ఈ  తప్పులు చేస్తే వినాయక చవితి చేసినా ఫలితం ఉండదు..!

విఘ్నాలను తొలగించే వినాయకుడు భారతదేశం అంతటా పూజలు అందుకుంటాడు.  ఏ కార్యం మొదలుపెట్టినా సరే.. తొలి పూజ అందుకునేది వినాయకుడే.. వినాయకుడిని పూజించకుండా చేసే ఏ పూజ అయినా అసంపూర్ణం  అని చెప్పవచ్చు.  అలాగే.. వినాయకుడిని మొదట ఆరాధించకుండా చేసే పూజకు అసలు ఫలితం కూడా ఉండదు.  అలాంటి వినాయకుడిని ముఖ్యంగా పూజించేదే వినాయక చవితి.  భాద్రపద మాస శుక్లపక్ష చవితి వినాయక చవితి పూజకు ముఖ్యమైన తిథి. భారతదేశంలో చాలా చోట్ల వినాయకుడిని 9రోజులు పూజిస్తారు. గణేషుడి నవరాత్రులు జరుపుకుంటారు. వినాయక చవితి పండుగ ఆగష్టు 27న ప్రారంభమై.. సెప్టెంబర్ 6వ తేదీన ముగుస్తుంది. ప్రతి ఇంట్లో వినాయక విగ్రహాలు ప్రతిష్టించడం,  వ్రతం చేసుకోవడం చూడవచ్చు.  అయితే వినాయక చవితి చేసుకునే నేపథ్యంలో కొన్ని తప్పులు చేస్తే  వినాయక చవితి  చేసుకున్న ఫలితం దక్కదు.  ఆ తప్పులేంటో తెలుసుకుంటే..

దిశ..

వినాయక  విగ్రహాన్ని ప్రతిష్టించేటప్పుడు ముఖం ఎల్లప్పుడూ ఈశాన్య లేదా ఉత్తర దిశ వైపు ఉండాలి. ఈ దిశ అత్యంత శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఎందుకంటే ఇది ఇంట్లో సానుకూల శక్తి ప్రవాహాన్ని పెంచుతుంది.  ప్రతికూల శక్తులను తొలగిస్తుంది. విగ్రహాన్ని అశుభ దిశకు ఎదురుగా ఉంచితే అది ఇంట్లో అశాంతి,  ఇబ్బందులను తెస్తుంది.

స్థానం..

గణేశుడి విగ్రహాన్ని నేరుగా నేలపై ఉంచడం చాలా పెద్ద అపరాధం.  అలా చేయడం వల్ల విగ్రహం  శక్తి   ప్రభావితమవుతుంది. విగ్రహాన్ని చెక్క స్టాండ్ లేదా ఎరుపు లేదా పసుపు రంగు శుభ్రమైన వస్త్రంపై ఉంచాలి. ఇది పూజలో సానుకూల శక్తిని తెస్తుంది.  మతపరమైన నియమాలకు అనుగుణంగా ఉంటుంది. పూజ విజయవంతం అవుతుంది.

విగ్రహాల సంఖ్య..

చాలా సార్లు  ఇంట్లో లేదా మండపంలో ఒకటి కంటే ఎక్కువ గణేశ విగ్రహాలను ప్రతిష్టిస్తూ ఉంటారు.  ఇది సముచితం కాదు. ఒక చోట ఒకే విగ్రహాన్ని ప్రతిష్టించడం మంచిది. ఒకటి కంటే ఎక్కువ విగ్రహాలను ఉంచడం వల్ల పూజ ప్రభావం బలహీనపడుతుంది.  భక్తుల మనస్సులలో గందరగోళం ఏర్పడుతుంది. ఇది పూజ ఫలితాలను కూడా తగ్గిస్తుందట.

విగ్రహం స్థితి..

పూజ కోసం ఎల్లప్పుడూ పూర్తిగా, నిండుగా,  అందంగా మంచి స్థితిలో ఉన్న విగ్రహాన్ని ఎంచుకోవాలి. విరిగిన లేదా అసంపూర్ణమైన విగ్రహాన్ని ఉపయోగించడం,  విగ్రహం లోపల డొల్లగా ఉన్న విగ్రహాలు ఉంచడం అశుభంగా పరిగణించబడుతుంది. అలాంటి విగ్రహం ప్రతికూల శక్తిని తెస్తుందట.  పూజ ప్రభావాన్ని కూడా తగ్గిస్తుందట. కాబట్టి విగ్రహం  స్థితి బాగుండాలి.  దాని స్వచ్ఛతను కూడా జాగ్రత్తగా చూసుకోవాలి.

మొగలి పువ్వులు..

గణేశుడికి  కేతకి పువ్వులు అంటే మొగలి పువ్వులు  సమర్పించడం నిషిద్ధం. మొగలి పువ్వులను పూజకు పనికి రాకుండా పరమేశ్వరుడు శాపం ఇచ్చాడు. గణేశుడికి దూర్వా గడ్డి అంటే గరిక, ఎర్రటి పువ్వులు (మందార పువ్వులు వంటివి),  మోదకం, కుడుములు,  ఉండ్రాళ్లు వంటి ప్రసాదాన్ని సమర్పించడం శుభప్రదం. ఇది  వినాయకుడి ఆరాధనలో చాలా ముఖ్యం.


నిమజ్జన నియమాలు..

గణేష్ చతుర్థి పూజ నిమజ్జనంతో ముగుస్తుంది. వినాయకుడి ప్రతిష్ఠ,  పూజ ఎంత పద్దతితో చేస్తారో నిమజ్జనం కూడా అంతే   ఆచారాలు,  మంత్రాల జపంతో చేయాలి. పూజ లేకుండా, వ్రత కథ వినకుండా, ఉద్వాసన చెప్పకుండా  తొందరపడి  నియమాలను విస్మరించి నిమజ్జనం చేయడం మంచిది కాదు. సరైన మంత్రాలతో భక్తితో నిమజ్జనం చేయడం వల్ల గణపతి  ఆశీస్సులు లభిస్తాయి. అలాగే నిమజ్జనం విగ్రహాలను నీటిలో విసిరివేయడం వంటివి చేయరాదు. విగ్రహాలను నీటిలో చాలా జాగ్రత్తగా వదలాలి.

                                      *రూపశ్రీ.
 


More Vinayaka Chaviti