత్తిడి మాయమైపోతుందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దీనికి తోడు మెదడు చురుగ్గా పనిచేయడం మొదలుపెడుతుందని తేలింది. ఒత్తిడిని కలిగించే కార్టిజాల్, అడ్రినలిన్ వంటి హార్మోలన్ల ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోవడాన్ని కూడా గమనించారు. ఇక అడవిలో Shinrin- Yoku తరహా చికిత్సను తీసుకున్నవారిలో రోగనిరోధక శక్తి కూడా పెరిగినట్లు తేలింది. అందుకని ఇప్పుడు కొరియా మొదలుకొని ఆస్ట్రేలియా వరకూ దేశదేశాలన్నింటిలోనూ Shinrin- Yoku శిబిరాలు వెలుస్తున్నాయి. కానీ మనకు ఇలాంటి చికిత్స గురించి తెలియకుండానే మనం దానిని పాటించేస్తూ ఉన్నాము. ఏ తిరుపతికో, మేడారానికో, శ్రీశైలానికో... వెళ్తే Shinrin- Yoku శిబిరంలో పాల్గొన్నట్లే కదా! అక్కడ ఉండే అడవులూ, జలపాతాలూ, కొండకోనలూ అన్నీ మనలోని ప్రకృతిని తట్టిలేపేవేనయ్యే! కాకపోతే ఈసారి కాస్త మనసు పెట్టి వాటిలో లీనమైతే సరి... మనం కూడా అడవీ స్నానాన్ని ఆచరించినట్లే!
- నిర్జర.