పురాణ కథల్లో హనుమంతుడు
Hanuman Stories in Epics
హనుమంతుని జీవితం గురించి వివిధ గాథలు ప్రచారంలో ఉన్నాయి. ముఖ్యంగా రామాయణంలో హనుమంతుని ప్రస్తావన వచ్చినప్పుడు శ్రీరాముని బంటుగానే వర్ణించడం జరిగింది.. పురాణాలు, ఉపనిషత్తులు, సంప్రదాయ గాథల్లో ఆంజనేయునికి సంబంధించి అనేక విషయాలు, కథలు ఉన్నాయి. ఇక జానపద సాహిత్యంలోనూ, వివిధ స్థలపురాణాలలోనూ కొల్లలుగా గాథలున్నాయి. ఇక్కడ ప్రధానంగా వాల్మీకి రామాయణ ఇతివృత్తమైన గాథను గుర్తుచేసుకుందాం.
పుంజికస్థల అనే అప్సరస అంజన అనే వానర కాంతగా జన్మించింది. కేసరి అనే వానరవీరుడు ఆమెను పెళ్ళాడాడు. ఆ దంపతులు సంతానం కోసం మహాశివుని భక్తిశ్రద్ధలతో ఆరాధించారు. అప్పుడు వాయుదేవుడు శివుని తేజస్సును ఒక పండు రూపములో అంజనాదేవికి ప్రసాదించాడు. అలా అంజనాదేవికి జన్మించిన సుతుడే ఆంజనేయుడు. ఆంజనేయునకు హనుమంతుడని, కేసరి నందనుడనీ, వాయుదేవుని అనుగ్రహముతో జన్మించినందున వాయుసుతుడనీ కూడా నామధేయాలొచ్చాయి.
జన్మతః బలసంపన్నుడు అయిన ఆంజనేయుడు ఒకసారి ఉదయిస్తోన్న సూర్యబింబాన్ని చూసి ''పండు'' అనుకుని దాన్ని అందుకుని తినాలని ఆకాశమునకు ఎగిరాడు. అప్పుడు జరిగిన ఘటనలలో ఇంద్రుడు తన వజ్రాయుధంతో ఆ బాలుని (ఆంజనేయుని) దవడపై కొట్టాడు. అలా కొట్టడం వల్ల ఆ బాలుని దవడకు చొట్ట పడింది. చొట్ట పడిన దవడ కలిగిన వాడవడం చేత హనుమంతుడనే పేరు వచ్చింది.
తన కొడుకు దెబ్బ తిన్నందుకు వాయుదేవునికి సహజంగానే విపరీతమైన ఆగ్రహం కలిగింది. ఆ కోపంతో వాయుదేవుడు వీచటం మానేశాడు. దాంతో బ్రహ్మాది దేవతలు హనుమంతునికి అనేక వరాలిచ్చి వాయుదేవుని శాతింపజేశారు.
మరోసారి మరో ఇతివృత్తం జరిగింది. ఎప్పుడూ ఏదో నెపాన మహా అల్లరి చేసే హనుమంతుని మునులు శపించారు. ఆ శాపం కారణంగా హనుమంతునికి తన శక్తి ఏమిటో తనకు తెలియకుండా పోయింది.
హనుమంతుడు సూర్యుని వద్ద అభ్యాసం చేశాడు. సూర్యుడు గగనతలంలో తిరుగుతూ ఉంటే ఆయన రథంతో పాటుగా తానూ ఎగురుతూ విద్య నేర్చుకున్నాడు. ఈవిధంగా హనుమంతుడు సకల విద్యలలోను, వ్యాకరణంలోను పండితుడయ్యాడు. అందుకే నవ వ్యాకరణాలలోనూ మహాపండితుడు, దిట్ట అంటూ హనుమంతుని కీర్తిస్తారు. వివాహితులకు మాత్రమే అర్హత ఉన్న కొన్ని విద్యలు నేర్చుకోవడానికి అనుకూలంగా సూర్యుడు తన కూతురు సువర్చలకు హనుమంతునితో వివాహం జరిపించాడనీ, అయినప్పటికీ హనుమంతుని బ్రహ్మచర్య దీక్షకు ఎంతమాత్రం భంగం వాటిల్లలేదని కూడా పురాణ కథలు వివరిస్తున్నాయి.
గురుదక్షిణగా సూర్యుని కొడుకు సుగ్రీవునికి మంత్రిగా ఉండేందుకు హనుమంతుడు అంగీకరించాడు. సుగ్రీవుడు, అతని అన్న వాలి కిష్కిందలో ఉన్న వానరులు. వాలి, సుగ్రీవుల మధ్య ఏర్పడిన వైరము కారణముగా సుగ్రీవుడు తన ఆంతరంగికులైన హనుమదాదులతో సహా ఋష్యమూక పర్వతముపై తలదాచుకున్నాడు.
రావణాసురుడు అపహరించిన సీతను వెతుకుతూ రామలక్ష్మణులు ఆ ప్రాంతానికి వచ్చారు. హనుమంతుడు వారివద్దకు వెళ్ళి పరిచయము చేసుకుని, వారిని తన భుజములపై ఎక్కించుకుని సుగ్రీవుని వద్దకు తీసికువెళ్ళి వారి స్పర్ధలను తొలగించి మైత్రికి తోడ్పడ్డాడు.
రాముని చేతిలో వాలి మరణించగా సుగ్రీవుడు వానర రాజయ్యాడు. సీతను వెతకడానికి సుగ్రీవుడు నలుదిశలకు వానర వీరులను పంపించాడు.
అలా వెళ్ళినవారిలో దక్షిణ దిశగా వెళ్ళిన అంగదుని నాయకత్వంలోని బృందంలో హనుమంతుడు, జాంబవంతుడు, నలుడు, నీలుడు వంటి మహావీరులున్నారు. వారు దక్షిణ దిశలో అనేకే శ్రమలకోర్చి వెళ్ళినా సీత జాడ తెలియరాలేదు. చివరికి స్వయంప్రభ అనే తపస్విని సహాయంతో దక్షిణ సముద్రతీరం చేరుకున్నారు. ఆ తర్వాత ఏం చేయాలో పాలుపోక హతాశులై ఉన్నవారికి సంపాతి అనే రాజు (జటాయువు సోదరుడు) రావణాసురుడు, సీతమ్మను లంకలో బంధించి ఉంచాడని చెప్పాడు.
vali sugreeva and hanuman, rama bhakta hanuman, hanuman in hindu epics, stories of hanuman