శ్రీరాముడి కృప ఎంతటిదో  తెలియజెప్పే కథ!

భారతీయ సత్పురుషులు, మహాత్ముల గురించి అనేక గాథలు ప్రచారంలో ఉన్నాయి. అలాంటి కథల్లో తులసీదాసు చెప్పిన కథ గమనిస్తే..

అప్పుడు తులసీదాసు కాశీలో నివసిస్తున్నారు. ప్రతి ఇంటా ఆయనకూ, ఆయనతో ప్రణీతమైన రామాయణ గ్రంథానికి సన్మాన సత్కారాలు లభించేవి. రామనామాన్ని భ్రమరంలాగా జపించేవారి ముందు ఆయన పవిత్రమైన తులసి మొక్కలా గొచరించేవాడు. అలాంటి పరమ భక్తుడైన తులసీదాసు భక్తుల సందేహాలను తీర్చేవాడు.

ఒకనాడు ధనపాలుడనే ధనికుడు, తులసీదాసు వద్దకు వచ్చాడు. అతడు పరమలోభి. అతడు ఒక ఆశ్చర్యకరమైన ప్రతిపాదన చేశాడు. ఇంటింటా శ్రీరామచంద్రుడు అనేక ఉపచారాలతో అర్చింపబడుతున్నాడని ఆయన ఎరుగును. 'మహాత్మా! నాకు కూడా శ్రీరామచంద్రుణ్ణి సకలోపచారాలతో అర్చించాలని ఉంది' అన్నాడు. 'అలాగే చేయి నిన్ను అడ్డుకొన్నదెవరు?” అన్నాడు తులసీదాసు. 'అది కాదు స్వామీ! అర్చనకు పూలు, పళ్ళు, ధూప, దీపాదులు అవసరం కదా? వీటికి దమ్మిడీ వ్యయం చేయకుండా అర్చన జరిగే ఉపాయం చెప్పండి' అన్నాడు ధనపాలుడు.

అమితాశ్చర్యంతో ఆ లోభిని ఆపాదమస్తకం తిలకించాడు తులసీదాసు. అతడి పిసినారితనం చూసి, ఆయనకు జాలి కలిగింది. చాలాసేపు మౌనంగా ఉన్నాడు. చివరకు, 'మానసపూజ తప్పించి నాకు అన్యమార్గం కనిపించడం లేదు. మానసపూజ అంటే, అన్ని ఉపచారాలూ కాల్పనికాలు. నీవు అన్నీ చేస్తున్నట్లు మనస్సులో ఊహించాలి. నీవు కావలసినన్ని ఉపచారాలతో ఆ విధంగా చేయవచ్చు. చిల్లిగవ్వ ఖర్చుకాdhu' అన్నాడు తులసీదాసు.

ధనపాలుని ఆనందానికి అవధులు లేవు. ఇంతకాలం ఇలాంటి ప్రణాళిక కోసమే తాను ఎదురుచూశాడు. అయితే కాల్పనికమైనా ఎక్కువ పదార్థాలు నివేదింపదలచలేదు. అందువల్ల 'ఏ విధంగా మానసపూజ చేయాలో సవివరంగా చెప్పండి' అని తులసీదాసును అడిగాడు ధనపాలుడు.

శ్రీరామచంద్రుణ్ణి ఒక్క నిమిషం ధ్యానం చేసి, 'ఆయన ప్రతిమను బంగారు సింహాసనంపై ప్రతిష్ఠించు. రకరకాల పుష్పాలతో అలంకరించు. ఆపైన వేడి చేసిన ఆవు పాలల్లో కాస్తంత పంచదార కలిపి నివేదన చేయి. పంచదార కలపడం మాత్రం మరువకు సుమా! నా రాముడు పంచదార లేని పాలు త్రాగలేడు. అనుదినం ఈ విధంగా మానసపూజ చేయి, దమ్మిడీ వ్యయం కాదు' అన్నాడు తులసీదాసు.

ధనపాలుని లోభగుణం అటుంచి, అతడికి నిష్ఠ మెండు. తులసీదాసునే గురువుగా ఎంచి ధనవ్యయం లేని మానసపూజ మొదలుపెట్టాడు. పంచదార ఎక్కువ వాడకం జరుగరాదని, ఒక చిన్న డబ్బా, ఒక చెమ్చా కొన్నాడు. (అంతా ఊహలోనే, నిజంగా అవిలేవు). ఈ విధంగా కొన్ని ఏళ్ళు గడిచాయి. ఒకనాడు పాలు నివేదన వేళకు మనస్సులో చెమ్చా కనపడలేదు. చేసేది లేక, డబ్బా నుండి పంచదారను. పాలల్లోకి ఒంపాడు. పంచదార ఎక్కువ పడింది. వెంటనే మనస్సులో ఉన్న పాలగిన్నెలో చేయి పెట్టి, కరగని పంచదార తీసివేయ సాగాడు.

పదిహేను సంవత్సరాలుగా ఈ లోభి మానసిక పూజను స్వీకరిస్తున్నాడు శ్రీరామచంద్రుడు. అయినా, అతడి పిసినారితనం కించిత్తయినా తగ్గలేదు. ప్రభువుకు అమితమైన అనుకంపన కలిగింది. భక్తుని చేయి గట్టిగా పట్టుకుని 'ధనపాలా! పాలూ కాల్పనికమే, పంచదారా కాల్పనికమే. కాల్పనిక పంచదార కొంచెం ఎక్కువగా పడితే ఏమిటయ్యా! ఉండనీయరాదూ!' అన్నాడు.

శ్రీరామచంద్రుని కరస్పర్శ మూలంగా ధనపాలునిలో పరమ వైరాగ్యం కలిగింది. వెంటనే అతడు నిజమైన భక్తి. ప్రపత్తులతో శ్రీరాముణ్ణి ధ్యానించి తరించాలని తపోభూమికి వెళ్ళిపోయాడు. ఇది నిజంగా జరిగిన సంఘటన. దీన్ని బట్టి ఆ రాముడి కృప ఎలాంటిదో అర్థమవుతుంది. 

                                         *నిశ్శబ్ద.


More Purana Patralu - Mythological Stories