పంచాంగ శ్రవణం ఎందుకు
తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణములనే అయిదు అంగాలు కలిగిన కాలజ్ఞానాన్నే పంచాంగం అంటారు. ఒకప్పుడు ఈ పంచాంగం అందరికీ అందుబాటులో ఉండేది కాదు. ఉన్నా దాన్ని ఎలా చూసుకోవాలో ఎవరికీ తెలియదు. అందుకని గ్రామంలోని పురోహితుల వద్దకు ఊరిజనమంతా చేరేవారు. గ్రహగతులను బట్టి ఒకోరాశి వారి స్థితిగతులు ఎలా ఉంటాయో పురోహితులు వివరించేవారు. అయితే వ్యక్తిగతమైన జాతకాన్ని వివరించడంతో పంచాగం ముగిసిపోదు. వచ్చే ఏడు వర్షాలు ఎలా పడతాయి? పంటలు ఎలా పండుతాయి? దేశంలోని రాజకీయ పరిస్థితులు ఎలా ఉంటాయి? శుభకార్యాలకు అనువైన సమయాలు ఏమిటి? ఈసారి అధిక మాసం ఎప్పుడు వచ్చింది?... లాంటి సవాలక్ష విశేషాలతో నిండి ఉంటుంది. అలా పంచాంగం... వ్యవసాయం, రాజకీయం, సామాజిక, ఆధ్యాత్మిక రంగాలన్నింటినీ ప్రతిబించేదిలా ఉంటుంది. పైగా పంచాంగ శ్రవణంలో అందరూ ఒక చోటకి చేరడం ఒక గొప్ప సామాజిక ఉత్సవం. ఇక పురోహితుల వారి నుంచే అప్పటికప్పుడు సందేహాలను తీర్చుకుంటూ, చేయవలసిన పరిహారాలను తెలుసుకుంటూ కాలాన్ని సద్వినియోగం చేసుకోవడం చక్కటి అనుభూతి. అందుకే పంచాంగ శ్రవణం చేసిన వారికి నవగ్రహాలూ సకల సౌఖ్యాలనును అందిస్తాయని అంటుంది ఫలశ్రుతి.