వినాయక చవితి స్పెషల్

 

పదహారు నామాల గణపతి స్తుతి

సుముఖశ్చైక దంతశ్చ కపిలో గజకర్ణకః
లంబో దరశ్చ వికటో విఘ్నరాజో వినాయకః
ధూమకే తుర్గణాధ్యక్షః ఫాల చంద్రో గజాననః
వక్ర తుండ శ్ముర్పకర్ణో హేరంబః స్కంధ పూర్వజః
షోడ శై తాని నామానియః పటేచ్చ్రణు యాదపి
విద్యారంభే వివాహేచ ప్రవేశే నిర్గమే తధా
సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య నజాయతే ||

విఘ్నేశ్వరుణ్ణి ఈ పదహారు నామాలతో స్తుతించాలి. ఈ పదహారు నామాలు చెప్పినా, విన్నా అనంతమైన పుణ్యం సంప్రాప్తమౌతుంది. అఖండమైన గణపతి కరుణ వరదై కురుస్తుంది. చంద్రుడు షోడశకళా ప్రపూర్ణుడు. మనిషి జీవితంలో పదహారు సంస్కారాలు ఉంటాయి. మొట్టమొదటిది సీమన్నతోత్సవం. చిట్టచివరగా అంత్యేష్టి సంస్కారం. పదహారు సంఖ్యకి ఉన్న గొప్పదనం ఏంటో వీటినిబట్టి మనం చాలా తేలిగ్గా అర్థం చేసుకోవచ్చు. వేలాది ఉపచారాలు చేయలేనివాళ్లు కనీసం పదహారు ఉపచారాలతో దేవతార్చన చేయాలి. పదహారు ఉపచారాలతో గణపతిని పూజించడం వెనక ఆ దేవదేవుడు పదహారు వరాలను అనుగ్రహించాలన్న బలమైన కోరిక ఉంటుంది. ధర్మ, అర్థ, కామ, మోక్ష, భక్తి, జ్ఞాన, వైరాగ్యం, దీర్ఘాయుర్దాయం, ఆరోగ్యం, సంపద, అభివృద్ధి, స్థిరత్వం, వీర్యం, విజయం, పుత్రపౌత్రాభివృద్ధి, కులదేవత అనుగ్రహం అనేవి  ఆ పదహారు వరాలు. విఘ్నాలను, ప్రతిబంధకాల్ని తొలగించి ఈ పదహారింటినీ సిద్ధింపజేయగలిగిన దైవం గణపతి. ఇవన్నీ కావాలనుకున్న ప్రతి మానవుడూ గణపతిని ఈ పదహారు నామాలతో స్తుతించి తీరాలి. వీటిని గుర్తుపెట్టుకుని చెప్పలేనివాళ్లు ఎవరైనా చెబుతున్నప్పుడు విన్నాకూడా సంపూర్ణ ఫలం సిద్ధిస్తుంది.

 

వినాయక చవితినాడే విఘ్నేశ్వరుణ్ణి ఎందుకు పూజించాలి?

భాద్రపద శుక్ల చవితినాడు మధ్యాహ్నంవేళ వినాయక జననం జరిగింది. నరరూపంలోఉన్న వరపుత్రుడైన వినాయకుడిని లోకకల్యాణంకోసం పరమేశ్వరుడు గజముఖుడిగా మార్చాడని ప్రతీతి. పార్వతీదేవి నలుగుపిండి ముద్దతో చేసిన బాలుడిని త్రిశులంతో శిరస్సుని ఖండించి మరలా ఆ బాలుణ్ణి బతికించేందుకు గజముఖాన్ని అతికించి ప్రాణపతిష్ఠ చేశారు. కారణజన్ముడైన గజాననుడు గజాసురుణ్ణి సంహరించి లోకాలను కాపాడాడు. గజాసురుడితోపాటు లోకుల్ని విపరీతంగా బాధపెడుతున్న మరో సమస్య  విఘ్నాలు. రకరకాల విఘ్నాలతో విసిగి వేసారిపోయిన ఏడేడు లోకాలూ విఘ్నాలకు ఓ మహనీయుడిని అధిపతిని చేయమని పరమేశ్వరుణ్ణి ప్రార్థించారు. కుమార స్వామికీ, విఘ్నేశ్వరుడికీ ఈ విషయ గట్టి పోటీ జరిగింది. బుద్ధి కుశలతతో విఘ్నేశ్వరుడు తన ఆధిపత్యాన్ని నిరూపించుకుని గణాధిపతి అయ్యాడు. విఘ్నాలు దరిచేరకపోవడమనే వరం భాద్రపద శుక్ల చవితినాడు వినాయకుడిని పూజించేవాళ్లకి దొరికే మొట్టమొదటి లాభం. భాద్రపద శుక్ల చవితినాడు వినాయకుడికి ఈశ్వరుడు గణాధిపత్యాన్ని ఇచ్చాడు కనుక ఈ రోజున స్వామిని సేవించుకుంటే సర్వ విఘ్నాలూ తొలగిపోతాయి. సకల కార్యాలూ సానుకూలమౌతాయి. మాఘ బహుళ చవితినాడు సంకష్టహర గణేష వ్రతాన్ని ఆచరిస్తే ఎంతటి దరిద్రంలో మగ్గిపోతున్నవారైనా జీవితాన్ని నిలబెట్టుకోగలుగుతారు. ఒకరి దయాదాక్షిణ్యాలమీద ఆధారపడాల్సిన పనిలేకుండా తమంతటతాముగా స్వయం సమృద్ధిని సాధించడమేకాక పదిమందికీ పెట్టగలిగిన స్థితికి చేరుకుంటారు.

 

గణపతిని అతి సులభంగా ప్రసన్నం చేసుకోవడం ఎలా?

శ్రీకాంతో మాతులో యస్య జననీ సర్వమంళా 
జనకః శంకరో దేవో తం వందే కుంజరాననః  

                                                                        
ఈ శ్లోకంతో మంగళకరుడైన గణపతి అత్యంత ప్రసన్నుడౌతాడు. ఈ శ్లోకాన్ని నేర్చుకోవడం, గుర్తుపెట్టుకోవడం, మననం చేసుకోవడం చాలా చాలా తేలిక గనుక విద్యాబుద్ధులు చక్కగా అబ్బాలని కోరుకునే పిల్లలతోపాటు సమస్త కార్యాలూ సానుకూలమవ్వాలని కోరుకునే పెద్దవాళ్లుకూడా దీన్ని చక్కగా నేర్చుకోవచ్చు. ఒక్కసారి ఈ చిన్న శ్లోకం రూపంలో ఉన్న మహాగణపతి మహా మంత్రాన్ని మననం చేసుకున్న తర్వాత దీని మహత్యాన్ని మీరే అనుభవంలో తెలుసుకోవచ్చు. మంగళప్రదమైన శ్రీకారంతో మొదలైంది ఈ శ్లోకం. మేనత్త శ్రీమహాలక్ష్మి ముందుండి నడిపిస్తోంది. ఆమె అనుగ్రహం వల్లనే సకల లోకాలూ మనగలుగుతున్నాయి. మేనమామ విష్ణుమూర్తి సకలలోకపాలకుడు. విష్ణువు జగద్రక్షకుడు, దుష్ట శిక్షకుడు. తల్లి సకల సౌభాగ్యాలనూ ప్రసాదించే సర్వమంగళ. అమ్మ శక్తి మూలంగానే సమస్త చరాచర సృష్టీ కదలగలుగుతోంది. అఖిల భువనాలకూ శుభాలను ప్రసాదించే కరుణాంతరంగుడు పరమేశ్వరుడు. పరమేశ్వరుడిని తలచుకుంటేచాలు సకల శుభాలూ ఒనగూరుతాయి. గణపతిని కంటికి రెప్పలా  కాపాడుకునేవాళ్లంతా ఈ శ్లోకంలో ఉన్నారు కనుక దీన్ని పఠించినవాళ్లకుకూడా ఆయన తల్లీతండ్రులైన పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం, మేనత్తా మేనమామలైన శ్రీమహాలక్ష్మి, విష్ణుమూర్తి అనుగ్రహంకూడా పుష్కలంగా లభిస్తుంది. దీంతోపాటుగా నాలుగు గరిక పోచల్ని దగ్గర్లో ఉన్న విఘ్నేశ్వరాలయానికి వెళ్లి అక్కడి విగ్రహానికో లేక అందుబాటులో ఉన్న ఏ విఘ్నేశ్వర విగ్రహానికైనా సరే సమర్పించుకుంటూ ఉంటే విఘ్నాలు మీ పేరుని తలచుకోవడానిక్కూడా భయపడతాయి. సంపూర్ణ గణపతి అనుగ్రహ కటాక్ష ప్రాప్తిరస్తు.

సులభ ప్రసన్నుడు గణపతి

వినాయకుడిని పూజిస్తే సూక్ష్మగ్రాహ్యత, సూక్ష్మబుద్ధి అలవడతాయి. అమోఘమైన జ్ఞాపక శక్తి లభిస్తుంది. ఎప్పుడు, ఎక్కడ, ఎవరితో, ఎలా మాట్లాడాలో బోధపడుతుంది. పత్రితో వినాయకుడికి పూజ చేస్తే సకల భోగభాగ్యాలనూ అనుగ్రహిస్తాడు. ముఖ్యంగా దూర్వారయుగ్మంతో స్వామిని పూజించుకుంటే అఖండ ధనరాశుల్ని ప్రసాదిస్తాడు. మిగతా ఏ దేవుళ్లను పూజించాలన్నా కాస్తో కూస్తో ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. కానీ.. వినాయకుడిని పూజించడానికి దమ్మిడీ ఖర్చు పెట్టాల్సిన పనిలేదు. కాస్త గరికపోచల్ని తీసుకెళ్లి మహానుభావా అని కాళ్లమీద పడి ఓ దణ్ణం పెట్టుకుంటే చాలు గణపతి కరిగిపోతాడు. మిగతా దేవతలంతా కాస్తో కూస్తో భక్తుడిని పరీక్షించడానికి ఆలస్యం చేస్తే చేయొచ్చుగాక, కానీ గణపతి మాత్రం ఆర్తత్రాణ పరాయణత్వంలో ఆరితేరినవాడు. భక్తులపై అనుగ్రహ రసవృష్టిని కురిపించడంతో ఎప్పుడూ ముందుండేవాడు. బదులుగా గణపయ్యకు నాలుగు ఉండ్రాళ్లు, మోదకాలు ఇస్తే చాలు ఉప్పొంగిపోతాడు. మిగతా దేవతలంతా మనం వండి వడ్డించిన పదార్ధాలను ఆరగించరు. కేవలం మన తృప్తికోసం వాటిని వాళ్లు తిన్నారన్న భావన చేస్తాం. కానీ.. ఒక్క గణపయ్య మాత్రం మన చేత్తో వండి వడ్డించిన కుడుములు, ఉండ్రాళ్లను సుష్టుగా భోంచేస్తాడు. మనసారా దీవిస్తాడు.

- మల్లాది వేంకట గోపాలకృష్ణ

 


More Vinayaka Chaviti