మగవారి చేతికి కడియం ఎందుకు!

 


ఆడవారు చేతులకు గాజులు ఎందుకు వేసుకుంటారో చాలాచోట్ల చదివే ఉంటాము. మరి మగవారు కూడా చేతికి కడియాలు ధరించే ఆచారం ఉంది కదా! కాస్త పరిశీలించి చూస్తే దీని వెనుక కూడా చాలా కారణాలే కనిపిస్తాయి...

 

ధర్మాన్ని గుర్తుచేస్తూ- సిక్కు మతంలో ‘ఖల్సా’ సంప్రదాయాన్ని అనుసరించేవారంతా తప్పకుండా కడియాన్ని ధరించితీరాలి. ఈ కడియం, వారు తమ గురువుల పట్ల విధేయులై ఉన్నారని నిరంతరం గుర్తచేస్తూ ఉంటుందట. పైగా తమ చేతులతో దానధర్మాలను చేయాలనీ, ఇతరుల పట్ల స్నేహంతో మెలగాలనీ, ఆ కడియ ధారణ సూచిస్తుందట. అంటే గురువుగారి విధేయతనూ, సత్ప్రవర్తన పట్ల ఎరుకను ఈ కడియం సూచిస్తుందన్నమాట.

 

మణికట్టుకి కవచం- శారీరిక శ్రమతో కూడిన పని చేసేటప్పుడు ఒకోసారి మణికట్టు తెగే ప్రమాదం ఉంటుంది. మణికట్టు తెగితే రక్తం ధారకట్టి... ఒకోసారి మరణానికి కూడా దారితీస్తుంది. అలాంటి ప్రమాదం నుంచి చేతి కడియం రక్షగా ఉంటుంది. పదునై వస్తువు మీదకు వచ్చినప్పుడు అది కడియానికి తగిలి ఆగిపోయే అవకాశమే ఎక్కువ!

 

ఆరోగ్యానికి రక్ష- ఒకో లోహంతో చేసిన కడియం ఒకో తీరున శరీరాన్ని ప్రభావితం చేస్తుందని పెద్దల నమ్మకం. ఉదాహరణకు రాగితో చేసిన కడియం శరీరంలోని అధిక వేడిని తగ్గిస్తే, వెండితో చేసిన కడియం శరీరంలోని విద్యుత్‌తరంగాలను ప్రభావితం చేస్తుంది.

 

జాతకరీత్యా- జాతకాలను నమ్మేవారు, వివిధ గ్రహసంబంధమైన దోషాలను కడియాలను ధరించడాన్ని కూడా ఒక ఉపశమనంగా భావిస్తారు. సుప్రసిద్ధ గ్రంధం ‘ఒక యోగి ఆత్మకథ’లో సైతం ఇలాంటి ప్రస్తావన ఒకటి కనిపిస్తుంది. ‘‘విద్యుత్‌, అయస్కాంత వికిరణాలు ఈ విశ్వంలో అవిచ్ఛిన్నంగా ప్రసరిస్తూ ఉన్నాయి; మనిషి శరీరానికి అవి మంచీ చెయ్యవచ్చు, చెరుపూ చెయ్యవచ్చు. అనేక యుగాల కిందట మన రుషులు, సూక్ష్మమైన విశ్వకిరణ ప్రభావాల దుష్ఫలితాల్ని పోగొట్టే సమస్యను గురించి ఆలోచన చేశారు. స్వచ్ఛమైన లోహాలు గ్రహాల ప్రతికూలాకర్షణలకు శక్తిమతమైన ప్రతిక్రియ చేసే సూక్ష్మకాంతిని విడుదల చేస్తాయని కనిపెట్టారు’’ అని అంటారు పరమహంస యోగానంద గురువుగారైన యుక్తేశ్వర్‌గారు. అంతేకాదు! యోగానందను కొన్ని జాతక సమస్యల నుంచి తప్పించేందుకు, ఒక నిర్దిష్టమైన కడియాన్ని ధరించమని కూడా సూచిస్తారు.

 

ఆత్మరక్షణ కోసం- అవసరమైనప్పుడు శత్రువు మీద కడియంతో ముష్టిఘాతాలు చేసిన సందర్భాలూ చరిత్రలో బోలెడు ఉన్నాయి. ఇందాక చెప్పుకున్నట్లుగా సిక్కు ఖల్సా వీరులు తాము ధరించే కడియాలను, ఆత్మరక్షణ కోసం కూడా వాడుకునేవారట.గౌరవానికి సూచన- పూర్వం పండితులు లేదా బాగా పలుకుబడి ఉన్నవారు... తమ ప్రతిభకు లేక పేరుకు చిహ్నంగా బంగారు కడియాలను ధరించేవారు. అలా బంగారు కడియం ఎప్పటినుంచో ఒక ‘స్టేటస్‌ సింబల్‌’గా నిలుస్తోంది.

 

శరీరాన్ని పట్టి ఉంచే సాధనం- ధ్యానంలో ఉన్నత స్థితులను చేరుకున్న కొందరు శిష్యులను ఇంకా ఇహలోక సంబంధమైన విషయాలకు పట్టి ఉంచేందుకు రాగితో చేసిన ఉంగరం లేదా కడియాలను వారి చేతులకు ధరింపచేస్తూ ఉంటారు. ఇప్పటికీ జగ్గీ వాసుదేవ్‌ వంటి గురువులు ఈ పద్ధతిని పాటించడం గమనించవచ్చు.అన్నింటికీ మించి, చాలా తక్కువ ఆభరణాలను ధరించే ఆస్కారం ఉన్న మగవారికి కడియం చక్కటి ‘హస్తభూషణం’గా నిలుస్తుంది. ఎంతటి నాస్తికుడికైనా చేతి కడియం ఒక అందం!

 

- నిర్జర


More Enduku-Emiti