హనుమాన్ చాలీసాలో ఈ శ్లోకాలు.. మానసిక ఒత్తిడిని, భయాన్ని తొలగిస్తాయి!

హిందూ మతంలో సప్త చిరంజీవులకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఎన్ని యుగాలు గడిచినా చిరంజీవులు అన్ని యుగాలలో ఉనికిలో ఉంటారని, భక్తులను రక్షిస్తుంటారని చెబుతారు. అయితే.. చిరంజీవులలో హనుమంతుడు లేదా ఆంజనేయస్వామికి ఉన్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు.. మరీ ముఖ్యంగా హనుమంతుడికి సంబంధించిన శ్లోకాలు, స్తోత్రాలలో హనుమాన్ చాలీసా చాలా విశిష్టమైనది. చాలీసా అంటేనే 40 అని అర్థం. 40 దోహాలలో వర్ణించబడిన హనుమాన్ చాలీసా చాలా శక్తివంతమైనది. భారతదేశంలో చిన్న పిల్లల నుండి వృద్దుల వరకు అందరికీ ఎంతో ఆరాధ్య దైవం అయిన హనుమంతుడిని హనుమాన్ చాలీసా ద్వారా ఆరాధించడం వల్ల హనుమంతుడి అనుగ్రహం కలుగుతుంది. హనుమాన్ చాలీసాలో ఉండే 40 దోహాలలో కొన్ని శ్లోకాలు మానసిక ఒత్తిడిని, భయాన్ని తొలగిస్తాయి. ఆ శ్లోకాలు ఏమిటో తెలుసుకుంటే..
భూత పిశాచ నికట నహీ ఆవై
మహా వీర జబనామ సునావై||
హనుమాన్ చాలీసాలోని పై శ్లోకం ప్రతికూల ఆలోచనలను తొలగిస్తుందని నమ్ముతారు. సాధారణంగా భూత పిశాచాలు అనేవి నెగిటివ్ ఎనర్జీకి మూలం. హనుమాన్ చాలీసా మొత్తం చదవకపోయినా పైన చెప్పుకున్న దోహాను ప్రతి రోజూ కనీసం 108 సార్లు జపం చేస్తే భయాన్ని తగ్గించి, గాలి సోకడం, నెగిటివ్ ఎనర్జీ వంటివి నశించి, మనసులో ధైర్యాన్ని నింపుతుంది. అలాగే మానసిక బలం వస్తుంది.
నాశై రోగ హరై సబ పీరా
జపత నిరంతర హనుమత వీరా ||
మానసిక, శారీరక ఆరోగ్యం బలహీనంగా ఉన్నవారు పైన చెప్పుకున్న దోహాను ప్రతి రోజూ 108 సార్లు పఠించడం వల్ల మానసిక ఆరోగ్యం, శారీరక ఆరోగ్యం బలంగా మారతాయట. క్రమం తప్పకుండా ఈ దోహాను ప్రతిరోజూ 108 సార్లు జపిస్తూ ఉంటే ఒత్తిడి తగ్గి మనసు ప్రశాంతం అవుతుందట. ఇది సానుకూల శక్తిని కూడా పెంచుతుంది.
సంకటసే హనుమాన చుఢావై
మన క్రమ వచన ద్యాన జో లావై||
ఆత్మవిశ్వాసాన్ని పెంచడంలో ఈ దోహా సహాయపడుతుంది. మనిషి కష్టసమయాల్లో ఉన్నప్పుడు మనిషి మానసిక స్థితి బలహీనం అవుతుంది. అందుకే అలాంటి సమయంలో మనిషికి మానసిక మద్దతు చాలా అవసరం. హనుమంతుడిని పైన చెప్పుకున్న దోహతో ధ్యానించడం వల్ల కష్టమైన పరిస్థితులను ఎదుర్కునే ధైర్యం పెరుగుతుంది.
సబ సుఖ లహై తుమ్హారీ శరణా
తుమ రక్షక కాహూకో డరనా||
పైన చెప్పుకున్న దోహ మనిషికి, మనసుకు భద్రతా భావాన్ని, నమ్మకాన్ని కలిగిస్తుంది. పైన చెప్పుకున్న దోహాను పఠించడం వల్ల ఒంటరితనం తగ్గి సానుకూల ఆలోచనా విధానం పెంపొందుతుంది.
మరికొన్ని ప్రయోజనాలు..
పైన చెప్పుకున్న దోహాలు వాటిలో పేర్కొన్నట్టు కొన్ని సమస్యలకు చాలా ప్రభావవతంగా పనిచేస్తాయి. అంతేకాదు.. దోహాలు మాత్రమే కాకుండా ప్రతిరోజూ కనీసం ఒక్కసారి అయినా హనుమాన్ చాలీసాను పఠించడం వల్ల మనసులో భయం తగ్గుతుంది. ధైర్యం పెరుగుతుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. నెగిటివ్ ఆలోచనలు కూడా తగ్గుతాయి. హనుమాన్ చాలీసా పఠించడం వల్ల మనసు స్థిరంగా మారుతుంది. ఒంటరితనం, మానసిక అశాంతి వంటివి తొలగుతాయి. జీవితంలో ఏ సమస్య ఎదురైనా సరే.. వాటిని ఎదుర్కునే శక్తి లభిస్తుంది.
*రూపశ్రీ.


