Previous Page Next Page 
రాగోదయం పేజి 7


    " ఎక్కడిది మామా? పొద్దున బుర్ర గొరిగించుకుందామంటే పావల డబ్బులు కనిపించలా? పోనీ బ్లేడు తెప్పిద్దామంటే చిల్లరాలేదు. కోమటి శ్రీనివాసుల అంగడికి పంపితే బ్లేడ్లు లేవన్నాడట - అరువు బేరమని."
    మండిపోయింది శేషయ్య కి ఆ సమాధానం వినగానే "బీరువా తెరవకూడదూ?" అన్నాడు కసిగా.
    ముక్కుమీద వేలేసుకుంటూ "అమ్మమ్మ, ఈ రోజు లక్ష్మీవారం. అమ్మవారి పూజకి జమచెయ్యాలే కానీ ఖర్చు చెయ్యకూడదు. అందునా కల్యాణానికి బీరువా తీయటమా?" అన్నాడు చౌదరి.
    ఆ సమాధానంతో శేషయ్యకేం పాలుపోలేదు. అంతలో అచ్చమాంబ అటుగా వచ్చి "బావున్నావా బాబాయ్" అంటూ పలకరించింది. ఓ నిమిషం ఆగి "వస్తా మరి ఏమయినా కూరగాయలున్నాయా తల్లి" అన్నాడు శేషయ్య ఆమె సమాధానం యివ్వకుండా లోపలికి వెళ్ళి కూరగాయలు బుట్టనిండా తెచ్చింది. అవి శేషయ్య కుటుంబానికి వారం రోజుల దాకా వస్తాయి. వాటిని చూడగానే అతని ముఖం వికసించింది. బుట్ట అందుకుని "వస్తా" అంటూ వెళ్ళాడు.
    "వారం రోజులు పప్పు వండనీయడు"
    "పోన్లెండి పెద్ద సంసారం-ఖర్చెక్కువ" అంది అచ్చమాంబ.
    "ఎవరికి ఖర్చు? అతని సంసారం పెరిగే కొద్దీ వూరివాళ్ళకి తగులుకుంటుంది ఖర్చు అంతే."
    "పోన్లెండి! ఎవరు మాత్రం ఊరికే యిస్తారు? ఆయన్నుంచి ఏది సహాయం ఆశించే యిస్తారు."
    "ఊఁ ఇప్పుడు మళ్ళీ నీళ్ళోసుకుందట ఆమె"
    అచ్చమాంబ ఆశ్చర్యంగా చూసింది.
    "అవును మూడోనెల ఛీ! ఛీ!"
    "ఊరుకోండి మనకెలాగూ ఆ అదృష్టం లేదు, ఇతర్ల కడుపు పచ్చగా ఫలిస్తూ వుంటే చూసి సంతోషిద్దాం. వచ్చే జన్మకయినా దేవుడు దయచూస్తాడేమో"
    చౌదరి మాటాళ్ళేదు.
        
                                    *     *    *
    
    నేరుగా యింటికి వెళ్ళి భార్యని కేకేశాడు శేషయ్య. లోపలెక్కడో పని చూసుకుంటోన్న ఆయన భార్య శంకరమ్మ బయటికి వచ్చింది. ఆమెకిప్పుడు మూడోనెల. కొత్తగా పెళ్ళయి అత్తారింటికి వెళ్ళొచ్చిన మూడోకూతురికీ మూడోనెల. అది తెలిసినప్పటినుంచీ ఆమెకి సిగ్గుగా వుంది.
    కరణంగారికి నలుగురు ఆడబిడ్డలు, ముగ్గురు కొడుకులు ఇప్పుడు మళ్ళీ గర్భవతి.
    ఆమె బయటికి రాగానే "ఇదిగో కూరగాయల బుట్ట. బెండకాయలు, మిర్చి, దొండకాయలు, బీరకాయలు, అనాపకాయ, బుడమకాయలు అన్నీ వున్నాయి. అయిదారు రోజుల దాకా మళ్ళీ కూరగాయల పేరెత్తద్దు" అన్నాడు.
    "ఎవరిచ్చారు?"
    "అచ్చమాంబ, చౌదరి పెళ్ళాం."
    "ఊఁ" గంపలో అన్నీ సర్దేసి బుట్ట చౌదరి యింట్లో యిమ్మని ఆఖరి కొడుకు శీను చేతికిచ్చి లోపలికి వెళ్ళబోయేదల్లా ఆగి "ఇదిగో రెండు రూపాయలు యిచ్చి వెళ్ళాడు జానయ్య" అంది ఆమె.
    ఆ నోటుని చూడగానే కప్పని చూసిన పాము కళ్ళు మెరిసినట్టు కోడిపిల్లని చూడగానే గద్ద కళ్ళు మెరిసినట్టు అతని కళ్ళు మెరిశాయి. చప్పున లాక్కున్నంత పని చేసి "వుండనీ అమ్మణ్ణికి శుక్రవారం పూట పూజకి ఏం రాలేదే అని బాధ పడుతూంటిని. ఆ తల్లి దయతలిస్తే ఎక్కడినుంచయినా పరిగెత్తుకు వస్తుంది పైకం" అన్నాడు ఆనందంగా.
    ఆమె మరేమీ అనకుండా లోపలికి వెళ్ళిపోయింది.
    శేషయ్య తన గదిలోకి వెళ్ళి తన రికార్డునంతా ఓసారి పరిశీలనగా చూసుకుని కొడుకు లెవరూ దాన్ని పాడు చెయ్యలేదని నిర్ధారణ చేసుకుని ఆ గదినుంచి మరో గదిలోకి వెళ్ళాడు.
    ఆ గది ఆయన పడకగది. అందులోనే కరిణీకానికి సంబంధించిన అతి ముఖ్యమైన రికార్డు వుంటుంది. అందులోనే బీరువా కూడా వుంది. అది ఆయన ముత్తాతగారు సంపాదించింది.


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS