ఉగాదినాడు చలివేంద్రం పెట్టమన్నారు పెద్దలు
ఉగాది అంటేనే మండు వేసవికి ముందు వచ్చే పండుగ. ఈ రోజు నుంచి రోజురోజుకీ ఎండలు పెరుగుతాయే కానీ తగ్గేవి కావు. అందుకే ఉగాదినాడు చేయవలసిన క్రతువులలో ‘ప్రపాదాన ప్రారంభాన్ని’ కూడా చేర్చారు పెద్దలు. ప్రపా అంటే చలిపందిరి! గోమయంతో అలికిన ప్రాంతంలో, చల్లని కుండలలో నీటిని నింపి వచ్చేపోయే బాటసారులకు దాహార్తిని తీర్చమంటోంది ఉగాది. కుండలలో నిలవ చేసిన నీరు అటు చల్లదనాన్ని అందిస్తూ, ఇటు సూక్ష్మక్రిముల నుంచి దూరం చేస్తుందన్న విషయం తెలిసిందే! అయితే చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం అందరికీ సాధ్యం కాదు కాబట్టి, యథాశక్తి వచ్చేపోయేవారికి దాహార్తిని తీర్చేందుకు ప్రయత్నించాలి. ఇవేవీ సాధ్యం కానీ వారు నీరు నింపిన కలశాన్ని దానం చేసే ‘జలకుంభ’ దానం కూడా వాడుకలో ఉంది.