మంచి-చెడుల మర్మానికి కచుడు మచ్చుతునక!!

 

ప్రతి మనిషి పుట్టుక ఏదో ఒక కారణంతోనే జరుగుతుంది. ప్రస్తుత కాలంలో దీన్ని ఎవరూ పట్టించుకోరు కానీ మన పురాణాలను తిరగేస్తే అందులో ఇలాటి సందర్భాలు బోలెడు కనబడతాయి.  అలాంటి వాటిలో కచుడి కథ ఒకటి.

ఎవరు ఈ కచుడు??

కచుడు దేవతల గురువు అయిన బృహస్పతి కుమారుడు. గురువారం ను లక్ష్మీవారం అంటారు. ఈ లక్ష్మివారం కూడా బృహస్పతిని స్మరించుకుంటూ ఉండటానికి నిర్ణయించినదేనట.  ఈ బృహస్పతి మూడవ భార్య అయిన మమతకు, బృహస్పతికి పుట్టిన కొడుకులు భరద్వాజ , కచుడు. 

దేవతలకు రాక్షసులకు మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు చనిపోతున్న రాక్షసులను శుక్రాచార్యుడు తన మృతసంజీవని విద్య ఉపయోగించి తిరిగి బతికిస్తూ ఉంటాడు. దీనివల్ల దేవతలు ఎంత కష్టపడ్డా ఫలితం మాత్రం శూన్యమైపోతూ వస్తోందని. తమ గురువైన  బృహస్పతి దగ్గరకు విషయం అంతా చెబుతారు. అప్పుడే బృహస్పతి కొడుకు కచుడు ని పిలిచి చేయవలసిన పనిని రహస్యంగా చెబుతాడు.

తండ్రి మాట అనుసరించి కచుడు శుక్రాచార్యుడి దగ్గరకు వెళ్లి శిష్యుడిగా చేరతాడు. కొద్దికాలంలోనే శుక్రాచార్యుడి నుండి మృతసంజీవని విద్యను నేర్చుకుంటాడు. శుక్రాచార్యుడి కూతురు దేవయాని కచుడు ని ప్రేమిస్తుంది. అయితే  ఇదంతా తెలిసిన రాక్షసులు. ఏ విద్య వల్ల అయితే తాము బతుకుతున్నామో ఆ విద్య దేవతల మనిషి అయిన కచుడు నేర్చుకోవడం ఇష్టం లేక రాక్షసులు  కచుణ్ని చంపేస్తారు. కచుడు చనిపోగానే దేవయాని ఎంతో బాధపడి తండ్రి శుక్రాచార్యుడి దగ్గరకు వెళ్లి కచుణ్ని బతికించమని కోరుతుంది. శుక్రాచార్యుడు మృతసంజీవని విద్య సహాయంతో కచుణ్ని తిరిగి బతికిస్తాడు. 

తాము కచుణ్ని చంపినా తిరిగి బతకడంతో రాక్షసులు ఈసారి వేరే ఉపాయాన్ని ఆలోచిస్తారు. కచుణ్ని భస్మం చేసి ఆ బూడిదను శుక్రాచార్యుడికి తెలియకుండా అతను తాగే నీళ్లలో కలిపేస్తారు. ఆ తరువాత విషయం తెలిసిన శుక్రాచార్యుడు మృతసంజీవని విద్యతో కచుణ్ని బతికిస్తాడు. అయితే శుక్రాచార్యుడి కడుపు చీల్చుకుని కచుడు బయటకు రావడం వల్ల శుక్రాచార్యుడు మరణిస్తాడు. కచుణ్ని బతికించే ముందే శుక్రాచార్యుడు కచుడితో. నువ్వు బయటకు వచ్చిన తరువాత మరణించిన నన్ను నువ్వు నేర్చుకున్న మృతసంజీవని విద్యతో బతికించు అని చెబుతాడు. కానీ కచుడు మరణించిన శుక్రాచార్యుణ్ణి అలాగే వదిలేసి నేను వచ్చిన పని పూర్తయ్యింది అనుకుని, అక్కడి నుండి వెళ్లిపోవడానికి సిద్ధమవుతాడు. 

అయితే అతన్ని ఇష్టపడిన దేవయాని అతనితో నన్ను పెళ్లి చేసుకో అని అడుగుతుంది. కానీ కచుడు దేవయానితో గురువు కూతురు సోదరితో సమానం. కాబట్టి పెళ్లి చేసుకోకూడదు అని చెబుతాడు. ఆ మాటలకు కోపం వచ్చిన దేవయాని కచునితో, నువ్వు నేర్చుకున్న విద్య నీకు పనికి రాకుండా పోతుంది అని శపిస్తుంది. 

అయితే కచుడు నేర్చుకున్న విద్య అతనికి పనికిరాకపోయినా. ఇతరులకు పనికి వస్తుంది కదా అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు.

మహాభారతంలో వివరంగా ఉన్న ఈ కథ బాగా పరిశీలిస్తే విద్య ఎంత గొప్పది అయినా, దాన్ని నేర్చిన గురువు ఎంత గొప్పవాడు అయినా మంచిపనులకు ఉపయోగించకుండా చెడు పనులకు ఉపయోగిస్తే అది చివరకు ఇలా తమ వినాశనానికే దారితీస్తుందని అర్థం చేసుకోవచ్చు. అలాగే ఒక వ్యవస్థను కాపాడటానికి ఒక తప్పు చేయడం సరైనదే అనే విషయం కూడా దీని ద్వారా అర్థమవుతుంది.

◆వెంకటేష్ పువ్వాడ


More Purana Patralu - Mythological Stories