హనుమదుపాసన సర్వసంపత్కరం
మన సనాతన ధర్మాలలో అనేకమంది ఉపాస్య దేవతలున్నారు. స్మార్తోపాసనలో పంచ దేవోపాసన ప్రసిద్ధమెంది. కాని ఈ ఉపాస్య దేవతలందరిలోనూ సాకార బహ్మచర్య రూపాన్ని ధరించినవాడు హనుమంతుడు. బ్రహ్మచర్య పాలన, శతృ నిగ్రహం, కామ విజయం, కార్యసిద్ధి తదితర విషయాల దృష్ట్యా హనుమంతుడు ప్రసిద్ధి. దాస్య భక్తికి చక్కని నిదర్శనంగా నిలిచిన హనుమంతుడు అంజనీపుత్రుడు, పవనసుతుడు, రుద్రావతారమూర్తి, కేసరీనందనుడు, సాధుశిరోమణి, కపి శిరోమణి, భక్త శిరోమణి, పాపనాశకరుడు తదితర పేర్లతో హనుమంతుని మనం స్మరిస్తాం. రుద్రావతారుడు కావడం చేత శంకర నందనుడయ్యాడు. కేసరికి ఔరసపుత్రుడవ్వడంవల్ల కేసరి నందనుడయ్యాడు. హనుమంతునికి పవనసుత- అంజనీపుత్ర అనే పేర్లు రావడానికి ఓ పురాణగాథ ప్రచారంలో ఉంది.
పురాణగాథ: ‘పుంజిక స్థల’ అనే అప్సరస శాపగ్రస్తురాలై కామరూపం గల దివ్యాతిదివ్యమైన వస్త్రాలను ధరించి పర్వతం మీద సంచరిస్తుందట. ఆమెను వీక్షించిన వాయుదేవుడు, ఆమె వైపు పురోగమించాడు. ఈ హఠత్పరిణామానికి విస్తుపోయిన ‘పుంజిక స్థల’, పతివ్రత అయిన తనను స్పృశించిన వారెవరని గద్దించిందట. అప్పుడు వాయుదేవుడు ‘‘దేవీ… అలాంటిదేమీ లేదు… అనంతకోటి బ్రహ్మాండ నాయకుడు, అనాధ నాధుడు, కరుణామయుడైన భగవానుడు భూభార హరణార్థం మానవ రూపాన అవతరింపనున్నాడు. ఆ పరమాత్ముని సేవకోసం నీ పుత్రునిగా మారుతి పుట్టి విఖ్యాతుడవుతాడు అని చెప్పాడట. అలా హనుమంతునికి పవనసుత- అంజనీపుత్ర అనే నామాలు వచ్చాయి.
అంతటి మహిమాన్వితుడైన హనుమంతుడు మహాతత్వవేత్త. సనక, సనందన, సనత్కుమార, సనాతన సోదరులు నలుగురు హనుమంతుని ద్వారా రామమంత్ర రహస్యాన్ని గ్రహించారు. హనుమదుపాసన అన్నివిధాల శ్రేయస్కరంగా పురాణాలు చెబుతున్నాయి. ఏకాగ్రతకు, స్వచ్ఛతకు మారుపేరు హనుమంతుడు కావడంవల్ల ఆ స్వామి దర్శనం, పూజలవల్ల ఏకాగ్రచిత్తం ఏర్పడి, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. భూత పిశాచ పీడా నివారణకు హనుమంతుని స్మరణయే పరమావధిగా చెబుతారు. బుద్ధి, వీర, బలాదులను హనుమంతుడు తన భక్తులకు ప్రసాదిస్తూ వుంటాడు. భూత, ప్రేత రాక్షసాదులు ఆ మహాత్ముని నామోచ్చరణ మాత్రం చేతనే పారిపోతాయి. స్మరణం మాత్రం చేతనే సమస్త రోగాలు శాంతిస్తాయి. మానసిక దౌర్బల్య సంఘర్షణలలో ఆ స్వామి సహకారం లభిస్తుంది. హనుమంతుని సహకారం వల్లనే తులసీదాస మహాకవికి శ్రీరామదర్శన మహాద్భాగ్యం కల్గింది.
హనుమంతుడు బాలబ్రహ్మచారి. ఆ మహనీయుని ధ్యాస బ్రహ్మచర్యానుష్టంవల్ల నిర్మలంతకరణమందు సమగ్రమైన భక్తి ఉద్భవిస్తుంది. హనుమంతుని ఆరాధించడంవల్ల ఆయనలోని సద్గుణాలన్నీ సాధకులూ, భక్తులకు లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. అపారమైన శ్రీరామభక్తికి నిలువెత్తు నిదర్శనం హనుమంతుడు. హనుమంతోపాసన పరమోత్కృష్టమైనది. హనుమదుపాసనకు ఏ నియమం లేదు. వయసు, కులం, మతం తేడాలు అంతకన్నా లేవు. నిష్కల్మషమైన భక్తి విశ్వాసాలుంటే, ఆ స్వామి కరుణిస్తాడు. అనుగ్రహించి కోరినవన్నీ సమకూరుస్తాడు. హనుమదుపాసనకుగాను కొంతమంది అర్థమండల, మరికొంతమంది మండల దీక్షలు చేపడతారు. ఆ దీక్షలన్నీ వారి వారి నమ్మకాలనుబట్టి చేస్తున్నప్పటికీ స్వామి సాక్షత్కారానికి భక్తి ఒక్కటే మార్గం.
అపారమైన విశ్వాసం, నిష్కల్మష సేవాగుణాలే హనుమంతుని అనుగ్రహానికి కారణమవుతాయి. హనుమంతుడి సేవను రోజూ చేయడం తప్పనిసరి. మన దైనందిన జీవితంలో అనేకానేక భయాలు వెంటాడుతూ వుంటాయి. వీటన్నింటికీ దూరంగా వుండి, మనస్సు ప్రశాంతంగా వుండాలంటే హనుమదుపాసనే మార్గం. అయితే హనుమంతుని పూజకు మంగళ, శనివారాలు శ్రేష్టమైనవిగా పెద్దలు చెబుతారు. స్వామి మంగళప్రదుడు కావడంవల్ల మంగళవారం పూజిస్తారు. అలాగే శని దోషాలను నివృత్తిచేయువాడు కనుక శనివారం కొలుస్తారు. ఆయా రోజులలో స్వామిని తమలపాకులతో సేవించడం విశేషమైన ఫలితాలనిస్తుందంటారు. సింధూర వర్ణ శోభితంగా దర్శనమిచ్చే హనుమంతుని దర్శనం, స్మరణం, కీర్తనంవల్ల సమస్త దారిద్య్రాలూ నిర్మూలింపబడి, శాంతి సౌఖ్యాలు లభిస్తాయి.