హనుమంతుడికి తమలపాకుల మాల లేదా తమలపాకుల పూజ అంటే ఎందుకంత ప్రీతి!

భారతీయులు  హనుమంతుడిని సూపర్ హీరోలా ఆరాధిస్తారు.  చిన్న పిల్లల నుండి పెద్దవారి వరకు అందరూ హనుమంతుడు అంచే భయం, భక్తితో ఆరాధిస్తారు. అయితే ఒక్కొక్క దేవుడికి ఒక్కో రకం పువ్వు లేదా చెట్టు దళాలు అంటే ఇష్టం ఉంటుంది.  పరమేశ్వరుడికి బిల్వ పత్రం,  మహావిష్ణువుకు తులసి ఎలా ఇష్టమూ.. హనుమంతుల వారికి తమలపాకు అంటే అంతే ప్రీతి.  హనుమంతుని ఆరాధనలో ప్రతి దాని వెనుక ఒక కథనం ఉంటుంది. అలాగే.. తమలపాకు మాల లేదా తమలపాకు పూజ అంటే హనుమంతుడికి ఎందుకంత ప్రీతి అనే విషయం వెనుక కూడా కథనం ఉంది. అలాగే హనుమంతుడు తమలపాకు పూజతో చాలా తొందరగా తృప్తి పడతాడట.  ఆ విషయాలు ఏమిటో తెలుసుకుంటే..

రామాయణం ప్రకారం హనుమంతుడు లంకకు శ్రీరాముని సందేశాన్ని సీతా దేవికి తెలియజేయడానికి చేరుకున్నాడు.. హనుమ సీతాదేవికి రాముడి గురించి విషయాలన్నీ చెప్పి,  తొందరలోనే శ్రీరాముడు కపిసైన్యంతో లంకకు వస్తాడని చెబుతాడు.  ఆ మాటలు వినగానే సీతమ్మ తల్లి ఎంతో సంతోషించింది. వెంటనే హనుమకు ఇవ్వడానికి పుష్పాల కోసం వెతికింది. కానీ దగ్గరలో పుష్పాలు ఏవీ లేకపోవడంతో.. కంచెకు అల్లుకుని ఉన్న తమలపాకులను కోసి వాటితో మాల అల్లి హనుమంతుడికి ఇచ్చింది.  హనుమకు  కృతజ్ఞత చెప్పడానికి వేరే ఏమీ దొరకకపోవడంతో సీతమ్మ తమలపాకుల మాల వేసింది. సాక్షాత్తూ సీతమ్మ తల్లే తనకు తమలపాకుల మాల వేయడంతో హనుమ కళ్లు చెమర్చాయి.  అప్పటి నుండి హనుమకు తమలపాకుల మాల అంటే ప్రీతి కలిగిందని చెబుతారు.

హనుమకు 21 లేదా 31, లేదా 51 తమలపాకులను మాలగా చేసి వేయవచ్చు.

హనుమంతుడికి తమలపాకులు లేదా తమలపాకుల దండను సమర్పిస్తే హనుమంతుడు చాలా  సంతోషిస్తాడట.  ఎందుకంటే తమలపాకుల మాల హనుమకు  సీతమ్మను గుర్తు చేస్తుందట.  హనుమంతుడు రాముని భక్తుడు మాత్రమే కాదు, సీతా మాతకు విధేయుడు.

సీతారాములు హనుమను తమ పుత్రుడిలా భావిస్తారు.  హనుమ కూడా సీతారాములను తమ తండ్రి, తల్లి లాగా భావిస్తారు.

తమలపాకుల మాల లేదా తమలపాకుల పూజ చేస్తే కలిగే ప్రయోజనాలు..

హనుమంతుడికి తమలపాకుల మాల సమర్పిస్తే.. రోగాలతో ఇబ్బందులు పడేవారికి త్వరగా గుణం కనిపిస్తుందట.  అలాగే మంత్ర సంబంధ సమస్యలతో ఇబ్బంది పడేవారు,  మంత్రాలతో ఎవరైనా కట్టడి చేసి ఉంటే.. అలాంటి వారు హనుమకు తమలపాకుల మాల వేయడం వల్ల పీడలు తొలగుతాయి.

సంసారంలో ప్రశాంతత లోపించిన వారు, బార్యాభర్తల బంధంలో సమస్యలు ఎదుర్కుంటున్నవారు తమలపాకుల హారాన్ని వేయిస్తే సంసారంలో సుఖం లభిస్తుంది.  భార్యాభర్తల మధ్య సమస్యలు తొలగిపోతాయి.

చిన్న పిల్లలు ఆరోగ్యంగా, బలంగా ఉండాలంటే మంగళవారం లేదా శనివారం తమలపాకుల మాలను సమర్పించాలి.  ఇది వారిలో బలాన్ని, దైర్యాన్ని, ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

అందరూ లోకువగా చూసే వ్యక్తి,  నలుగురిలో గౌరవం పొందలేని వ్యక్తి హనుమకు తమలపాకుల మాల సమర్పించి భక్తిపూర్వకంగా ఆరాధిస్తే అతనికి గౌరవం లబించే స్థాయికి ఎదుగుతాడట.

శనిదేవుడి దృష్టి, శని గ్రహ భాధలతో ఇబ్బంది పడేవారు హనుమకు శనివారం రోజు తమలపాకుల మాల వేస్తే శని గ్రహ దోషాలు తొలగి సమస్యలు తగ్గుతాయట.

సుందర కాండ లేదా హనుమాన్ చాలీసా పఠించి తమలపాకుల మాలను హనుమంతుడికి సమర్పిస్తే అనుకున్న పనులలో విజయం,  హనుమ అనుగ్రహం లభిస్తాయని చెబుతారు.

                                 *రూపశ్రీ.


More Hanuman