ఆంజనేయస్వామిని చూసి శనీశ్వరుడు
జడుసుకున్నాడా ?
దేవతల్లో ఇద్దరిని మాత్రమే శనీశ్వరుడు పట్టలేదని మన శాస్త్రాలు చెపుతున్నాయి. శనీశ్వరుని ప్రభావం విఘ్నేశ్వరుడు, హనుమంతునిపై పడలేదని పురాణాలు పేర్కొంటున్నాయి. శ్రీరామాయణంలోని ఓ చిన్న కథ ద్వారా హనుమంతునిపై శనీశ్వర ప్రభావం లేదనే విషయాన్ని మనం తెలుసుకోవచ్చు. రామాయణం ఆధారంగా లంకలో రావణుని చెరలో ఉన్న సీతాదేవిని రక్షించేందుకు వీలుగా హనుమంతుడు సముద్రంలో ఓ మార్గాన్ని నిర్మించారు. ఈ మార్గం నిర్మించే సమయంలో శనీశ్వరుడు ఆ ప్రాంతానికి చేరుకున్నాడు. శనీశ్వరుడు సముద్ర మార్గాన్ని నిర్మించడంలో చేయూత నిచ్చేందుకే ఆ ప్రాంతానికి వచ్చారని అందరూ అనుకున్నారు. కానీ హనుమంతుడుని పట్టేందుకే శనీశ్వరుడు వచ్చినట్లు శనిభగవానుడు తెలిపాడు. చెప్పినట్లు హనుమాన్ తలపై ఎక్కి కూర్చున్న శని, హనుమంతుడు చేసే పనులకు అంతరాయం కలిగించాడు.
కానీ శ్రీరామ భక్తుడిగా సీతాదేవిని రక్షించేందుకు చేస్తున్న సుకార్యమునకు శనీశ్వరుడు తలపై కూర్చుని అంతరాయం కలిగిస్తున్నాడని భావించిన హనుమంతుడు, శనీశ్వరుడిని తలను వదిలిపెట్టి కాలు భాగాన పట్టుకోమని చెబుతాడు. అందుకు శనీశ్వరుడు సమ్మతించి హనుమంతుని కాలుని పట్టుకోవాలని ప్రయత్నించాడు. అయితే హనుమంతుడు తన మహిమతో శనీశ్వరుడిని కాలికింద భాగంలో అణచివేయడంతో శనీశ్వరుడు మారుతిని పట్టుకోవడానికి వీలుపడలేదు. దీంతో పాటు శనీశ్వరుడు హనుమంతుని పాదాల కిందనే ఉండి, తప్పించుకునే మార్గం లేక తపించిపోయాడని పురాణాలు చెబుతున్నాయి. ఈ కథాంశాన్ని పేర్కొంటూ చిత్రీకరించిన చిత్రలేఖనాలు తమిళనాడు చెంగల్పట్టు కోదండరాముని ఆలయంలో ఉన్నాయని పురోహితులు అంటున్నారు.
అందుచేత శనిగ్రహ ప్రభావం నుంచి తప్పుకున్న హనుమంతుడిని పూజించేవారికి శనీశ్వరునిచే ఏర్పడే ఈతిబాధలు పూర్తిగా తొలగిపోతాయని పురోహితులు చెబుతున్నారు. కాబట్టి శనివారం నాడు, లేదా అమావాస్య తిథిల్లో హనుమంతునికి నేతితో దీపమెలిగించే వారికి సకల సంపదలు చేకూరుతాయని విశ్వాసం. ఇంకా రావణుడి చెరలో ఉన్న నవగ్రహాలను తప్పించిన కారణంగా హనుమంతునికి శనీశ్వరుడు ఓ వరం ఇచ్చాడని, ఆ వర ప్రభావంతో ఏలినాటి శని ప్రభావంలో ఉన్న జాతకులు హనుమంతునిని స్తుతిస్తే.. వారికి శనిగ్రహంచే ఏర్పడాల్సిన ఈతిబాధలు, సమస్యలు తొలగిపోతాయని పురాణాలు చెబుతున్నాయి.